Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన
5 యెహోవా, నా మాటలు ఆలకించుము.
నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
2 నా రాజా, నా దేవా
నా ప్రార్థన ఆలకించుము.
3 యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.
4 యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
5 గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
6 అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.
7 యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
8 యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
అది నాకు తేటగా చూపించుము.
9 ఆ మనుష్యులు సత్యం చెప్పరు.
వాళ్లు జనాన్ని నాశనం చేయకోరుతారు.
వారి నోళ్ళు ఖాళీ సమాధుల్లా ఉన్నాయి.
ఆ మనుష్యులు ఇతరులకు చక్కని మాటలు చెబుతారు. కాని వాళ్లను చిక్కుల్లో పెట్టుటకు మాత్రమే వారు ప్రయత్నిస్తున్నారు.
10 దేవా! వారిని శిక్షించుము.
వారి ఉచ్చులలో వారినే పట్టుబడనిమ్ము.
ఆ మనుష్యులు నీకు విరోధంగా తిరిగారు
కనుక వారి విస్తార పాపాల నిమిత్తం వారిని శిక్షించుము.
11 అయితే దేవునియందు విశ్వాసం ఉంచే ప్రజలందరినీ సంతోషించనిమ్ము.
ఆ ప్రజలను శాశ్వతంగా సంతోషించనిమ్ము. దేవా, నీ నామమును ప్రేమించే ప్రజలకు భద్రత, బలం ప్రసాదించుము.
12 యెహోవా, మంచి మనుష్యులకు నీవు మంచివాటిని జరిగిస్తే
అప్పుడు నీవు వారిని కాపాడే గొప్ప కేడెంలా ఉంటావు.
13 సీయోను కుమారీ, నిన్ను దేనితో సరిపోల్చను?
నిన్ను దేనితో పోల్చాలి?
సీయోను కుమారీ, నిన్ను దేనితో పోల్చను?
నిన్నెలా ఓదార్చగలను?
నీ వినాశనం సముద్రమంత పెద్దది!
ఎవ్వరేగాని నిన్ను స్వస్థపర్చగలరని నేను అనుకోవటంలేదు.
14 నీ ప్రవక్తలు నీ కొరకు దర్శనాలు చూశారు.
కాని వారి దర్శనాలన్నీ విలువలేని అబద్ధాలు.
పాపం చేయవద్దని వారు నిన్ను హెచ్చరించలేదు.
పరిస్థితి మెరుగుపర్చటానికి వారు ఎట్టి ప్రయత్నమూ చేయలేదు.
వారు నీకొరకు ఉపదేశాలు అందించారు.
కాని, అవి కేవలం నిన్ను మోసగించటానికి ఉద్దేశించబడిన అబద్ధపు వర్తమానాలు.
15 మార్గమున పోవు వారు నిన్ను చూసి
విస్మయంతో చేతులు చరుస్తారు.
యెరూషలేము కుమార్తెను చూచి
వారు ఈలవేసి తలలు ఆడిస్తారు.
“‘అపురూప అందాల నగరం’ అనీ,
‘భూనివాసులకు ఆనంద దాయిని’ అని
‘ప్రజలు పిలిచే నగరం ఇదేనా’?” అని వారడుగుతారు.
16 నీ శత్రువులంతా నిన్ను చూసి నోళ్లు తెరుస్తారు.
వారు ఈలవేసి, నిన్నుజూచి పండ్లు కొరుకుతారు.
“మేము వారిని మింగేశాము!
నిజంగా మేము ఈ రోజుకొరకే ఎదురుచూశాము.
చివరకు ఇది జరగటం మేము చూశాము”
అని వారంటారు.
17 యెహోవా తాను అనుకున్న ప్రకారమే చేశాడు.
ఆయన ఏది చేస్తానని అన్నాడో అది చేసివేశాడు.
పూర్వకాలం నుండి ఆయన ఎలా హెచ్చరిస్తూవచ్చాడో ఆయన ఇప్పుడు అలాగే చేశాడు.
దయాదాక్షిణ్యం లేకుండా ఆయన నాశనం చేశాడు.
నీ మూలంగానే నీ శత్రువులు సంతోషపడేలా ఆయన చేశాడు.
ఆయన నీ శత్రువుల శక్తియుక్తులను పెంచాడు.
బర్నబాను, సౌలును ఎన్నుకొని పంపటం
13 అంతియొకయలోని సంఘంలో ఉన్న ప్రవక్తలు, పండితులు ఎవరనగా: బర్నబా, “నీగెరు” అని పిలువబడే “సుమెయోను”, కురేనీ గ్రామానికి చెందిన లూకియ, మనయేను, (ఇతడు, సామంత రాజైన హేరోదు, యిద్దరూ కలిసి పెరిగారు), మరియు సౌలు. 2 వీళ్ళు ఉపవాసాలు చేసి ప్రభువును ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ, “బర్నబాను, సౌలును నా కోసం వేరుచేయండి. వాళ్ళను ఒక ప్రత్యేకమైన పని కోసం పిలిచాను” అని అన్నాడు.
3 అక్కడున్నవాళ్ళు వీళ్ళిద్దర్ని పంపే ముందు ప్రార్థనలు, ఉపవాసాలు చేసి, వాళ్ళపై తమ చేతులుంచి పంపారు.
సైప్రసులో
4 పవిత్రాత్మ వాళ్ళను పంపాడు. వాళ్ళు “సెలూకయ” అనే పట్టణానికి వెళ్ళి అక్కడినుండి ఓడలో ప్రయాణం చేసి సైప్రసు (కుప్ర) అనే ద్వీపాన్ని చేరుకున్నారు. 5 అక్కడినుండి సలామి అనే పట్టణానికి వెళ్ళారు. అక్కడున్న యూదుల సమాజ మందిరాల్లో దైవసందేశాన్ని ప్రకటించారు. వాళ్ళకు సహాయంగా యోహాను వాళ్ళ వెంటే ఉన్నాడు.
6 వాళ్ళు ఆ ద్వీపాన్నంతా పర్యటించి “పాఫు” అనే పట్టణం చేరుకున్నారు. మాయాజాలం చేస్తూ తానొక ప్రవక్తనని చెప్పుకుంటున్న వ్యక్తిని అక్కడ కలుసుకున్నారు. అతడు యూదుడు. పేరు “బర్ యేసు,” 7 అతడు “సెర్గి పౌలు” అనే రాష్ట్రపాలకునికి సన్నిహితంగా ఉండేవాడు. సెర్గి పౌలు తెలివిగలవాడు. దైవసందేశాన్ని వినాలని బర్నబాను, సౌలును ఆహ్వానించాడు. 8 ఎలుమ రాష్ట్రపాలకుణ్ణి ఈ విశ్వాసానికి దూరంగా ఉంచాలని ప్రయత్నించాడు. “ఎలుమ” అనగా గ్రీకు భాషలో మాయాజాలకుడు. 9 అప్పుడు సౌలు (ఇతణ్ణి పౌలు అని కూడా పిలిచే వారు) పరిశుద్ధాత్మతో నిండిపోయి ఎలుమను సూటిగా చూస్తూ, 10 “నీవు సాతానుకు పుట్టావు! మంచిదన్న ప్రతిదీ నీకు శత్రువు! నీలో అన్ని రకాల మోసాలు, కుట్రలు ఉన్నాయి! ప్రభువు యొక్క సక్రమ మార్గాల్ని వక్రంగా మార్చటం ఎప్పుడు మానుకొంటావు? 11 ఇదిగో చూడు, ప్రభువు ఇప్పుడు నిన్ను శిక్షిస్తాడు. కొంతకాలం దాకా నీవు సూర్యుని వెలుగు చూడలేవు! గ్రుడ్డివాడివై పోతావు!” అని అన్నాడు.
తక్షణమే పొగమంచు, చీకట్లు అతణ్ణి చుట్టివేసాయి. తన చేయి పట్టుకొని నడిపేందుకు ఎవరైనా దొరుకుతారేమోనని తారాడుతూ చూసాడు. 12 ఆ రాష్ట్రపాలకుడు ప్రభువును గురించి చెప్పిన బోధలు విని ఆశ్చర్యపడి ప్రభువును నమ్మాడు.
© 1997 Bible League International