Revised Common Lectionary (Complementary)
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
తప్పు చేస్తే చెల్లించాలి
5 మోషేతో యెహోవా ఈలాగు చెప్పాడు: 6 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు: ఒకడు మరొక వ్యక్తికి కీడు చేస్తాడు. (ఒకడు ఇతరులకు కీడు చేస్తే వాడు నిజానికి దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాడు.) అతడు దోషి. 7 కనుక అతడు తాను చేసిన పాపం గూర్చి ప్రజలతో చెప్పాలి. తర్వాత అతడు చేసిన తప్పుకు పూర్తిగా విలువ చెల్లించాలి. అతడు ఎవరికి నష్టం కలిగించాడో ఆ మనిషికి చెల్లించాల్సిన దానికి ఇంకా ఐదో వంతు కలిపి చెల్లించాలి. 8 కానీ ఒక వేళ ఎవరికైతే అతడు నష్టం కలిగించాడో అతడు చనిపోయినయెడల, ఒక వేళ నష్టపరిహారం పుచ్చుకొనేందుకు చనిపోయిన వ్యక్తికి నావాళ్లు అనుటకు ఎవరు లేనియెడల, అలాంటప్పుడు తప్పు చేసినవాడు ఆ విలువను యెహోవాకు చెల్లించాలి. అతడు పూర్తి మొత్తాన్ని యాజకునికి చెల్లించాలి. యాజకుడు ప్రాయశ్చిత్తార్థపు పొట్టేలును బలిగా అర్పించాలి. తప్పు చేసిన ఆ మనిషి పాపాలు క్షమింపబడుటకు బలిగా పొట్టేలు అర్పించబడాలి. మిగిలిన విలువను యాజకుడు ఉంచు కోవచ్చును.
9 “ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడు దేవునికి ఒక ప్రత్యేక కానుక ఇస్తే, దానిని స్వీకరించే యాజకుడు దానిని ఉంచుకోవచ్చును. అది అతనిదే. 10 ఈ ప్రత్యేక కానుకలు అర్పించాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. కాని ఎవరైనా అలా ఇస్తే, అవి యాజకునికే చెందుతాయి.”
క్రేతులో తీతు చేయవలసిన పని
5 అసంపూర్ణంగా వదిలి వేయబడిన వాటిని పూర్తి చేయటానికి, నేను ఆదేశించిన విధంగా ప్రతి పట్టణంలో పెద్దలను నియమించటానికి నిన్ను క్రేతులో వదిలి వచ్చాను. 6 క్రీస్తు సంఘంలోనున్న అధ్యక్షుడు నిందారహితుడై, ఏకపత్నీవ్రతుడై ఉండాలి. తన పిల్లలు అవిధేయతగా ఉండక, అవినీతిగా ఉండక, చెడ్డపేరు లేకుండా, విశ్వసించిన వాళ్ళుగా ఉండాలి. 7 సంఘాధ్యక్షుడు దైవకార్యాన్ని నడిపించే బాధ్యత కలవాడు కనుక అతడు నిందారహితుడై ఉండాలి. అతనిలో గర్వము ఉండరాదు. ముక్కోపి కాకూడదు. త్రాగుబోతు కాకూడదు. పోట్లాడరాదు. అధర్మంగా లాభాలు సంపాదించ రాదు. 8 అతిథులను పరామర్శించే వాడైయుండాలి. మంచి పనులు చెయ్యాలి. మనో నిగ్రహం, నీతి, పవిత్రత, క్రమశిక్షణ మొదలగు గుణాలు అతనిలో ఉండాలి. 9 తనకు బోధింపబడిన సందేశాన్ని విశ్వాసంతో ఆచరించాలి. అప్పుడే యితరులకు ఈ గొప్ప సత్యాన్ని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సాహపరచగలడు. ఈ సందేశాన్ని అంగీకరించనివాళ్ళకు వాళ్ళు చేస్తున్న తప్పు చూపగలడు.
10 తాము అవిధేయతగా ఉంటూ, అధికంగా మాట్లాడి నమ్మించాలని ప్రయత్నించే మోసగాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సున్నతి అవసరమని వాదించే యూదులు ఈ విధంగా చేస్తున్నారు. 11 అన్యాయంగా లాభం గడించటానికి బోధించరాని విషయాలు బోధించి కుటుంబాల్ని నాశనం చేస్తున్నారు. వాళ్ళను ఆపటం అవసరం. 12 “క్రేతీయులు అబద్ధాలాడుతున్నారనీ, క్రూర మృగాల్లాంటివాళ్ళనీ, సోమరిపోతులనీ, తిండి పోతులనీ” క్రేతీయులలో ప్రవక్తలలో ఒకడు అన్నాడు. 13 ఈ సాక్ష్యము నిజము. వాళ్ళను గట్టిగా వారించటం అవసరం. అలా చేస్తే, వాళ్ళ విశ్వాసం దృఢమౌతుంది. 14 అప్పుడు వాళ్ళు యూదుల కల్పిత కథలను మరిచిపోయి, మన సత్యాన్ని నిరాకరించే వాళ్ళ బోధలను లెక్క చెయ్యరు.
15 పవిత్రంగా ఉన్నవాళ్ళకు అన్నీ పవిత్రంగా కనిపిస్తాయి. కాని దుష్టులకు, విశ్వాసం లేనివాళ్ళకు ఏదీ పవిత్రంగా కనిపించదు. వాళ్ళ బుద్ధులు, మనస్సులు చెడుతో నిండి ఉంటాయి. 16 వాళ్ళు తమకు దేవుని గురించి తెలుసునంటారు కాని, వాళ్ళ ప్రవర్తన ఆ దేవుణ్ణి నిరాకరిస్తున్నట్లు చూపిస్తుంది. వాళ్ళు ద్వేషంతో, అవిధేయతతో ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి పని చేయటానికి అంగీకరించరు.
© 1997 Bible League International