Revised Common Lectionary (Complementary)
95 రండి, మనం యెహోవాను స్తుతించుదాము.
మన రక్షణ కొండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము.
2 యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము.
సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము.
3 ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక.
ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు.
4 లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి.
5 మహా సముద్రమూ ఆయనదే. ఆయనే దాన్ని సృష్టించాడు.
దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు.
6 రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము.
మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము.
7 ఆయన మన దేవుడు,
మనం ఆయన ప్రజలము.
మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము.
13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెబుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.
14 “కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెబుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.
15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడవచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”
17 అందుకు మీకాయా ఇలా అన్నాడు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ‘ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”
18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెబుతాడు.”
19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు. 20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. 21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’ అని చెప్పాడు. 22 ‘ఎలామాయలో పడవేయగలవు?’ అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది’” అని అన్నాడు.
23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”
గొఱ్ఱెపిల్ల మరియు లక్షా నలుబది నాలుగు వేల మంది
14 అప్పుడు నేను చూశాను. నా ముందు ఆ గొఱ్ఱెపిల్ల కనబడినాడు. ఆయన సీయోను పర్వతంపై నిలబడి ఉన్నాడు. ఆయనతో ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది ఉన్నారు. వాళ్ళ నొసళ్ళపై ఆయన పేరు, ఆయన తండ్రి పేరు వ్రాయబడి ఉంది.
2 పరలోకం నుండి నాకొక శబ్దం వినిపించింది. ఆ ధ్వని జలపాతపు ధ్వనిలా, పెద్ద ఉరుము ధ్వనిలా ఉంది. నేను విన్న ఆ ధ్వని వీణను మీటినప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 3 వాళ్ళు సింహాసనం ముందు, ఆ నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు నిలబడి ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచించబడ్డ ఒక లక్షా నలుబది నాలుగు వేల మంది తప్ప యితరులు ఆ పాట నేర్చుకోరు.
4 వీళ్ళు స్త్రీ సంపర్కంతో మలినం కాకుండా పవిత్రంగా ఉన్నవాళ్ళు. వీళ్ళు గొఱ్ఱెపిల్ల ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని అనుసరించేవాళ్ళు. వీళ్ళు మానవులనుండి కొనుక్కోబడి ప్రథమ ఫలంగా దేవునికి, గొఱ్ఱెపిల్లకు ప్రత్యేకింపబడినవాళ్ళు. 5 వీళ్ళ మాటల్లో అసత్యం లేదు. వీళ్ళు నిర్దోషులు.
ముగ్గురు దూతలు
6 ఆ తర్వాత మరొక దూత మధ్యాకాశంలో ఎగరటం చూసాను. ప్రపంచంలో నివసించే ప్రజలందరికీ, అంటే ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలకు ప్రకటించటానికి అతని దగ్గర “అనంత జీవితాన్ని” గురించిన సువార్త ఉంది. 7 అతడు బిగ్గరగా, “దేవునికి భయపడండి. ఆయన మహిమను స్తుతించండి. ఆయన తీర్పు చెప్పే గడియ దగ్గరకు వచ్చింది. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నీటి ఊటలను సృష్టించిన వాణ్ణి పూజించండి” అని అన్నాడు.
8 రెండవ దూత మొదటి దూతను అనుసరిస్తూ, “బాబిలోను పతనమైపోయింది. బాబిలోను మహానగరం పతనమైపోయింది. ‘వ్యభిచారం’ అనబడే మద్యాన్ని దేశాలకు త్రాగించింది ఇదే” అని అన్నాడు.
9 మూడవ దూత మొదటి యిద్దరిని అనుసరిస్తూ బిగ్గరగా, “మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించి, దాని ముద్రను నుదుటి మీద గాని, చేతిమీద గాని వేయించుకొన్నవాడు దేవుని కోపమనే మద్యాన్ని త్రాగక తప్పదు. 10 ఈ మద్యం దేవుని ఆగ్రహం అనబడే గిన్నెలో పూర్తి ఘాటుతో చేయబడింది. అంతేకాక పరిశుద్ధమైన దూతల ముందు, గొఱ్ఱెపిల్ల ముందు మండుతున్న గంధకంతో వానిని హింసిస్తారు. 11 వాళ్ళు కాలటంవల్ల రగులుతున్న పొగ చిరకాలం లేస్తూనే ఉంటుంది. మృగాన్ని గాని, దాని విగ్రహాన్ని గాని పూజించే వాళ్ళకు, లేక దాని పేరును ముద్రగా పొందిన వాళ్ళకు పగలు, రాత్రి విరామం ఉండదు” అని అన్నాడు.
© 1997 Bible League International