Revised Common Lectionary (Complementary)
నాలుగవ భాగం
(కీర్తనలు 90–106)
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
90 ప్రభువా, శాశ్వతంగా నీవే మా నివాసం.
2 పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు.
దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు.
3 మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా,
తిరిగి రండని నీవు చెప్పుతావు.
4 నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి.
గత రాత్రిలా అవి ఉన్నాయి.
5 నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము.
మేము గడ్డిలా ఉన్నాము.
6 ఉదయం గడ్డి పెరుగుతుంది.
సాయంత్రం అది ఎండిపోయి ఉంటుంది.
7 దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము.
నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది!
8 మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు.
దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు.
9 నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు.
మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి.
10 మేము 70 సంవత్సరాలు జీవిస్తాము.
బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము.
మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి.
అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము.
11 దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు.
కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి.
12 మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు
నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము.
యెరూషలేముకు నాశనం వస్తుంది
7 పిమ్మట యెహోవా వాక్కు నాకు చేరింది. 2 ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, నా ప్రభువైన యెహోవా నుండి ఒక సందేశం ఉంది. అది ఇశ్రాయేలు దేశానికి సంబంధించినది:
“అంతం వచ్చింది.
దేశం యావత్తూ నాశనమవుతుంది.
3 ఇప్పుడు నీ అంతం సమీపించింది.
నేను నీ పట్ల ఎంత కోపంగా ఉన్నానో చూపిస్తాను.
నీ చెడు కార్యాలకు నిన్ను నేను శిక్షిస్తాను.
నీవు చేసిన భయంకరమైన పనులకు ఫలమనుభవిస్తావు.
4 నీ పట్ల నేను కనికరం చూపను. నిన్ను చూచి విచారించను.
నీవు చేసిన చెడ్డకార్యాలకు నిన్ను నేను శిక్షిస్తున్నాను.
నీవు ఘోరమైన పనులు చేశావు.
నేను యెహోవానని నీవిప్పుడు తెలుసు కొంటావు.”
5 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఒక విపత్తు తరువాత మరొకటి వస్తుంది: 6 అంతం సమీపిస్తున్నది! అవసానదశ వస్తున్నది. అది అతి త్వరలో సంభవిస్తుంది! 7 ఇశ్రాయేలులో నివసిస్తున్న ప్రజలారా, హెచ్చరించే ఈల శబ్దం వింటున్నారా? శత్రువు వచ్చిపడుతున్నాడు. శిక్షాకాలం అతి దగ్గరలో ఉంది! శత్రుసైన్యపు రణగొణ ధ్వనులు పర్వతాలపై మరీ మరీ ఎక్కువగా వినవస్తున్నాయి. 8 నేనెంత కోపంగా వున్నానో అతి త్వరలో మీకు నేను చూపిస్తాను. మీమీద నాకున్న కోపాన్నంతా చూపిస్తాను. మీరు చేసిన చెడు కార్యాలకు మిమ్ముల్ని నేను శిక్షిస్తాను. మీరు చేసిన భయంకరమైన పనులన్నిటికీ మీరు ప్రతి ఫలం చెల్లించేలా చేస్తాను. 9 మీ పట్ల ఏ మాత్రం కనికరం చూపను. మిమ్ముల్ని చూచి విచారపడను. మీరటువంటి భయంకరమైన పాపాలు చేశారు. నేను ప్రభువైన యెహోవానని, నేనే మిమ్ముల్ని కొడతానని మీరు తెలుసుకుంటారు.
8 నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. 9 తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.
10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు.
12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.
15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”
16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.
17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.
© 1997 Bible League International