Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 90:1-8

నాలుగవ భాగం

(కీర్తనలు 90–106)

దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.

90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
    దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.

మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
    తిరిగి రండని నీవు చెప్పుతావు.
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
    గత రాత్రిలా అవి ఉన్నాయి.
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
    ఉదయం గడ్డి పెరుగుతుంది.
    సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
    నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
    దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.

కీర్తనలు. 90:9-11

నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
    మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
    బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
    అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
    కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.

కీర్తనలు. 90:12

12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
    నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.

యెహెజ్కేలు 7:10-27

10 “ఆ శిక్షాకాలం సమీపించింది. హెచ్చరిక ఈల విన్నావా? దేవుడు సూచన చేశాడు. శిక్ష మొదలవుతూ ఉంది. చేతికర్ర చిగురు తొడగటం మొదలు పెట్టింది.[a] అహంకారియైన రాజు (నెబుకద్నెజరు) ఇప్పటికే చాలా బలవంతుడైనాడు. 11 హింసావాదియైన అతడు ఆ దుష్ట ప్రజలను శిక్షించటానికి సిద్ధంగా వున్నాడు. ఇశ్రాయేలులో చాలా మంది మనుష్యులున్నారు. కాని అతడు వారిలో ఒకడు కాదు. ఆ గుంపులో అతడొకడు కాదు. ఆ ప్రజలలో అతడొక ప్రముఖ నాయకుడు కాదు.

12 “ఆ శిక్షాకాలం దరిచేరింది. ఆ రోజు ఇక్కడే వున్నది. సరుకులు కొనుగోలు చేసే జనులు సంతోషపడరు. అమ్మకపుదారులు వారి అమ్మకాల పట్ల విచారపడరు. ఎందువల్లనంటే ఆ భయంకరమైన శిక్ష ప్రతివానికి వస్తుంది గనుక. 13 తమ ఆస్తిని అమ్ముకున్న[b] ప్రజలు, మరి దాని వద్దకు వెళ్లరు. ఏ వ్యక్తి అయినా తప్పించుకుని బ్రతికితే కూడా అతడు తన ఆస్తి వద్దకు ఎన్నడూ మళ్లీ వెళ్లలేడు. ఎందువల్లనంటే, దేవుని ఈ సందేశం అందరికీ సంబంధించినది గనుక. అందువల్ల ఏ ఒక్కడైనా బ్రతికి బయటపడినా, అది ప్రజలను సంతోష పెట్టలేదు.

14 “ప్రజలను హెచ్చరించటానికి వారు బూరలు ఊదుతారు. ప్రజలు యుద్ధ సన్నద్ధులౌతారు. కాని వారు యుద్ధం చేయటానికి మాత్రం బయటికి వెళ్లరు. ఎందువల్లనంటే నేనెంత కోపంగా వున్నానో ఆ సమూహమంతటికీ చూపిస్తాను గనుక. 15 శత్రువు కత్తిపట్టి నగరం వెలుపల కాచివున్నాడు. వ్యాధులు, క్షామము నగరం లోపల ఉన్నాయి. ఏ మనిషేగాని బయట తన పొలానికి వెళ్లితే వేచి వున్న శత్రు సైనికుడు అతన్ని చంపివేస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి నగరంలోనే వుంటే ఆకలి, వ్యాధులు అతన్ని చంపివేస్తాయి.

16 “కాని కొంతమంది ప్రజలు తప్పించుకుంటారు. అలా బ్రతికినవారు పర్వతాలలోకి పారిపోతారు. అయినా వారు సంతోషంగా ఉండలేరు. వారు తమ పాపాలను తలచుకొని కుమిలిపోతారు. వారు ఏడ్చి, పావురాలవలె మూలుగుతారు. 17 ప్రజలు మిక్కిలి అలసిపోయి, దఃఖించి తమ చేతులను కూడా ఎత్తలేరు. వారి కాళ్లు నీళ్లలా ఉంటాయి. 18 వారు విషాదాన్ని సూచించే దుస్తులు ధరిస్తారు. వారిని భయం ఆవరిస్తుంది. ప్రతి ముఖంలోనూ సిగ్గు ముంచుకు రావటం చూస్తావు. విచారాన్ని వ్యక్తంచేస్తూ వారు తమ తలలను గొరిగించుకుంటారు. 19 వారి వెండి విగ్రహాలను వీధుల్లో పారవేస్తారు. బంగారము (విగ్రహాల)ను మురికి గుడ్డల్లా చూస్తారు. యెహోవా తన కోపాన్ని వారిపట్ల చూపించినప్పుడు వారి విగ్రహాలు వారిని రక్షించలేవు గనుక వారలా చేస్తారు. ప్రజలను పాపమార్గంలో పడవేయటానికి విగ్రహాలు ఒక మాయోపాయంలాంటివి. ఆ విగ్రహాలు ప్రజలకు ఆహారాన్ని ఇవ్వలేవు. వారి విగ్రహాలు వారి కడుపు నింపలేవు.

20 “ఆ ప్రజలు వారి విలువైన ఆభరణాలు వినియోగించి ఒక విగ్రహాన్ని తయారుచేశారు. ఆ విగ్రహాన్ని చూచి వారు గర్వపడ్డారు. వారింకా భయానక విగ్రహాలు చేశారు. వారా హేయమైన వస్తువులను చేశారు. కావున దేవుడనైన నేను వారిని మసిబట్టలా విసిరి పారవేస్తాను. 21 పరాయివారు వారిని పట్టుకునేలా చేస్తాను. పరాయి ప్రజలు వారిని ఎగతాళి చేస్తారు. పరాయి జనులు వారిలో కొంతమందిని చంపివేస్తారు. మరి కొంతమందిని చెరపట్టి తీసుకొనిపోతారు. 22 నేను వారిని చూచి ముఖం తిప్పుకుంటాను. నేను వారివంక చూడను. పరాయి మనుష్యులు నా ఆలయాన్ని ధ్వంసం చేస్తారు. ఆ పవిత్ర భవనంలో రహస్య స్థానాలకు వెళ్లి అపవిత్ర పరుస్తారు.

23 “బందీల కొరకు సంకెళ్లు తయారుచేయి! ఎందుకంటే ఇతరులను చంపిన నేరానికి చాలామంది ప్రజలుంటే శిక్షింపబడతారు గనుక ఈ గొలుసులు తయారు చేయాలి. నగరంలో ప్రతిచోటా దౌర్జన్యం చెలరేగుతుంది. 24 రాజ్యాల నుండి చెడ్డ వ్యక్తులను తీసుకువస్తాను. ఆ చెడ్డ మనుష్యులు ఇశ్రాయేలీయుల ఇండ్లన్నిటినీ ఆక్రమిస్తారు. శక్తివంతులైన మీ ప్రజలందరినీ గర్వించకుండా చేస్తాను. అన్యదేశీయులు మీ ఆరాధన స్థలాలన్నిటినీ వశపర్చుకుంటారు.

25 “మీ ప్రజలందరూ భయంతో పణికిపోతారు. మీరు శాంతికోసం ఎదురుచూస్తారు. కాని అది మీకు లభ్యం కాదు. 26 ఒక విషాద గాధ తరువాత మరియొకటి మీరు వింటారు. చెడ్డవార్తలు మినహా మరేమీ వినరు. మరొక ప్రవక్త కొరకు వెదికి, దర్శన విషయం అడుగుతారు. ఒక్కటికూడ మీకు వుండదు. యాజకులు మీకు బోధించేదేమీ లేదు. పెద్దలు మీకిచ్చే మంచి సలహా ఏమీ వుండదు. 27 చనిపోయిన ప్రజల కొరకు మీ రాజు దుఃఖిస్తాడు. నాయకులు విషాద సూచక దుస్తులు ధరిస్తారు. సామాన్య జనులు మిక్కిలి భయపడతారు. ఎందువల్లనంటే వారు చేసిన పనులను నేను తిప్పికొడతాను. నేను వారికి శిక్షను నిర్ణయిస్తాను. వారిని నేను శిక్షిస్తాను. అప్పుడా ప్రజలు నేను యెహోవానని తెలుసుకుంటారు.”

మత్తయి 12:43-45

శూన్యమై ఉండుట అపాయము

(లూకా 11:24-26)

43 “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు. 44 అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది. 45 అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International