Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 63

దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.

63 దేవా, నీవు నా దేవుడవు.
    నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
    నీకొరకు దాహంగొని ఉన్నాయి.
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
    నీ బలము నీ మహిమలను నేను చూశాను.
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
    నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
    నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
    నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
    రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
    నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
    నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
    వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
    అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
    ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.

యోవేలు 3:9-21

యుద్ధానికి సిద్ధపడండి

రాజ్యాలలో దీనిని ప్రకటించండి:
    యుద్ధానికి సిద్ధపడండి!
బలాఢ్యులను మేల్కొలపండి!
    యుద్ధ వీరులందరినీ దగ్గరగా రానివ్వండి,
    వారిని రానివ్వండి!
10 మీ నాగటి కర్రులను చెడగొట్టి కత్తులు చేయండి.
    మీ పోటు కత్తులు చెడగొట్టి ఈటెలు చేయండి.
బలహీనుడ్ని కూడ
    “నేను బలాఢ్యుడను” అని చెప్పనీయండి.
11 సకల రాజ్యాల్లారా, త్వరపడండి!
    ఆ స్థలానికి కూడి రండి!
    యెహోవా, బలమైన నీ సైనికులను తీసికొని రా.
12 రాజ్యాల్లారా, మేల్కొనండి.
    యెహోషాపాతు లోయలోనికి రండి.
చుట్టుపక్కల రాజ్యాలన్నింటికీ తీర్పు చెప్పేందుకు
    అక్కడ నేను కూర్చుంటాను.
13 పంట సిద్ధంగా ఉంది గనుక
    కొడవలి పట్టుకొని రండి.
రండి, ద్రాక్షా గానుగ నిండిపోయింది గనుక
    ద్రాక్షాపండ్లమీద నడవండి.
వారి దుర్మార్గం చాలాఉంది గనుక
    పీపాలు నిండిపోయి పొర్లిపోతాయి.
14 తీర్మాన లోయలో ఎంతో మంది ప్రజలు ఉన్నారు.
    యెహోవా ప్రత్యేక దినం తీర్మాన లోయకు సమీపంగా ఉంది.
15 సూర్యుడు, చంద్రుడు చీకటి అవుతాయి.
    నక్షత్రాలు ప్రకాశించడం మానివేస్తాయి.
16 యెహోవా దేవుడు సీయోనులోనుండి కేకవేస్తాడు.
యెరూషలేమునుండి ఆయన కేక వేస్తాడు.
    మరియు ఆకాశం, భూమి కంపిస్తాయి.
కాని యెహోవా దేవుడే ఆయన ప్రజలకు క్షేమస్థానం.
    ఇశ్రాయేలు ప్రజలకు ఆయన క్షేమస్థానంగా ఉంటాడు.
17 “మీ యెహోవా దేవుడను నేనే అని అప్పుడు మీరు తెలుసుకొంటారు.
    నా పవిత్ర పర్వతమైన సీయోనులో నేను నివసిస్తాను.
యెరూషలేము పవిత్రం అవుతుంది.
    పరాయివారు ఆ పట్టణంలోనుండి మరల ఎన్నడూ దాటి వెళ్లరు.”

యూదాకు కొత్తజీవితం వాగ్దానం చేయబడుట

18 “ఆ రోజున పర్వతాలనుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది.
    కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి.
    మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి.
యెహోవా ఆలయంలోనుండి ఒక నీటి ఊట చిమ్ముతుంది.
    అది షిత్తీము లోయకు నీళ్ళు ఇస్తుంది.
19 ఈజిఫ్టు ఖాళీ అవుతుంది.
    ఎదోము ఖాళీ అరణ్యం అవుతుంది.
ఎందుకంటే యూదా ప్రజలపట్ల వారు క్రూరంగా ఉన్నారు.
    వారి దేశంలోని నిర్దోషప్రజలను వారు చంపివేశారు.
20 కాని యూదాలో మనుష్యులు ఎల్లప్పుడూ నివసిస్తారు.
    అనేక తరాలవరకు యెరూషలేములో మనుష్యులు నివసిస్తారు.
21 ఆ మనుష్యులు చాలా మంది ప్రజలను చంపేశారు.
    కనుక ఆ ప్రజలను నేను నిజంగా శిక్షిస్తాను!”

యెహోవా దేవుడు సీయోనులో నివసిస్తాడు.

మత్తయి 24:29-35

29 “ఆ కష్టకాలం గడిచిన వెంటనే,

‘దేవుడు సూర్యుణ్ణి చీకటిగా చేస్తాడు.
    చంద్రుడు వెలుగునివ్వడు
నక్షత్రాలు ఆకాశంనుండి రాలిపోతాయి
    ఆకాశంలోని శక్తులు కదలిపోతాయి.’[a]

30 “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూమ్మీద ఉన్న దేశాలన్నీ దుఃఖిస్తాయి. మనుష్యకుమారుడు శక్తితో, గొప్ప తేజస్సుతో ఆకాశంలోని మేఘాలపై రావటం వాళ్ళు చూస్తారు. 31 అప్పుడు దేవుడు తన దూతల్ని గొప్ప బూరధ్వనితో పంపుతాడు. ఆ దూతలు నలువైపుల నుండి అంటే, ఆ చివరి నుండి ఈ చివరిదాకా గాలించి దేవుడెన్నుకొన్న వాళ్ళను ప్రోగు చేస్తారు.

32 “ఇక ఇప్పుడు అంజూరపు చెట్టు ఉపమానాన్ని గురించి నేర్చుకొండి. వాటి రెమ్మలు మృదువై ఆకులు చిగురించగానే, ఎండకాలం దగ్గరకు వచ్చిందని మీకు తెలిసి పోతుంది. 33 అదే విధంగా నేను చెప్పినవన్నీ చూసిన వెంటనే ఆయన దగ్గరలోనే ఉన్నాడని అంటే మీ తలుపు ముందే ఉన్నాడని తెలుసుకొంటారు. 34 ఇది సత్యం. ఇవన్నీ జరిగేదాకా ఈ తరం వాళ్ళు జీవించే ఉంటారు. 35 భూమి, ఆకాశము నశించి పోతాయి కాని నా మాటలు శాశ్వతంగా నిలిచి పోతాయి!

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International