Revised Common Lectionary (Complementary)
దేవునికి స్తుతి గీతం
25 యెహోవా, నీవు నా దేవుడివి
నిన్ను నేను ఘనపరుస్తాను, నీ నామం స్తుతిస్తాను.
అద్భుతమైన కార్యాలు నీవు చేసావు.
చాలాకాలం క్రిందట నీవు చెప్పిన మాటలు పూర్తిగా సత్యము.
నీవు జరుగుతుందని చెప్పినట్టు సమస్తం జరిగింది.
2 పట్టణాన్ని నీవు నాశనం చేసావు. అది బలీయమైన కోటగోడలతో కాపాడబడ్డ పట్టణం.
కానీ ఇప్పుడు అది ఒక రాళ్లకుప్ప మాత్రమే
విదేశీ భవనం నాశనం చేయబడింది.
అది ఎన్నటికీ కట్టబడదు.
3 బలమైన రాజ్యాల ప్రజలు నిన్ను ఘనపరుస్తారు.
బలమైన పట్టణాల బలాఢ్యులు నీకు భయపడతారు.
4 యెహోవా, అక్కరలో ఉన్న పేద ప్రజలకు నీవు క్షేమ స్థానంగా ఉన్నావు.
అనేక సమస్యలు ఈ ప్రజల్ని ఓడించటం మొదలు పెట్టాయి. కానీ నీవు వారిని కాపాడుతావు.
యెహోవా, నీవు వరదలనుండి, వేడి నుండి ప్రజలను కాపాడే గృహంలా ఉన్నావు.
కష్టాలు భయంకర గాలుల్లో, వర్షంలా ఉన్నాయి. వాన గోడమీద పడి జారి పోతుంది,
కాని ఇంట్లో ఉన్న మనుష్యులకు దెబ్బ తగలదు.
5 శత్రువులు కేకలు వేసి శబ్దం చేస్తారు. భయంకర శత్రువులు సవాళ్లు విసరుతారు.
అయితే దేవా, నీవు వారిని ఆపుజేస్తావు. వేడి, పొడి కాలంలో వేడి భూమిని నిస్సారం చేస్తుంది.
అదే విధంగా నీవు శత్రువులకంటె బలం ఉన్నవాడివి దట్టమైన మేఘాలు వేసవి వేడిని ఆపుజేస్తాయి.
అదే విధంగా, భయంకర శత్రువుల కేకలు నీవు ఆపుజేస్తావు.
తన సేవకులకు, దేవుని విందు
6 ఆ కాలంలో, సర్వశక్తిమంతుడైన యెహోవా ప్రజలందరికీ ఈ కొండ మీద విందు చేస్తాడు. ఆ విందులో శ్రేష్ఠమైన భోజనాలు, ద్రాక్షరసాలు ఉంటాయి. మాంసం లేతగా బాగుంటుంది.
7 కానీ ఇప్పుడు రాజ్యాలన్నింటినీ, ప్రజలనూ కప్పి వేసే ముసుగు ఉంది. ఈ ముసుగు “మరణం” అని పిలువబడుతుంది 8 కానీ మరణం శాశ్వతంగా నాశనం చేయబడుతుంది మరియు నా ప్రభువు యెహోవా ప్రతి ఒక్కరి చెంపల మీదా ప్రతీ కన్నీటి బొట్టునూ తుడిచి వేస్తాడు. గతంలో ఆయన ప్రజలు అందరూ విచారంగా ఉన్నారు. అయితే దేవుడు ఆ విచారాన్ని భూమి మీద నుండి తీసి వేస్తాడు. ఇలా జరుగుతుంది అని యెహోవా చెప్పాడు గనుక ఇదంతా జరుగుతుంది.
9 ఆ సమయంలో ప్రజలు అంటారు,
“ఇదిగో మన దేవుడు ఇక్కడ ఉన్నాడు.
మనం కనిపెడ్తున్నవాడు ఈయనే.
మనల్ని రక్షించటానికి ఈయన వచ్చాడు.
మనం మన యెహోవా కోసం కనిపెడుతున్నాం.
అందుచేత యెహోవా మనలను రక్షించినప్పుడు మనం ఆనందించి, సంతోషంగా ఉందాం.”
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
చివరి సలహా
4 నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.
2 యువొదియ, సుంటుకే అనేవాళ్ళు ప్రభువు విశ్వాసులు కనుక వాళ్ళు పరస్పరం ఒక అంగీకారానికి రావాలని అర్థిస్తున్నాను. 3 నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతావాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతావాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
4 అన్ని వేళలందును మీరు ప్రభువునందు ఆనందించండి, మళ్ళీ చెపుతున్నాను. ప్రభువునందు ఆనందించండి.
5 మీరు దయగలవాళ్ళనే పేరు పొందాలి. ప్రభువు త్వరలో రానున్నాడు. 6 ఏ విషయంలో చింతలు పెట్టుకోకండి. ప్రతిసారి ప్రార్థించి మీ కోరికల్ని దేవునికి తెలుపుకోండి. కృతజ్ఞతా హృదయంతో అడగండి. 7 దేవుడు యిచ్చే శాంతిని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అది మీ హృదయాలను, మీ బుద్ధిని, యేసు క్రీస్తులో ఉంచి కాపలాకాస్తుంది.
8 కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైనవాటిని, పవిత్రమైనవాటిని, ఆనందమైనవాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్నవాటిని గురించి, ప్రశాంతమైనవాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి. 9 మీరు నా ద్వారా నేర్చుకొన్నవాటిని, నా నుండి పొందినవాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసినవాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.
పెళ్ళి విందు ఉపమానం
(లూకా 14:15-24)
22 యేసు ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళతో మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: 2 “దేవుని రాజ్యాన్ని తన కుమారుని వివాహ సందర్భంగా విందునేర్పాటు చేసిన ఒక రాజుతో పోల్చవచ్చు. 3 ఆ రాజు విందుకు ఆహ్వానింపబడిన వాళ్ళను రమ్మని పిలవటానికి తన సేవకుల్ని పంపాడు. కాని ఆహ్వానితులు రావటానికి నిరాకరించారు.
4 “ఆ రాజు మరికొంతమంది సేవకుల్ని పంపుతూ ఆహ్వానింపబడిన వాళ్ళతో ‘భోజనం సిద్దంగా ఉందని చెప్పండి. ఎద్దుల్ని, బాగా బలిసిన పశువుల్ని కోసి అన్నీ సిద్ధంగా ఉంచామని చెప్పి వాళ్ళని పెళ్ళికి రమ్మనండి’ అని అన్నాడు.
5 “కాని ఆహ్వానితులు లెక్క చెయ్యలేదు. ఒకడు తన పొలానికి, ఇంకొకడు తన వ్యాపారం మీద వెళ్ళిపొయ్యారు. 6 మిగతా వాళ్ళు ఆ సేవకుల్ని పట్టుకొని అవమానించి చంపేశారు. 7 ఆ రాజుకు చాలా కోపం వచ్చింది. తన సైన్యాన్ని పంపి ఆ హంతకుల్ని నాశనం చేసి, వాళ్ళ పట్టణాన్ని కాల్చి వేసాడు.
8 “ఆ తర్వాత తన సేవకులతో, ‘పెళ్ళి విందు సిద్దంగా ఉంది. కాని నేనాహ్వానించిన వాళ్ళు విందుకు రావటానికి అర్హులుకారు. 9 వీధుల్లోకి వెళ్ళి మీకు కనిపించిన వాళ్ళందర్ని విందుకాహ్వానించండి’ అని అన్నాడు. 10 ఆ సేవకులు వీధుల్లోకి వెళ్ళి తమకు కనిపించిన వాళ్ళందర్ని అంటే మంచి వాళ్ళను, చెడ్డ వాళ్ళను, అందర్ని పిలుచుకు వచ్చారు. అతిథులతో పెళ్ళి యిల్లంతా నిండిపోయింది.
11 “రాజు అతిధుల్ని చూడాలని వచ్చాడు. అక్కడున్న వాళ్ళల్లో ఒకడు పెళ్ళి దుస్తులు వెసుకోలేదని గమనించాడు. 12 ‘మిత్రమా! పెళ్ళి దుస్తులు వేసుకోకుండా లోపలికి ఎట్లా వచ్చావు?’ అని రాజు అత న్ని అడిగాడు. ఆ వ్యక్తి ఏమీ మాట్లాడలేక పొయ్యాడు. 13 వెంటనే ఆ రాజు తన సేవకులతో, ‘అతని కాళ్ళు, చేతులు కట్టేసి అవతల చీకట్లో పారవేయండి. అక్కడున్న వాళ్ళు ఏడుస్తూ బాధననుభవిస్తారు’ అని అన్నాడు.
14 “దేవుడు అనేకుల్ని ఆహ్వానిస్తాడు. కాని కొందర్ని మాత్రమే ఎన్నుకొంటాడు” అని అంటూ యేసు చెప్పటం ముగించాడు.
© 1997 Bible League International