Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 43

43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
దేవా, నీవే నా క్షేమ స్థానం.
    నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
    నేనెందుకు విచారంగా ఉండాలి?
దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
    నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
    దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
    దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.

నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
    నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
    నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
    నా దేవుడే నాకు సహాయము.

మలాకీ 1:6-2:9

ప్రజలు దేవుని గౌరవించరు

“పిల్లలు తమ తండ్రిని గౌరవిస్తారు. సేవకులు తమ యజమానులను గౌరవిస్తారు. నేను మీ తండ్రిని. మరి మీరెందుకు నన్ను గౌరవించరు? నేను మీ యజమానిని. అయినను నేనంటే భయభక్తులు ఎందుకు లేవు మీకు? యాజకులారా, మీరు నా పేరును అగౌరవపరుస్తున్నారు” అని సర్వశక్తిమంతుడైన యెహోవా అన్నాడు.

కాని మీరు, “మేము నీ పేరును అగౌరవపరచామని చూపించడానికి మేము ఏమి చేశాం?” అని అంటారు.

“పాడై పోయిన రొట్టెను మీరు నా బలిపీఠం దగ్గరకు తీసికొని వస్తారు” (అని యెహోవా చెప్పాడు.)

కానీ మీరు “ఆ రొట్టెను ఏది పాడు చేస్తుంది?” అని అంటారు.

(యెహోవా చెప్పాడు,) “నా బల్లను మీరు గౌరవించరు. గుడ్డి జంతువులను బలిగా మీరు తీసికొని వస్తారు. అది తప్పు! బలి అర్పణల కోసం కుంటి మరియు జబ్బు జంతువులను మీరు తీసికొని వస్తారు. మరి అదీ తప్పు. ఆ జబ్బు జంతువులను మీ దేశాధికారికి ఇచ్చి చూడండి. ఆ జబ్బు జంతువులను అతడు కానుకలుగా స్వీకరిస్తాడా? లేదు! ఆ కానుకలు అతడు అంగీకరించడు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“యాజకులారా! యెహోవా మా యెడల దయగలిగి ఉండాలని మీరు ఆయనను అడగాలి. కాని ఆయన మీ మాట వినడు. ఆ తప్పు అంతా మీదే”. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

10 “కనీసం, మీ యాజకుల్లో కొందరు దేవాలయం తలుపులు మూయవచ్చు, హోమాలు సరిగ్గా వెలిగించవచ్చు. మీ విషయం నాకు సంతోషంగా లేదు. నేను మీ కానుకలు అంగీకరించను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు చెప్పాడు.

11 “ప్రపంచం అంతటా మనుష్యులు నన్ను గౌరవిస్తారు. ప్రపంచం అంతటా మనుష్యులు నాకు మంచి కానుకలు అర్పిస్తారు. నాకు కానుకగా వారు మంచి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఎందుకంటే, ఆ మనుష్యులందరికీ నా పేరు ముఖ్యం గనుక.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

12 “కానీ మీరు మాత్రం నా పేరు అంటే మీకు గౌరవం లేదని చూపించారు. యెహోవా బల్ల మలినంగా ఉందని మీరు అంటారు. 13 ఆ బల్లమీది భోజనం మీకు ఇష్టంలేదు. ఆ భోజనాన్ని మీరు వాసన చూచి, తినుటకు నిరాకరిస్తారు. అది చెడిపోయిందని మీరు చెబుతారు. కానీ అది సత్యం కాదు. ఆ తర్వాత జబ్బువి, కుంటివి, గాయపర్చబడిన జంతువులను మీరు నాకోసం తెస్తారు. జబ్బు జంతువులను నాకు బలి అర్పణలుగా ఇచ్చేందుకు మీరు ప్రయత్నిస్తారు. కానీ మీ వద్దనుండి ఆ జబ్బు జంతువులను నేను అంగీకరించను. 14 కొంతమంది దగ్గర వారు బలి అర్పణలుగా ఇవ్వగలిగిన మంచి మగ జంతువులు ఉన్నాయి. కానీ ఆ మంచి జంతువులను వారు నాకు ఇవ్వరు. కొంతమంది మంచి జంతువులను నాకోసం తీసికొని వస్తారు. ఆరోగ్యంగా ఉన్న ఆ జంతువులను నాకు ఇస్తాం అని వారు వాగ్దానం చేస్తారు. కానీ వారు ఆ మంచి జంతువులను రహస్యంగా మార్చివేసి, జబ్బు జంతువులను నాకు ఇస్తారు. ఆ మనుష్యులకు చెడు సంగతులు సంభవిస్తాయి. నేను మహారాజును. మీరు నాయెడల భయభక్తులు కలిగి ఉండాలి. ప్రపంచం అంతటా ప్రజలు నాయందు భయభక్తులు కలిగి ఉంటారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

యాజకులకు నియమాలు

“యాజకులారా, ఈ నియమం మీ కోసమే! నా మాట వినండి! నేను చెప్పే మాటలు గమనించండి! నా పేరును మీరు గౌరవించాలి. మీరు నా పేరును గౌరవించకపోతే, అప్పుడు మీకు చెడు విషయాలు సంభవిస్తాయి. మీరు ఆశీర్వాదాలు చెప్పగా అవి శాపనార్థాలు అవుతాయి. మీరు నా పేరు అంటే గౌరవం చూపడం లేదు గనుక కీడులు సంభవించేటట్టు నేను చేస్తాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

“చూడండి, మీ సంతతివారిని నేను శిక్షిస్తాను. పవిత్ర దినాల్లో, యాజకులారా, మీరు నాకు బలులు అర్పిస్తారు. చచ్చిన జంతువుల్లోనుండి పేడ, పేగులు మీరు తీసి, వాటిని పారవేస్తారు. కానీ నేను ఆ పేడను మీ ముఖాలకు పులిమివేస్తాను, మరియు దానితోపాటు మీరు విసరివేయబడతారు! అప్పుడు ఈ ఆజ్ఞను నేను ఎందుకోసం మీకు ఇచ్చానో అది మీరు నేర్చుకొంటారు. లేవీతో నా ఒడంబడిక కొనసాగాలని నేను ఈ విషయాలు మీతో చెపుతున్నాను.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

(యెహోవా చెప్పాడు,) “లేవీతో ఆ ఒడంబడిక నేను చేశాను. అతనికి జీవం, శాంతి ఇస్తానని నేను వాగ్దానం చేశాను. మరియు నేను వాటిని అతనికి ఇచ్చాను! లేవీ నేనంటే భయభక్తులు చూపాడు! అతడు నా పేరుకు గౌరవం చూపించాడు! లేవీ సత్య ప్రబోధాలు నేర్పించాడు. లేవీ అబద్ధాలు నేర్పించలేదు. లేవీ నిజాయితీపరుడు, అతడు శాంతిని ప్రేమించాడు. లేవీ నన్ను అనుసరించి, అనేకమంది తాము చేసిన చెడ్డ పనులనుబట్టి శిక్షింపబడకుండా వారిని అతడు రక్షించాడు. ప్రతి యాజకుడూ దేవుని ప్రబోధాలు ఎరిగి ఉండాలి. ప్రజలు ఒక యాజకుని దగ్గరకు వెళ్లి, దేవుని ప్రబోధాలను అతని వద్ద నేర్చుకోగలిగి ఉండాలి. యాజకుడు ప్రజలకు దేవుని సందేశకునిగా ఉండాలి.”

(యెహోవా చెప్పాడు,) “యాజకులారా, మీరు నన్ను అనుసరించటం మానివేశారు! మనుష్యులచేత చెడు చేయించటానికి ఆ ప్రబోధాలు మీరు వినియోగించుకొన్నారు. లేవీతోటి ఒడంబడికను మీరు భగ్నం చేశారు!” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “నేను మీతో చెప్పిన విధంగా మీరు జీవించరు! మీరు నా ప్రబోధాలు అంగీకరించలేదు! కనుక నేను మిమ్మల్ని ప్రాముఖ్యం లేనివారినిగా చేస్తాను. ప్రజలు మిమ్మల్ని బహిష్కరిస్తారు!”

మత్తయి 23:13-28

13 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్షతప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశింపనీయకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించక పోవటమేకాకుండా, ప్రవేశించటానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. 14 [a]

15 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు, మీకు శ్రమ తప్పదు. మీరు మోసాలు చేస్తారు. వితంతువుల ఇళ్లు దోస్తారు. ఇతర్లు చూడాలని గంటల కొలది ప్రార్థిస్తారు. కనుక మీరు కఠినమైన శిక్ష పొందుతారు.

16 “గ్రుడ్డి మార్గదర్శకులారా! మీకు శిక్ష తప్పదు. దేవాలంయపై ఒట్టు పెట్టుకొంటే నష్టం లేదుకాని, ‘దేవాలయంలోని బంగారంపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 17 మీరు అంధులే కాక మూర్ఖులు కూడా! ఏది గొప్పది? బంగారమా? లేక బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

18 “అంతేకాక, ‘బలిపీఠంపై ఒట్టుపెట్టుకొంటే నష్టంలేదు కాని, దాని మీదనున్న కానుకపై ఒట్టు పెట్టుకొంటే ఆ ఒట్టుకు కట్టుబడి ఉండాలి’ అని మీరంటారు. 19 అంధులారా, ఏది గొప్పది? కానుకా? లేక ఆ కానుకను పవిత్రంచేసే బలిపీఠమా? 20 అందువల్ల బలిపీఠంపై ఒట్టు పెట్టుకొంటే, దానిపై ఉన్న వాటి మీద కూడా ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 21 అదే విధంగా దేవాలయంపై ఒట్టు పెట్టుకొంటే, దాని మీద, అందులో నివసించే వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్లే కదా! 22 అదే విధంగా పరలోకంపై ఒట్టు పెట్టుకొంటే అక్కడున్న సింహాసనం మీదా, ఆ సింహాసనంపై కూర్చొన్న వాని మీద ఒట్టు పెట్టుకొన్నట్టే గదా!

23 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు పుదీనా, సోంపు, జీలకర్ర మొదలగు వాటిలో పదోవంతు దేవునికి అర్పిస్తారు. కాని ధర్మశాస్త్రంలో వున్న ముఖ్యమైన వాటిని అంటే న్యాయము, దయ, విశ్వాసము, మొదలగు వాటిని వదిలి వేస్తారు. మొదటి వాటిని విడువకుండా మీరు వీటిని ఆచరించి వుండవలసింది. 24 గ్రుడ్డి మార్గదర్శకులారా! దోమను వడకట్టి ఒంటెను మ్రింగువారివలే ఉన్నారు మీరు.

25 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు! మీకు శిక్ష తప్పదు. మీరు చెంబుల్ని, పాత్రల్ని బయటివైపు కడుగుతారు కాని లోపల దురాశ, స్వార్థము పేరుకొని ఉన్నాయి. 26 పరిసయ్యులారా! మీరు అంధులు. మొట్టమొదట చెంబుల్ని, పాత్రల్ని లోపలి వైపు శుభ్రంచేయండి. అప్పుడు వాటి బయటి వైపుకూడా శుభ్రంగా ఉంటుంది.

27 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోస గాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు సున్నం కొట్టిన సమాధుల్లాంటి వాళ్ళు. అవి బయటకు అందంగా కనబడుతాయి. కాని వాటి నిండా ఎముకలు, కుళ్ళిన దేహం ఉంటాయి. 28 అదే విధంగా మీరు బాహ్యంగా నీతిమంతులవలె కన్పిస్తారు. కాని లోపల మోసం, అన్యాయం నిండి ఉన్నాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International