Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 34

దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పుడు అతడు దావీదును పంపించివేసినప్పటిది.

34 నేను యెహోవాను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.
    ఆయన స్తుతి ఎల్లప్పుడూ నా పెదాల మీద ఉంటుంది.
దీన జనులారా, విని సంతోషించండి.
    నా ఆత్మ యెహోవాను గూర్చి ఘనంగా కీర్తిస్తుంది.
యెహోవా మహాత్మ్యం గూర్చి నాతో పాటు చెప్పండి.
    మనం ఆయన నామాన్ని కీర్తిద్దాం.
సహాయం కోసం నేను దేవుణ్ణి ఆశ్రయించాను. ఆయన విన్నాడు.
    నేను భయపడే వాటన్నింటి నుండి ఆయన నన్ను రక్షించాడు.
సహాయం కోసం దేవుని తట్టు చూడండి.
    మీరు స్వీకరించబడుతారు. సిగ్గుపడవద్దు.
ఈ దీనుడు సహాయంకోసం యెహోవాను వేడుకొన్నాడు.
    యెహోవా నా మొర విన్నాడు.
    నా కష్టాలన్నింటినుండి ఆయన నన్ను రక్షించాడు.
యెహోవాను వెంబడించే ప్రజల చుట్టూ ఆయన దూత కావలి ఉంటాడు.
    ఆ ప్రజలను యెహోవా దూత కాపాడి, వారికి బలాన్ని ఇస్తాడు.
యెహోవా ఎంత మంచివాడో రుచిచూచి తెలుసుకోండి.
    యెహోవా మీద ఆధారపడే వ్యక్తి ధన్యుడు.
యెహోవా పవిత్ర జనులు ఆయనను ఆరాధించాలి.
    ఆయన్ని అనుసరించే వారికి సురక్షిత స్థలం ఆయన తప్ప మరేదీలేదు.
10 యౌవనసింహాలు[a] బలహీనమై, ఆకలిగొంటాయి.
    అయితే సహాయం కోసం దేవుని ఆశ్రయించే వారికి ప్రతి మేలు కలుగుతుంది. మంచిదేదీ కొరతగా ఉండదు.
11 పిల్లలారా, నా మాట వినండి.
    యెహోవాను ఎలా సేవించాలో నేను నేర్పిస్తాను.
12 ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమిస్తోంటే,
    ఒక వ్యక్తి మంచి దీర్ఘకాల జీవితం జీవించాలనుకొంటే
13 అప్పుడు ఆ వ్యక్తి చెడ్డ మాటలు మాట్లాడకూడదు,
    ఆ వ్యక్తి అబద్ధాలు పలుకకూడదు,
14 చెడ్డ పనులు చేయటం చాలించండి. మంచి పనులు చేయండి.
    శాంతికోసం పని చేయండి. మీకు దొరికేంతవరకు శాంతికోసం వెంటాడండి.
15 మంచి మనుష్యులను యెహోవా కాపాడుతాడు.
    ఆయన వారి ప్రార్థనలు వింటాడు.
16 కాని చెడు కార్యాలు చేసే వారికి యెహోవా విరోధంగా ఉంటాడు.
    ఆయన వారిని పూర్తిగా నాశనం చేస్తాడు.

17 ప్రార్థించండి, యెహోవా మీ ప్రార్థన వింటాడు.
    ఆయన మిమ్మల్ని మీ కష్టాలన్నింటినుండి రక్షిస్తాడు.
18 గర్విష్ఠులు కాని మనుష్యులకు యెహోవా సమీపంగా ఉంటాడు.
    ఆత్మలో అణగిపోయిన మనుష్యులను ఆయన రక్షిస్తాడు.
19 మంచి మనుష్యులకు అనేక సమస్యలు ఉండవచ్చు.
    కాని ఆ మంచి మనుష్యులను వారి ప్రతి కష్టం నుండి యెహోవా రక్షిస్తాడు.
20 వారి ఎముకలన్నింటినీ యెహోవా కాపాడుతాడు.
    ఒక్క ఎముక కూడా విరువబడదు.
21 అయితే దుష్టులను కష్టాలు చంపేస్తాయి.
    చెడ్డవాళ్లు మంచి మనుష్యులను ద్వేషిస్తారు. కాని ఆ చెడ్డ వాళ్లు నాశనం చేయబడతారు.
22 యెహోవా తన సేవకులలో ప్రతి ఒక్కరి ఆత్మనూ రక్షిస్తాడు.
    తన మీద ఆధారపడే ప్రజలను నాశనం కానీయడు.

నిర్గమకాండము 19:7-20

కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు.

తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు. “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.

అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.

10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని 11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 12-13 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.

14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.

15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.

16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.

20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.

యూదా 17-25

హెచ్చరికలు, ఉపదేశాలు.

17 కాని ప్రియ మిత్రులారా! మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క అపొస్తలులు చెప్పిన ప్రవచనాల్ని జ్ఞాపకం ఉంచుకోండి. 18 “చివరి రోజుల్లో దేవుణ్ణి దూషించేవాళ్ళు తమ దుర్వ్యసనాలు తీర్చుకొంటూ వస్తారు” అని అపొస్తలులు చెప్పారు. 19 వాళ్ళు ప్రస్తావించిన ఈ దుర్బోధకులే మిమ్మల్ని విడదీస్తారు. ఈ దుర్బోధకులు పశువుల్లా ప్రవర్తిస్తారు. వీళ్ళలో దేవుని ఆత్మ ఉండదు.

20 కాని ప్రియ మిత్రులారా! మీలో ఉన్న విశ్వాసం అతి పవిత్రమైనది. దానితో మిమ్మల్ని మీరు అభివృద్ధి పరుచుకోండి. పవిత్రాత్మ ద్వారా ప్రార్థించండి. 21 దేవుని ప్రేమను వదులుకోకండి. మీకు నిత్యజీవం ఇచ్చే మన యేసు క్రీస్తు ప్రభువు దయకొరకు కాచుకొని ఉండండి.

22 సంశయాలున్నవాళ్ళ పట్ల కనికరం చూపండి. 23 మంటల్లో పడబోయేవాళ్ళను బయటకు లాగి కాపాడండి. దుర్నీతిలో మలినమైన దుస్తుల్ని వేసుకొన్నవాళ్ళ పట్ల మీకు అసహ్యము, భయము కలిగినా, వాళ్ళ పట్ల కనికరం చూపండి.

24 క్రిందపడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. మీలో ఏ లోపం లేకుండా చేసి తేజోవంతమైన తన సమక్షంలో నిలుపుకొని ఆనందాన్ని కలిగించగలడు. అలాంటి ఆయనకు, 25 మన రక్షకుడైనటువంటి ఏకైక దేవునికి, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా గొప్పతనము, తేజస్సు, శక్తి, అధికారము భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో లభించుగాక! ఆమేన్.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International