Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

ఆమోసు 9:5-15

శిక్ష ప్రజలను నాశనం చేస్తుంది

నా ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
    అది కరిగిపోతుంది.
    అప్పుడు భూమిపై నివసించేవారంతా చనిపోయినవారి కొరకు విలపిస్తారు.
ఈజిప్టులో నైలు నదిలా
    భూమి పెల్లుబికి పడుతుంది.
యెహోవా తన పై అంతస్థు గదులు ఆకాశంపై నిర్మించాడు.
    ఆయన తన పరలోకాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు.
సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు.
    పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు.
    ఆయన పేరు యెహోవా.

ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా వాగ్దానం

యెహోవా ఇది చెపుతున్నాడు:

“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయుల) వంటివారు.
    ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశంనుండి బయటకు తీసికొని వచ్చాను.
    ఫిలిష్తీయులనుకూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
    మరియు అరామీయులను (సిరియనులను) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”

నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలును) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలంనుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
    కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
    ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
    అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది.

10 “నా ప్రజలలో పాపులైనవారు,
    ‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”

రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట

11 “దావీదు గుడారం పడిపోయింది.
    కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
    దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
    మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
    అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
    ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
    మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
    తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
    ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
    ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
    వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
    నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఫిలిప్పీయులకు 3:13-4:1

13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.

15 ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు. 16 మనం మాత్రం, మనమిదివరలో సాధించిన వాటికి అనుగుణంగా నడుచుకొందాము.

17 సోదరులారా! నావలె జీవించండి. మేము బోధించిన విధానాన్ని అనుసరిస్తున్నవాళ్ళను గమనించండి. 18 నేనిదివరకే ఎన్నో సార్లు చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కన్నీళ్ళతో చెబుతున్నాను. క్రీస్తు సిలువ పట్ల శత్రుత్వంతో జీవిస్తున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. 19 వినాశనమే వాళ్ళ గమ్యం. వాళ్ళ కడుపే వాళ్ళ దేవుడు. అవమానమే వాళ్ళ కీర్తి. వాళ్ళ మనస్సులు ఐహికమైన వాటిపై ఉంటాయి. 20 కాని మన నివాసం పరలోకంలో ఉంది. మనల్ని రక్షించటానికి పరలోకము నుండి రానున్న క్రీస్తు ప్రభువు కోసం మనం ఆశతో ఎదురు చూస్తున్నాము. 21 అన్నిటినీ తన ఆధీనంలో ఉంచుకోగల శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితో ఆయన మన నీచమైన శరీరాలను తన తేజోవంతమైన శరీరంలా ఉండేటట్లు చేస్తాడు.

చివరి సలహా

నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International