Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 98

స్తుతి కీర్తన.

98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
    గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
    ఆయనకు విజయం తెచ్చింది.
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
    యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
    రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
    త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
    స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
బూరలు, కొమ్ములు ఊదండి.
    మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
భూమి, సముద్రం, వాటిలో ఉన్న
    సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
నదులారా, చప్పట్లు కొట్టండి.
    పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
    గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
    నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.

దానియేలు 3:1-18

బంగారు విగ్రహం-అగ్నిగుండం

నెబుకద్నెజరు ఒక బంగారు విగ్రహాన్ని తయారు చేయించాడు. ఆ విగ్రహం అరవై మూరల ఎత్తు, ఆరు మూరల వెడల్పు గలది. తర్వాత, బబులోను రాజ్యంలో దూరా అనే మైదాన ప్రదేశంలో ఆ విగ్రహాన్ని అతను ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అధిపతులను, సేనాధిపతులను, ముఖ్యోద్యోగులను, ఉన్నతాధికారులను, సలహాదారులను, న్యాయాధిపతులను, పాలకులను రాజ్యంలోని ఇతర ముఖ్య అధికారులను రాజు సమావేశపరచాడు. ఆ విగ్రహ ప్రతిష్ఠోత్సవానికి రాజు వారందరిని పిలించాడు.

రాజైన నెబుకద్నెజరు ప్రతిష్ఠించిన ఆ విగ్రహ సమక్షంలో వారందరు నిలిచారు. రాజు తరఫున ప్రకటనలు చేసే వ్యక్తి గొప్ప స్వరంతో, “వివిధ దేశాలనుండి, వివిధ భాషావర్గాలనుండి, వచ్చిన మీరందరూ నా మాటలు ఆలకించండి. ఇది మీరు చేయాలని రాజాజ్ఞ. కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తి బూరల ధ్వనులు వినగానే మీరు బంగారు విగ్రహానికి సాష్టాంగపడి పూజించాలి. ఎవరైనా ఆ బంగారు విగ్రహానికి సాగిలపడి పూజించకపోతే, అప్పుడతనిని వెంటనే మండుచున్న అగ్నిగుండంలోకి తోసివేస్తారు.”

అందువల్ల, కొమ్ము బూరలు, పిల్లన గ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తంతివాద్యాలు, తిత్తిబూరలు మొదలైన సంగీత వాద్యాల ధ్యనులు వినగానే రాజు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి అందరు, అన్ని దేశాలవాళ్లు, అన్ని భాషలవాళ్లు సాష్టాంగపడి పూజించారు.

తర్వాత కల్దీయులలో కొందరు రాజు వద్దకు వచ్చి, యూదులకు విరుద్ధంగా మాటలాడసాగారు. వాళ్లు నెబుకద్నెజరుతో ఇలా అన్నారు: “రాజు ఎల్లప్పుడూ వర్ధిల్లు గాక! 10 రాజా! నీవొక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు, మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. 11 ఎవరైనా బంగారు విగ్రహానికి బోర్లగాపడి నమస్కరించకపోతే, అతడు మండుచున్న కొలిమిలోకి త్రోయబడతాడని నీవు చెప్పావు. 12 రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవుళ్లను పూజించరు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రాహాన్ని తలవంచి వారు పూజించలేదు.”

13 నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. 14 అందువల్ల వారిని అతని సమక్షానికి తీసుకు వచ్చారు. నెబుకద్నెజరు వారిని చూచి, “షద్రకు, మేషాకు, అబెద్నెగో! మీరు నా దేవుళ్లని పూజించని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించని మాటకూడా నిజమేనా? 15 కొమ్ముబూరలు, పిల్లనగ్రోవులు, సుంఫోనీయ, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగాపడి, బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే, అది మంచిది. మీరు పూజించకపోతే, మిమ్మును వెంటనే మండుచున్న కొలిమిలోకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారంనుంచి మిమ్మును కాపాడలేడు!”

16 షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకు ఇలా ప్రత్యుత్తరమిచ్చారు: “నెబుకద్నెజరూ, ఈ విషయాలు మీకు మేము వివరించనవసరం లేదు. 17 మీరు మమ్మును మండుచున్న కొలిమిలోకి తోసివేస్తే, మేము నమ్ముకొన్న మా దేవుడే మమ్ములను రక్షిస్తాడు. మరియు ఆయనకు ఇష్టం కలిగితే, మీ అధికారంనుంచి మమ్ములను కాపాడుతాడు. 18 మా దేవుడు మమ్ములను రక్షించని పక్షంలో కూడా, రాజా, మేము నీ దేవుళ్లను కొలవమనే సంగతి నీవు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించము.”

ప్రకటన 18:1-10

బాబిలోను పతనము

18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. అతడు బిగ్గరగా యిలా అన్నాడు:

“బాబిలోను మహానగరం
    కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
    ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
    ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
    అది సంచరించు స్థలమైంది.
దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
    భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”

ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:

“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
    ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
    దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
    అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
    అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
    నేను ఎన్నటికీ వితంతువును కాను.
    నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
అందువల్ల చావు, దుఃఖము, కరువు,
    తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
    కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.

“దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,

‘అయ్యో! అయ్యో! మహానగరమా!
    శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’

అని విలపిస్తారు.

ప్రకటన 18:19-20

19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,

‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
    ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”

అని అంటారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International