Revised Common Lectionary (Complementary)
ఇశ్రాయేలును విమోచించటానికి దేవుడు కోరెషును ఎన్నుకొంటాడు
45 యెహోవా ఏర్పాటు చేసుకొన్న తన రాజు కోరెషుతో ఆయన చెప్పిన సంగతులు ఇవి:
“కోరషు కుడిచేయి నేను పట్టుకొంటాను.
రాజుల దగ్గర నుండి అధికారం తీసివేసుకొనేందుకు
నేను అతనికి సహాయం చేస్తాను.
పట్టణ ద్వారాలు కోరెషును ఆపుజేయలేవు. పట్టణ ద్వారాలు నేను తెరుస్తాను, కోరెషు లోనికి ప్రవేశిస్తాడు.
2 కోరెషూ, నీ సైన్యాలు ముందడుగు వేస్తాయి. నేను నీకు ముందుగా వెళ్తాను.
పర్వతాలను నేను చదును చేస్తాను.
పట్టణం ఇత్తడి తలుపులు నేను పగులగొడ్తాను.
తలుపుల మీది ఇనుప గడియలను నేను విరుగగొడ్తాను.
3 చీకట్లో దాచిపెట్టబడిన ధనం నేను నీకు ఇస్తాను.
దాచబడిన ఐశ్వర్యాలను నేను నీకు ఇస్తాను.
నేను యెహోవాను అని నీవు తెలుసుకొనేందుకు నేను దీనిని చేస్తాను.
ఇశ్రాయేలీయుల దేవుడను నేనే, నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
4 నా సేవకుడు యాకోబు కోసం నేను వీటిని చేస్తున్నాను.
ఏర్పాటు చేయబడిన నా ప్రజలు ఇశ్రాయేలీయుల కోసం నేను వీటిని చేస్తున్నాను.
కోరెషూ, నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
నీవు నన్ను ఎరుగవు, కానీ నేను నిన్ను పేరుపెట్టి పిలుస్తున్నాను.
5 నేను యెహోవాను. నేను ఒక్కడినే దేవుడను.
ఇంక ఏ దేవుడూ లేడు.
నేనే నీకు బట్టలు ధరింపజేసినవాడను.
అయినా నీవు ఇంకా నన్ను ఎరుగవు.
6 నేను ఒక్కడను మాత్రమే దేవుడనని ప్రజలంతా తెలుసుకోవాలని నేను ఈ సంగతులను చేస్తాను.
నేనే యెహోవాను అని, నేను తప్ప ఇంకో దేవుడు లేడని తూర్పు నుండి పడమటి వరకు ప్రజలు తెలుసుకొంటారు.
7 నేనే వెలుగును కలిగించాను. మరి నేనే చీకటిని చేశాను.
నేనే సమాధానం కలిగిస్తాను. నేనే కష్టాలు కల్గిస్తాను.
నేను యెహోవాను నేనే ఈ సంగతులన్నింటిని చేస్తాను.
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
1 మన తండ్రియైన దేవునికి, యేసు క్రీస్తు ప్రభువుకు చెందిన థెస్సలొనీక పట్టణంలో ఉన్న సంఘానికి పౌలు, సిల్వాను మరియు తిమోతి వ్రాయటమేమనగా, మీకు దైవానుగ్రహము, శాంతి లభించుగాక!
దేవునికి కృతజ్ఞతలు
2 మేము మీకోసం ప్రార్థిస్తూ మీరు మా సోదరులైనందుకు మేము దేవునికి అన్నివేళలా కృతజ్ఞతతో ఉన్నాము. 3 విశ్వాసంవల్ల మీరు సాధించిన కార్యాన్ని గురించి, ప్రేమ కోసం మీరు చేసిన కార్యాల్ని గురించి యేసు క్రీస్తు ప్రభువులో మీకున్న దృఢవిశ్వాసం వల్ల మీరు చూపిన సహనాన్ని గురించి విన్నాము. దానికి తండ్రియైన దేవునికి మేము అన్ని వేళలా కృతజ్ఞులము.
4 సోదరులారా! దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని ఎన్నుకొన్నాడని మాకు తెలుసు. 5 ఎందుకంటే, మేము సువార్తను మీకు వట్టి మాటలతో బోధించలేదు. శక్తితో, పరిశుద్ధాత్మతో, గట్టి నమ్మకంతో బోధించాము. మేము మీకోసం మీతో కలిసి ఏ విధంగా జీవించామో మీకు తెలుసు. 6 మీరు మమ్మల్ని, ప్రభువును అనుసరించారు. మీకు కష్టం కలిగినా పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆనందంతో సందేశాన్ని అంగీకరించారు.
7 కనుక మాసిదోనియ, అకయ పట్టణాలలో ఉన్న విశ్వాసులందరికీ మీరు ఆదర్శులయ్యారు. ఆ పట్టణాలలో మీ ద్వారా ప్రభువు సందేశం ప్రచారమైంది. 8 దేవుని పట్ల మీకున్న విశ్వాసం, ఆ పట్టణాలలోనే కాక, ప్రతి చోటా తెలిసింది. దాన్ని గురించి మేమేమీ చెప్పనవసరం లేదు. 9 మీరు మాకెలాంటి స్వాగతమిచ్చారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. అంతేకాక, సజీవమైన నిజమైన దేవున్ని పూజించటానికి మీరు విగ్రహారాధనను వదిలి నిజమైన దేవుని వైపుకు ఏ విధంగా మళ్ళారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. 10 పరలోకము నుండి రానున్న దేవుని కుమారుడైన యేసు కొరకు మీరు ఏ విధంగా కాచుకొని ఉన్నారో వాళ్ళు అందరికీ చెపుతున్నారు. దేవునిచే సజీవంగా లేపబడిన ఈ యేసు రానున్న ఆగ్రహం నుండి మనల్ని రక్షిస్తాడు.
యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:13-17; లూకా 20:20-26)
15 ఆ తర్వాత పరిసయ్యులు వెళ్ళి ఆయన్ని ఆయన మాటల్తోనే పట్టి వేయాలని కుట్ర పన్ని తమ శిష్యుల్ని, హేరోదు పక్షమున్న వాళ్ళను యేసు దగ్గరకు పంపారు. 16 వాళ్ళు, “బోధకుడా! మీరు సత్యవంతులని, దైవ మార్గాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తారని మాకు తెలుసు. ఇతర్ల అంతస్తులను లెక్క చెయ్యరు. కనుక పక్షపాతం చూపరని కూడా మాకు తెలుసు. 17 మరి చక్రవర్తికి పన్నులు కట్టడం ధర్మమా? కాదా? మీరేమంటారు?” అని ఆయన్ని అడిగారు.
18 యేసుకు వాళ్ళ దురుద్దేశం తెలిసిపోయింది. వాళ్ళతో, “వేషధారులారా! నన్నెందుకు పరీక్షిస్తున్నారు? 19 ఏ నాణెంతో పన్నులు కడుతున్నారో దాన్ని నాకు చూపండి” అని అన్నాడు. వాళ్ళు ఒక దెనారా తెచ్చి ఆయనకు ఇచ్చారు. 20 ఆయన, “ఈ బొమ్మ ఎవరిది? ఆ నాణెంపై ఎవరి శాసనం ఉంది?” అని వాళ్ళనడిగాడు.
21 “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
అప్పుడాయన వాళ్ళతో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందిది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
22 ఇది విని వాళ్ళు చాలా ఆశ్చర్యపడ్డారు. ఆ తదుపరి ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.
© 1997 Bible League International