Revised Common Lectionary (Complementary)
43 దేవా, నిన్ను వెంబడించని ప్రజలమీద నా ఆరోపణను ఆలకించుము.
నా వివాదం ఆలకించి, ఎవరిది సరిగ్గా ఉందో నిర్ధారించుము.
ఆ మనుష్యులు అబద్ధాలు చెబుతున్నారు.
ఆ ప్రజలు వంకర మనుష్యులు.
దేవా, ఆ మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
2 దేవా, నీవే నా క్షేమ స్థానం.
నీవు నన్నెందుకు విడిచిపెట్టావు?
నా శత్రువుల కృ-రత్వాన్ని బట్టి
నేనెందుకు విచారంగా ఉండాలి?
3 దేవా, నీ సత్యము, నీ వెలుగును నా మీద ప్రకాశింపనిమ్ము.
నీ వెలుగు, సత్యాలు నన్ను నడిపిస్తాయి. నీ పరిశుద్ధ పర్వతానికి నన్ను నడిపించుము. నీ ఇంటికి నన్ను చేర్చుము.
4 దేవుని బలిపీఠం దగ్గరకు నేను వస్తాను.
దేవుని దగ్గరకు నేను వస్తాను.
ఆయన నన్ను సంతోషింపజేస్తాడు.
దేవా, నా దేవా, సితారాతో నిన్ను స్తుతిస్తాను.
5 నేనెందుకు ఇంత విచారంగా ఉన్నాను?
నేనెందుకు ఇంతగా తల్లడిల్లిపోతున్నాను?
దేవుని సహాయం కోసం నేను కనిపెట్టి ఉండాలి.
నేను ఇంకను దేవుని స్తుతించే అవకాశం లభిస్తుంది.
నా దేవుడే నాకు సహాయము.
ఏలీ కుటుంబ విషయంలో భయంకర ప్రవచనం
27 దేవుని మనిషి[a]– ఒకడు ఏలీ వద్దకు వచ్చాడు. ఆ దేవుని మనిషి ఇలా చెప్పాడు “ఈజిప్టు దేశంలో నీ పూర్వీకులు ఫరో ఇంటిలో బానిసలుగా ఉన్నప్పుడు వారికి నేను ప్రత్యక్షమయ్యాను. 28 ఇశ్రాయేలులో వున్న నీ పూర్వీకుని కుటుంబాన్ని నేను ఎన్నుకున్నాను. వారిని యాజకులుగా నియమించాను. నా బలిపీఠం వద్దకు వెళ్లి ధూపం వేయటానికి వారు ప్రత్యేక ఏఫోదు ధరించేలా కోరుకున్నాను. నీ తండ్రి కుటుంబీకులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించిన బలి మాంసాన్ని తీసుకునేలాగున చేశాను. 29 అయితే నీవు బలులను, కానుకలను ఎందువలన గౌరవించుట లేదు? నీవు నాకంటే నీ కుమారులనే ఎక్కువ గౌరవిస్తున్నావు. నా కొరకు ఇశ్రాయేలు ప్రజలు తెచ్చిన మాంసాన్ని అర్పణలలో మంచి వాటిని సంగ్రహించి క్రొవ్వెక్కి వున్నావు.”
30 ఆ దేవుని మనిషి ఇంకా ఇలా అన్నాడు: “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీ కుటుంబీకులు, నీ తండ్రి కుటుంబీకులు ఆయనను శాశ్వతంగా సేవించే విధంగా అనుగ్రహించాడు. కాని యెహోవా ఇప్పుడిలా సెలవిస్తున్నాడు: ‘అది ఇంక ఎన్నటికీ జరుగదు! నన్ను సేవించే వారినే నేను గౌరవిస్తాను. నన్ను సేవించుటకు నిరాకరించే వారికి అనేక కష్ట నష్టాలు సంభవిస్తాయి. 31 మీ సంతానమంతటినీ నేను నాశనం చేసే సమయమాసన్నమవుతూ ఉంది. అప్పుడు నీ కుటుంబంలో పెరిగి పెద్దవారై ముసలితనాన్ని చూచువాడు ఒక్కడూ ఉండడు. 32 ఇశ్రాయేలు ప్రజలకు మంచి జరుగుతూ ఉండగా, నీ ఇంటి వద్ద మాత్రం కీడు జరుగుతూ ఉంటుంది. నీ కుటుంబంలో మాత్రం ముసలి వాడొకడును ఉండడు. 33 ఒక్కడిని మాత్రం నా బలి పీఠం వద్ద యాజకునిగా సేవచేయటానికి రక్షిస్తాను. కాని, అతడు మాత్రం యాజకునిగా తన కళ్లు మందగించి, బలం ఉడిగి పోయేంత వరకు జీవిస్తాడు. నీ సంతానం వారంతా కత్తివేటుకు బలైపోతారు. 34 నేను చెప్పినవన్నీ నిజమవబోతున్నట్లుగా నీకు ఒక నిదర్శనం ఇస్తున్నాను. నీ ఇరువురు కుమారులైన హొఫ్నీ మరియు ఫీనెహాసు ఒకే రోజు మరణిస్తారు. 35 నాకై నేనే ఒక నమ్మకమైన యాజకుని ఎంచుకుంటాను. ఈ యాజకుడు నేను చెప్పినట్లు విని, నా మాట ప్రకారం చేస్తాడు. ఈ యాజకుని వంశాన్ని నేను స్థిరపరుస్తాను. నేను అభిషిక్తునిగా చేసిన రాజు ఎదుట ఇతడు నా సేవ చేస్తాడు. 36 నీ వంశంలో మిగిలిన వాళ్లంతా ఈ యాజకుని ఎదుట వంగి కొంచెం రొట్టె కోసం లేక కొద్దిగా డబ్బుకోసం దీనంగా ఆశిస్తారు. “మాకు భోజనానికి ఆహారం ఉండేలా మాకు యాజకులుగా ఉద్యోగం ఇప్పించమని అడుగుతారు.”’”
యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రము
17 నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. 18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. 19 అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. 20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. 21 ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? 22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? 23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? 24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది”(A) అని వ్రాయబడి ఉంది.
25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి[a] విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. 26 కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? 27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు.
28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. 29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.
© 1997 Bible League International