Revised Common Lectionary (Complementary)
వావ్
41 యెహోవా, నీ నిజమైన ప్రేమ నాకు చూపించుము.
నీవు వాగ్దానం చేసినట్టే నన్ను రక్షించుము.
42 అప్పుడు నన్ను అవమానించే ప్రజలకు నా దగ్గర జవాబు ఉంటుంది.
యెహోవా, నీవు చెప్పే విషయాలు నేను నిజంగా నమ్ముతాను.
43 నీ సత్యమైన ఉపదేశాలను నన్ను ఎల్లప్పుడూ చెప్పనిమ్ము.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాల మీద నేను ఆధారపడుతున్నాను.
44 యెహోవా, నేను శాశ్వతంగా ఎప్పటికీ నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
45 అందుచేత నేను క్షేమంగా జీవిస్తాను.
ఎందుకంటే, నీ న్యాయ చట్టాలకు విధేయుడనగుటకు నేను కష్టపడి ప్రయత్నిస్తాను గనుక.
46 యెహోవా ఒడంబడికను గూర్చి నేను రాజులతో చర్చిస్తాను.
వారి ఎదుట భయపడకుండా నేను మాట్లాడుతాను.
47 యెహోవా, నీ ఆజ్ఞలను చదవటము నాకు ఆనందం.
ఆ ఆజ్ఞలంటే నాకు ప్రేమ.
48 యెహోవా, నేను నీ ఆజ్ఞలను గౌరవిస్తున్నాను. వాటిని నేను ప్రేమిస్తున్నాను.
మరియు నేను వాటిని ధ్యానం చేస్తూ వాటిని గూర్చి మాట్లాడుతాను.
10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’” అని నాతో చెప్పాడు.
నిజంగా యెహోవా కోరేది
12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.
14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజలు కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.
16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.
20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.
విశ్వాసము, క్రియ
14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.
18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.
20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(A) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.
25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?
26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.
© 1997 Bible League International