Revised Common Lectionary (Complementary)
18 మీలో కొంతమంది
యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు.
అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు?
యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై
ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు!
ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా
పాము కరచినవాని మాదిరి మీరుంటారు!
20 కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము
చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు!
ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.
ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం
21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!
నేను వాటిని అంగీకరించను!
మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,
నేను వాటిని స్వీకరించను!
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు
నేను కనీసం చూడనైనా చూడను.
23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి.
మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.
మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
సంగీత నాయకునికి: ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.
70 దేవా, నన్ను రక్షించుము.
దేవా త్వరపడి నాకు సహాయం చేయుము.
2 మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు.
వారిని నిరాశపరచుము.
వారిని అవమానించుము.
మనుష్యులు నాకు చెడు కార్యాలు చేయాలని కోరుతున్నారు.
వారు పడిపోయి సిగ్గు అనుభవిస్తారని నా నిరీక్షణ.
3 మనుష్యులు నన్ను హేళన చేసారు.
వారికి తగినదాన్ని పొందుతారని నా నిరీక్షణ.
4 నిన్ను ఆరాధించే ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను.
నీ మూలంగా రక్షించబడుటకు ఇష్టపడే మనుష్యులు ఎల్లప్పుడూ నిన్ను స్తుతించగలుగుతారు.
5 నేను నిరుపేదను, నిస్సహాయుణ్ణి.
దేవా, త్వరపడి! వచ్చి నన్ను రక్షించుము.
దేవా, నన్ను తప్పించగలవాడవు నీవు ఒక్కడవు మాత్రమే.
ఆలస్యం చేయవద్దు!
ప్రభువు రాకడ
13 సోదరులారా! చనిపోయినవాళ్ళను గురించి మీకు తెలియాలని మా కోరిక. బ్రతుకుపై ఆశలేని వాళ్ళవలే దుఃఖించరాదని మా కోరిక. 14 యేసు చనిపోయి తిరిగి బ్రతికివచ్చాడని మనం నమ్ముతాము. అందుకే యేసును విశ్వసించినవాళ్ళు మరణించినప్పుడు దేవుడు వాళ్ళను ఆయనతో సహా బ్రతికిస్తాడని కూడా మనం విశ్వసిస్తాము.
15 ప్రభువు వచ్చేవరకు మనం బ్రతికి ఉంటే, యింతకు క్రితము చనిపోయినవాళ్ళకంటే ముందు వెళ్ళము. ఇది ప్రభువు స్వయంగా చెప్పాడు. 16 ప్రభువు పరలోకం నుండి దిగివచ్చినప్పుడు ప్రధాన దూతతో అధికార పూర్వకంగా వస్తాడు. అప్పుడు ప్రధాన దూత శబ్దము, దేవుని బూర శబ్దం వినిపిస్తాయి. అప్పుడు క్రీస్తులో చనిపోయినవాళ్ళు మొదటలేస్తారు. 17 ఆ తర్వాత యింకా బ్రతికి ఉన్న మనల్ని ప్రభువు వాళ్ళతో సహా ఆకాశంలో ఉన్న మేఘాల్లోకి తీసుకువెళ్తాడు. అప్పటినుండి మనం ఆయనతో చిరకాలం ఉండిపోతాము. 18 అందువల్ల వీటిని గురించి మాట్లాడుకొని పరస్పరం ధైర్యం చెప్పుకోండి.
పది మంది కన్యకల ఉపమానం
25 “దేవుని రాజ్యం ఇలా ఉంటుంది: పది మంది కన్యకలు తమ తమ దీపాలు తీసుకొని పెళ్ళి కుమారుణ్ణి కలవటానికి వెళ్ళారు. 2 వాళ్ళలో ఐదుగురు తెలివిలేని వాళ్ళు; ఐదుగురు తెలివిగల వాళ్ళు. 3 తెలివి లేని కన్యలు దీపాలు తీసుకెళ్ళారు కాని తమ వెంట నూనె తీసుకు వెళ్ళలేదు. 4 తెలివిగల కన్యలు తమ దీపాలతో పాటు పాత్రలో నూనె కూడా తీసుకు వెళ్ళారు. 5 పెళ్ళి కుమారుడు రావటం ఆలస్యం అయింది. అందరికి కునుకు వచ్చి నిద్దుర పొయ్యారు.
6 “అర్థరాత్రి వేళ, ‘అదిగో పెళ్ళి కుమారుడు! వచ్చి చూడండీ!’ అని ఎవరో బిగ్గరగా కేక వేసారు.
7 “వెంటనే ఆ కన్యకలందరూ లేచి తమ దీపాల్ని సరి చేసుకొన్నారు. 8 తెలివి లేని కన్యలు ‘మీ నూనె కొద్దిగా మాకివ్వండి; మా దీపాలలో నూనంతా అయిపోయింది!’ అని తెలివిగల కన్యల్ని అడిగారు.
9 “తెలివి గల కన్యలు, ‘ఈ నూనె మనకందరికి సరిపోదేమో! దుకాణానికి వెళ్ళి మీకోసం కొద్ది నూనె కొనుక్కురండి’ అని సమాధానం చెప్పారు.
10 “కాని వాళ్ళు నూనె కొనుక్కురావటానికి వెళ్ళినప్పుడు పెళ్ళి కుమారుడు వచ్చాడు. సిద్ధంగా ఉన్న కన్యలు పెళ్ళి విందుకు అతనితో కలసి లోపలికి వెళ్ళారు. ఆ తదుపరి తలుపు వేయబడింది.
11 “మిగతా కన్యలు వచ్చి, ‘అయ్యా! అయ్యా! తలుపు తెరవండి’ అని అడిగారు.
12 “కాని అతడు, ‘నేను నిజం చెబుతున్నాను; మీరెవరో నాకు తెలియదు’ అని సమాధానం చెప్పాడు.
13 “మీకు ఆ రోజు, ఆ ఘడియ ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మెలకువతో ఉండండి.
© 1997 Bible League International