Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
63 దేవా, నీవు నా దేవుడవు.
నాకు నీవు ఎంతగానో కావాలి.
నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా
నీకొరకు దాహంగొని ఉన్నాయి.
2 అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను.
నీ బలము నీ మహిమలను నేను చూశాను.
3 నీ ప్రేమ జీవం కన్నా గొప్పది.
నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి.
4 అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను.
నీ పేరట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను.
5 శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను.
నా నోరు నిన్ను స్తుతిస్తుంది.
6 నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను.
రాత్రి జాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను.
7 నీవు నిజంగా నాకు సహాయం చేశావు.
నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను.
8 నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది.
నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది.
9 కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు.
వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు.
10 ఖడ్గములతో వారు చంపబడతారు.
అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి.
11 అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు.
ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్ధీకులందరినీ ఆయన ఓడించాడు.
మిడుతలు పంటలను పాడుచేయుట
1 పెతూయేలు కుమారుడైన యోవేలు ఈ సందేశాన్ని యెహోవా దగ్గరనుండి అందుకొన్నాడు:
2 నాయకులారా, ఈ సందేశం వినండి!
దేశంలో నివసించే మనుష్యులారా, మీరందరూ నామాట వినండి.
మీ జీవితకాలంలో ఇలాంటిది ఏదైనా ఇదివరకు జరిగిందా?
లేదు! మీతండ్రుల కాలంలో ఇలాంటిది ఏదైనా జరిగిందా? లేదు!
3 ఈ సంగతులను గూర్చి మీరు మీ పిల్లలతో చెపుతారు.
మీపిల్లలు వారి పిల్లలతో చెపుతారు.
మీ మనుమలు, మనుమరాండ్రు తమ తరువాత తరమువారితో చెపుతారు.
4 కోత మిడుతలు విడిచిపెట్టినదానిని
దండు మిడుతలు తినేస్తాయి
దండు మిడుతలు విడిచిపెట్టినదానిని
దూకుడు మిడుతలు తినేస్తాయి.
దూకుడు మిడుతలు విడిచిపెట్టినదానిని
వినాశ మిడుతలు తినేశాయి!
మిడుతలు—పెద్ద దండు
5 మద్యపాన మత్తులారా, మేల్కొని, ఏడ్వండి!
ద్రాక్షామద్యం తాగే మీరందరూ ఏడ్వండి.
ఎందుకంటే, మీ క్రొత్త ద్రాక్షామద్యం అయిపోయింది.
ఆ ద్రాక్షామద్యం మరో గుక్కెడు మీకు దొరకదు.
6 నా రాజ్యం మీద యుద్ధం చేయటానికి, ఒక పెద్ద శక్తిగల రాజ్యం వస్తోంది.
వారు లెక్కించ శక్యం కానంతమంది సైనికులు ఉన్నారు.
ఆ మిడుతలు (శత్రుసైనికులు) మిమ్మల్ని నిలువునా చీల్చివేయగలవు!
అది వారికి సింహపుకోరలు ఉన్నట్టుగా ఉంటుంది.
7 నా ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపళ్ళు అన్నింటినీ
ఆ “మిడుతలు” తినేస్తాయి!
అవి నా అంజూరపు చెట్లను నాశనం చేస్తాయి.
మిడుతలు నా చెట్ల బెరడును తినేస్తాయి.
కొమ్మలు తెల్లబారి పోతాయి.
చెట్లు నాశనం చేయబడతాయి.
ప్రజలు దుఃఖించుట
8 పెళ్లికి సిద్ధంగా ఉండి, తనకు కాబోయే భర్త
అప్పుడే చంపి వేయబడగా, ఒక యువతి ఏడ్చేలా ఏడ్వండి.
9 యాజకులారా! యెహోవా సేవకులారా! ఏడ్వండి.
ఎందుకంటే యెహోవా ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇక ఉండవు.
10 పొలాలు పాడుచేయబడ్డాయి.
చివరికి నేలకూడా విలపిస్తుంది.
ఎందుకనగా ధాన్యం పాడైపోయింది.
కొత్త ద్రాక్షారసం ఎండిపోయింది.
ఒలీవ నూనె ఇకలేదు.
11 రైతులారా! విచారించండి.
ద్రాక్షాతోట రైతులారా! గట్టిగా ఏడ్వండి.
గోధుమ, యవల[a] కోసం ఏడ్వండి!
ఎందుకంటే పొలంలోని పంట నష్టమైంది.
12 ద్రాక్షావల్లులు ఎండిపోయాయి.
అంజూరపుచెట్టు చస్తోంది.
దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు,
జల్దరు[b] చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండిపోయాయి.
ప్రజల్లో సంతోషం చచ్చింది.
13 యాజకులారా, మీ విచార సూచక వస్త్రాలు ధరించి గట్టిగా ఏడ్వండి.
బలిపీఠపు సేవకులారా, గట్టిగా ఏడ్వండి.
నా దేవుని సేవకులారా, మీరు మీ విచారసూచక వస్త్రాలతోనే నిద్రపోతారు.
ఎందుకంటే, దేవుని ఆలయంలో ధాన్యార్పణం, పానీయార్పణం ఇకమీదట ఉండవు.
మిడుతల భయంకర నాశనం
14 ఉపవాసం ఉండాల్సిన ఒక ప్రత్యేక సమయం ఉంటుందని ప్రజలతో చెప్పు. ప్రత్యేకమైన ఒక సమావేశం కోసం ప్రజల్నిపిలువుము. దేశంలో నివసిస్తున్న నాయకులను, ప్రజలందరిని సమావేశ పరచు. నీదేవుడైన యెహోవా ఆలయానికి వారిని తీసుకొనివచ్చి యెహోవాకు ప్రార్థించండి.
6 కాని తిమోతి మీ దగ్గర నుండి యిప్పుడే వచ్చాడు. మీ విశ్వాసాన్ని గురించి, మీ ప్రేమను గురించి మంచి వార్త తీసుకొని వచ్చాడు. మమ్మల్ని గురించి అన్ని వేళలా మీరు మంచిగా భావిస్తున్నారని తెలిసింది. మేము మిమ్మల్ని చూడటానికి ఎదురు చూస్తున్నట్లే, మీరు కూడా మమ్మల్ని చూడటానికి ఆశిస్తున్నారని అతడు మాకు చెప్పాడు. 7 సోదరులారా! మేము దుఃఖంతో ఉన్నప్పుడు, హింసలను అనుభవిస్తున్నప్పుడు మీ విశ్వాసం చూసి ఆనందించాము. 8 మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది. 9 మేము దేవుని సమక్షంలో ఉన్నప్పుడు మీ విషయంలో చాలా కృతజ్ఞులము. మేము ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా అవి తక్కువే! 10 మిమ్మల్ని చూసే అవకాశం కలగాలని, మీ విశ్వాసం దృఢపడాలని, దానికి కావలసినవి దేవుడు ఇవ్వాలని, రాత్రింబగళ్ళు మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాము.
11 మన తండ్రియైన దేవుడు, మన ప్రభువైన యేసు మేము మీ దగ్గరకు రావటానికి మాకు దారి చూపుగాక! 12 మీపై ఉన్న మా ప్రేమ అభివృద్ధి చెందుతున్నట్లే, మీలో పరస్పరం ప్రేమ అభివృద్ధి చెందేటట్లు, యితరుల పట్ల కూడా మీ ప్రేమ అభివృద్ధి చెందేటట్లు ప్రభువు అనుగ్రహించుగాక. 13 మన యేసు ప్రభువు భక్తులతో వచ్చినప్పుడు మన తండ్రియైన దేవుని ముందు మీరు ఏ అపకీర్తి లేకుండా పవిత్రంగా ఉండేటట్లు దేవుడు మీకు శక్తి ననుగ్రహించు గాక!
© 1997 Bible League International