Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: ముత్లబ్బేను రాగం. దావీదు కీర్తన.
9 పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతిస్తాను.
యెహోవా, నీవు చేసిన అద్భుతకార్యాలన్నింటిని గూర్చి నేను చెబుతాను.
2 నీవు నన్ను ఎంతగానో సంతోషింపజేస్తున్నావు.
మహోన్నతుడవైన దేవా, నీ నామానికి నేను స్తుతులు పాడుతాను.
3 నా శత్రువులు నీ నుండి పారిపోయేందుకు మళ్లుకొన్నారు.
కాని వారు పడిపోయి, నాశనం చేయబడ్డారు.
4 నీవే మంచి న్యాయమూర్తివి. న్యాయమూర్తిగా నీవు నీ సింహాసనం మీద కూర్చున్నావు.
యెహోవా, నీవు నా వ్యాజ్యెం విన్నావు. మరియు నన్ను గూర్చి న్యాయ నిర్ణయం చేశావు.
5 యూదులు కాని ఆ మనుష్యులతో నీవు కఠినంగా మాట్లాడావు.
యెహోవా, ఆ చెడ్డ మనుష్యుల్ని నీవు నాశనం చేశావు.
బతికి ఉన్న మనుష్యుల జాబితాలో నుండి శాశ్వతంగా ఎప్పటికి వారి పేర్లను నీవు తుడిచి వేసావు.
6 శత్రువు పని అంతం అయిపోయింది.
యెహోవా, వారి పట్టణాలను నీవు నాశనం చేశావు.
ఇప్పుడు శిథిల భవనాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఆ దుర్మార్గపు ప్రజలను జ్ఞాపకం చేసుకొనేటట్టు చేసేది ఏమీ మిగల్లేదు.
7 అయితే యెహోవా శాశ్వతంగా పరిపాలిస్తాడు.
యెహోవా తన రాజ్యాన్ని బలమైనదిగా చేసాడు. లోకానికి న్యాయం చేకూర్చేందుకు ఆయన దీనిని చేశాడు.
8 భూమి మీద మనుష్యులందరికీ యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడు.
యెహోవా రాజ్యాలన్నింటికి ఒకే విధంగా తీర్పు తీరుస్తాడు.
9 అనేకమంది ప్రజలకు అనేక కష్టాలు ఉన్నాయి
గనుక వారు చిక్కుబడి, బాధ పొందుతున్నారు.
ఆ ప్రజలు వారి సమస్యల భారంతో నలిగిపోతున్నారు.
యెహోవా, వారు పారిపోవుటకు భద్రతాస్థలంగా ఉండుము.
10 నీ నామం తెలిసిన ప్రజలు
నీమీద విశ్వాసం ఉంచాలి.
యెహోవా, ప్రజలు నీ దగ్గరకు వస్తే
సహాయం చేయకుండా నీవు వారిని విడిచి పెట్టవు.
11 సీయోనులో నివసిస్తున్న ప్రజలారా, మీరు యెహోవాకు స్తుతులు పాడండి.
యెహోవా చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఇతర దేశాలతో చెప్పండి.
12 సహాయం కోసం యెహోవా దగ్గరకు వెళ్లిన వారిని
ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు.
ఆ దీన ప్రజలు సహాయం కోసం మొరపెట్టారు.
మరి యెహోవా వారిని మరచిపోలేదు.
13 దేవుణ్ణి నేను ఇలా ప్రార్థించాను: “యెహోవా, నా మీద దయ చూపుము.
నా శత్రువులు నాకు హాని చేస్తున్న విధం చూడుము.
‘మరణ ద్వారాల’ నుండి నన్ను రక్షించుము.
14 తర్వాత యెరూషలేము గుమ్మాల దగ్గర, యెహోవా, నేను నీకు స్తుతులు పాడగలను.
నీవు నన్ను రక్షించావు గనుక నేను చాలా సంతోషంగా ఉంటాను.”
యెరూషలేమును కొలవటం
2 నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. 2 “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.
“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని అతడు నాకు చెప్పాడు.
3 అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లిపోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. 4 అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు:
‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది.
ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’
5 యెహోవా చెపుతున్నాడు,
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను.
ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”
ఎగిరే చుట్టబడిన పత్రం
5 నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను. 2 “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.
“నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.
3 అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్టబడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసేవారికి ఒక శాపం ఉంది. 4 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’”
చివరి మాట
12 సోదరులారా! మేము ప్రస్తుతం కోరేదేమిటంటే, కష్టపడి పని చేస్తూ ప్రభువు సేవలో మీకు దారి చూపుతూ మీకు బోధిస్తున్న వాళ్ళను గౌరవించండి. 13 వాళ్ళు మంచి కార్యం చేస్తున్నారు కనుక వాళ్ళను అందరికన్నా ఎక్కువగా ప్రేమించి గౌరవించండి.
శాంతంగా జీవించండి. 14 సోదరులారా! సోమరులను వారించండి. పిరికి వాళ్ళకు ధైర్యం చెప్పండి. అందరి పట్ల శాంతంగా ఉండండి. బలహీనుల్ని బలపర్చండి. ఇది మా విజ్ఞాపన. 15 కీడు చేసిన వాళ్ళకు తిరిగి కీడు చేసే వాళ్ళను గమనిస్తూ వాళ్ళను అలా చేయనీయకుండా జాగ్రత్త పడండి. పరస్పరం దయ కలిగి యితర్ల పట్ల దయచూపుతూ ఉండండి.
16 ఎప్పుడూ ఆనందంగా వుండండి. విడువకుండా ప్రార్థించండి. 17 దైవ నియమాన్ని తప్పక పాటించండి. 18 అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. యేసు క్రీస్తు వల్ల కలిగిన జీవితంలో మీరు ఈ విధంగా ఉండాలని దేవుని కోరిక.
© 1997 Bible League International