Revised Common Lectionary (Complementary)
96 యెహోవా చేసిన క్రొత్త కార్యాలను గూర్చి ఒక క్రొత్త కీర్తన పాడండి!
సర్వలోకం యెహోవాకు కీర్తనలు పాడును గాక!
2 యెహోవాకు కీర్తన పాడండి. ఆయన నామాన్ని స్తుతించండి.
శుభవార్త ప్రకటించండి. ఆయన ప్రతి రోజూ మనలను రక్షించుటను గూర్చి ప్రకటించండి.
3 దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడని ఇతర ప్రజలతో చెప్పండి.
దేవుడు చేసే అద్భుత కార్యాలను గూర్చి అన్నిచోట్లా ప్రజలకు చెప్పండి.
4 యెహోవా గొప్పవాడు, స్తుతికి పాత్రుడు.
ఇతర “దేవుళ్లు” అందరికంటె ఆయన భీకరుడు.
5 ఇతర జనాల “దేవుళ్లంతా” కేవలం విగ్రహాలే.
కాని యెహోవా ఆకాశాలను సృష్టించాడు.
6 ఆయన యెదుట అందమైన మహిమ ప్రకాశిస్తూ ఉంటుంది.
దేవుని పవిత్ర ఆలయంలో బలం, సౌందర్యం ఉన్నాయి.
7 వంశములారా, రాజ్యములారా, యెహోవా మహిమకు
స్తుతి కీర్తనలు పాడండి.
8 యెహోవా నామాన్ని స్తుతించండి.
మీ కానుకలు తీసుకొని ఆలయానికి వెళ్లండి.
9 యెహోవా అందమైన ఆలయంలో ఆయనను ఆరాధించండి!
భూమి మీద ప్రతి మనిషి ఆయన ముందు వణకాలి.
10 యెహోవా రాజు అని జనాలకు ప్రకటించండి!
కనుక ప్రపంచం నాశనం చేయబడదు.
యెహోవా తన ప్రజలను న్యాయంగా పరిపాలిస్తాడు.
11 ఆకాశములారా, సంతోషించండి! భూమీ, ఆనందించుము!
సముద్రమా, అందులోని సమస్తమా, సంతోషంతో ఘోషించుము!
12 పొలాల్లారా, వాటిలో పండే సమస్తమా సంతోషించండి!
అరణ్యంలో వృక్షాల్లారా, పాడుతూ సంతోషించండి.
13 యెహోవా వస్తున్నాడు గనుక సంతోషంగా ఉండండి.
ప్రపంచాన్ని పాలించుటకు[a] యెహోవా వస్తున్నాడు.
న్యాయంగా, ధర్మంగా ఆయన ప్రపంచాన్ని పాలిస్తాడు.
3 యెహోవా మీ కష్టమైన పని తీసివేసి, మిమ్మల్ని ఆదరిస్తాడు. గతంలో మీరు బానిసలు. ప్రతి కష్టమైన పనినీ మనుష్యులు మీతో బలవంతంగా చేయించారు. అయితే యెహోవా మీకు ఈ కష్టతరమైన పనిని అంతం చేస్తాడు.
బబులోను రాజు గురించి ఒక గీతం
4 ఆ సమయంలో, బబులోను రాజును గూర్చి మీరు ఈ పాట పాడటం మొదలు పెడ్తారు.
ఆ రాజు మమ్మల్ని పాలించినప్పుడు నీచంగా ఉన్నాడు.
కానీ ఇప్పుడు అతని పాలన అయిపోయింది.
5 చెడ్డ పాలకుల దండాన్ని యెహోవా విరుగగొడతాడు.
వారి అధికారాన్ని యెహోవా తొలగించి వేస్తాడు.
6 బబులోను రాజు కోపంతో ప్రజలను కొట్టాడు
దుష్టుడైన ఆ పాలకుడు ప్రజలను కొట్టడం మానలేదు
దుష్టుడైన ఆ పాలకుడు కోపంతో ప్రజలను పాలించాడు.
ప్రజలకు కీడు చేయటం అతడు ఎన్నడూ ఆపు జేయలేదు.
7 అయితే ఇప్పుడు దేశం మొత్తం విశ్రాంతి తీసుకొంటూంది. దేశం నెమ్మదిగా ఉంది.
ప్రజలు ఇప్పుడు ఉత్సవం చేసుకోవటం మొదలు పెడుతున్నారు.
8 నీవు ఒక దుష్ట రాజువు
కానీ ఇప్పుడు నీ పని అయిపోయింది.
చివరికి తమాల వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
లెబానోను దేవదారు వృక్షాలు కూడా సంతోషిస్తున్నాయి.
ఆ చెట్లు అంటున్నాయి, “రాజు మమ్మల్ని నరికి వేశాడు.
కానీ ఇప్పుడు రాజే పడిపోయాడు.
అతడు మళ్లీ ఎన్నటికీ నిలబడడు.”
9 నీవు వస్తున్నందుకు, మరణస్థానమైన పాతాళం హర్షిస్తుంది.
భూలోక నాయకులందరి ఆత్మలనూ పాతాళం నీ కోసం మేల్కొలుపుతుంది.
పాతాళం, రాజులను వారి సింహాసనాల మీదనుండి లేపి నిలబెడుతుంది. నీ రాకకు వారు సిద్ధంగా ఉంటారు.
10 ఈ నాయకులంతా నిన్ను హేళన చేస్తారు.
“ఇప్పుడు నీవు కూడా మాలాగే చచ్చిన శవానివి.
ఇప్పుడు నీవూ మాలాగే ఉన్నావు.” అని వారంటారు.
11 నీ గర్వం పాతాళానికి పంపబడింది.
నీ సితారాల సంగీతం, నీ గర్విష్ఠి ఆత్మ రాకను ప్రకటిస్తున్నాయి.
కీటకాలు నీ శరీరాన్ని తినివేస్తాయి. వాటి మీద నీవు పరుపులా పడి ఉంటావు.
పురుగులు దుప్పటిలా నీ శరీరాన్ని కప్పేస్తాయి.
హెరోదు యేసును స్నానికుడైన యోహానని తలంచటం
(మార్కు 6:14-29; లూకా 9:7-9)
14 ఆ కాలంలో గలిలయకు అధిపతియైన హేరోదు యేసును గురించి విన్నాడు. 2 అతడు తన పరిచారకులతో, “ఇతడు బాప్తిస్మమునిచ్చే యోహాను అని నా నమ్మకం. అతడు బ్రతికి వచ్చాడు. కనుకనే అద్భుతాలు చేసే శక్తి ఆయనలోవుంది” అని అన్నాడు.
యోహాను తల నరకటం
3 అలా ఎందుకన్నాడంటే కొంతకాలానికి ముందు హేరోదు యోహానును బంధించి కారాగారంలో వేసాడు. ఇలా జరగటానికి కారణం హేరోదియ. ఈమె హేరోదు సోదరుడైన ఫిలిప్పుకు భార్య. 4 పైగా యోహాను హేరోదుతో, “నీవామెతో కలసి జీవించటం న్యాయం కాదు!” అని అనేవాడు. 5 ఈ కారణంగా హేరోదు యోహానును చంపాలనుకున్నాడు. కాని ప్రజలు యోహానును ఒక ప్రవక్తగా పరిగణించేవారు కనుక హేరోదు వాళ్ళను చూసి భయపడి పోయాడు.
6 హేరోదు పుట్టిన రోజు పండుగ జరిగింది. ఆరోజు హేరోదియ కుమార్తె సభలో నాట్యం చేసి హేరోదును మెప్పించింది. 7 అందువల్ల అతడు ఆమె అడిగింది యిస్తానని వాగ్దానం చేసాడు. 8 ఆమె తన తల్లి ప్రోద్బలంతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను ఒక పళ్ళెంలో పెట్టి నాకివ్వండి” అని అడిగింది.
9 ఇది విన్న రాజుకు దుఃఖం కలిగింది. కాని వాగ్దానం చేయటం వల్ల, అతిథులు అక్కడే ఉండటంవల్ల ఆమె కోరిక తీర్చమని ఆజ్ఞాపించాడు. 10 వెంటనే భటుణ్ణి పంపి కారాగారంలో ఉన్న యోహాను తల నరికి వేయించాడు. 11 ఒక భటుడు యోహాను తలను ఒక పళ్ళెంలో తీసుకు వచ్చి ఆమెకిచ్చాడు. ఆమె దాన్ని తన తల్లి దగ్గరకు తీసుకు వెళ్ళింది. 12 యోహాను శిష్యులు వచ్చి అతని దేహాన్ని తీసుకు వెళ్ళి సమాధి చేసారు. ఆ తర్వాత వెళ్ళి యేసుతో చెప్పారు.
© 1997 Bible League International