Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
80 ఇశ్రాయేలీయుల కాపరీ, నా మాట వినుము.
యోసేపు గొర్రెలను (ప్రజలను) నీవు నడిపించుము.
కెరూబులపై నీవు రాజుగా కూర్చున్నావు. ప్రకాశించుము.
2 ఇశ్రాయేలీయుల కాపరీ, ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షేలకు నీ మహాత్యం చూపించుము.
వచ్చి మమ్మల్ని రక్షించుము.
3 దేవా, మరల మమ్మల్ని స్వీకరించుము.
మేము రక్షించబడునట్లు నీ ముఖాన్ని మా మీద ప్రకాశింపచేయుము.
4 సర్వశక్తిగల యెహోవా దేవా, నీవు మా మీద ఎప్పటికి కోపంగానే ఉంటావా?
మా ప్రార్థనలు నీవు ఎప్పుడు వింటావు?
5 నీవు నీ ప్రజలకు కన్నీళ్లే ఆహారంగా ఇచ్చావు.
నీ ప్రజల కన్నీళ్లతో నిండిన పాత్రలే నీవు నీ ప్రజలకు ఇచ్చావు. అవే వారు తాగుటకు నీళ్లు.
6 మా పొరుగువారు పోరాడుటకు నీవు మమ్మల్ని హేతువుగా ఉండనిచ్చావు.
మా శత్రువులు మమ్మల్ని చూచి నవ్వుచున్నారు.
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
17 దేవా, నీ కుడి ప్రక్క నిలిచి ఉన్న నీ కుమారుని ఆదుకొనుము.
నీవు పెంచిన నీ కుమారుని ఆదుకొనుము.
18 అతడు మరల నిన్ను విడువడు.
అతన్ని బ్రదుక నీయుము. అతడు నీ నామాన్ని ఆరాధిస్తాడు.
19 సర్వశక్తిమంతుడవైన యెహోవా, దేవా, తిరిగి మా దగ్గరకు రమ్ము.
నీ ముఖ మహిమను మామీద ప్రకాశించనీయుము. మమ్మల్ని రక్షించుము.
13 కాని, ఆ సమయంలో దావీదు కుటుంబానికి, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకొరకు ఒక నీటి జల తీయబడుతుంది. ఆ జలం వారి పాపాలను కడిగి, వారిని పవిత్రులుగా చేయటానికి ఉద్దేశించబడుతుంది.
బూటకపు ప్రవక్తలు ఇక వుండరు
2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపైనుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపైనుండి బూటకపు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. 3 ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి వ్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు. 4 అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు. 5 ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడిని. నా చిన్నతనంనుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’ 6 ‘అయితే, నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. 8 దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. 9 చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
ముగ్గురు దూతలు
6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. 7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. 10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. 11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు. 12 అంటే దేవుని ఆజ్ఞలను పాటించే పవిత్రులు యేసుపట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు సహనంగా ఉండాలి.
13 ఆ తదుపరి పరలోకం నుండి ఒక స్వరం, “ఇది వ్రాయి. ఇప్పటి నుండి ప్రభువులో చనిపోయినవాళ్ళు ధన్యులు” అని అన్నది.
“అది నిజం. వాళ్ళకిక విశ్రాంతి ఉంటుంది. ఇది వరకు వాళ్ళు చేసిన మంచిపనులు వాళ్ళ వెంట ఉంటాయి” అని పరిశుద్ధాత్మ అన్నాడు.
© 1997 Bible League International