Revised Common Lectionary (Complementary)
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
నిజమైన దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు సహాయం చేస్తాడు
21 “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో.
ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో.
నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు.
కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు.
22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి.
కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను.
గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా
నీ పాపాలు పోయాయి.
నేను నిన్ను తప్పించి కాపాడాను,
కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”
23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి.
భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది.
పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి.
అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి.
ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక.
ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.
24 నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా చేశాడు.
నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా దీనిని చేశాడు.
“యెహోవాను, నేనే సమస్తం చేశాను.
ఆకాశాలను నేనే అక్కడ ఉంచాను.
నేనే భూమిని నా యెదుట పరచాను.” అని యెహోవా చెబుతున్నాడు.
25 అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబుతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు. 26 ప్రజలకు సందేశాలు అందించేందుకు యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందేశాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయాల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది అని యెహోవా సూచిస్తున్నాడు.
యూదాను పునర్మించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు
“ప్రజలు మరల నీలో నివసిస్తారు” అని యెరూషలేముతో యెహోవా చెబుతున్నాడు.
“మీరు మరల నిర్మించబడతారు” అని యూదా పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు.
“నేను మరల మిమ్మల్ని పట్టణాలుగా చేస్తాను” అని నాశనం చేయబడిన పట్టణాలతో యెహోవా చెబుతున్నాడు.
27 “ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను”
అని లోత్తెన జలాలతో యెహోవా చెబుతున్నాడు.
28 యెహోవా కోరేషుతో[a] చెబుతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి.
నేను కోరిన వాటిని నీవు చేస్తావు.
‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబుతావు.
‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి’” అని నీవు ఆలయంతో చెబుతావు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మార్కు 3:31-35; లూకా 8:19-21)
46 యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు. 47 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు.
48 యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు. 49 తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 50 ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు.
© 1997 Bible League International