Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
యెరూషలేముకు దేవుని సందేశం
22 దర్శన లోయను గూర్చిన విచారకరమైన సందేశం:
ప్రజలారా మీకు ఏమయింది?
మీరు ఎందుకు మీ ఇంటి కప్పుల మీద దాక్కొంటున్నారు?
2 గత కాలంలో ఈ పట్టణం చాలా కలవరంతో నిండి ఉండేది. ఈ పట్టణం చాలా అల్లరిగా చాలా ఉల్లాసంగా ఉండేది.
కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.
నీ ప్రజలు చంపి వేయబడ్డారు.
కానీ కత్తులతో కాదు.
ప్రజలు మరణించారు
కానీ యుద్ధం చేస్తూ కాదు.
3 మీ నాయకులంతా ఒక్కుమ్మడిగా పారి పోయారు
కానీ వాళ్లంతా బాణాలు లేకుండానే బంధించబడ్డారు.
నాయకులంతా కలిసి దూరంగా పారిపోయారు.
కానీ వాళ్లు బంధించబడ్డారు.
4 అందుకే నేనంటాను, “నా వైపు చూడవద్దు!
నన్ను ఏడ్వనివ్వండి.
యెరూషలేము నాశనం గూర్చి నన్ను ఆదరించాలని పరుగెత్తి రాకండి.”
5 యెహోవా ఒక ప్రత్యేక దినం ఏర్పాటు చేసుకొన్నాడు. ఆనాడు తిరుగుబాట్లు, గందరగోళంగా ఉంటుంది. దర్శనపు లోయలో ప్రజలు ఒకరినొకరు తొక్కుకుంటారు. పట్టణ ప్రాకారాలు కూలగొట్ట బడతాయి. లోయలో ఉన్న ప్రజలు కొండమీద పట్టణంలో ఉన్న ప్రజలను చూచి కేకలు వేస్తారు. 6 ఏలాము గుర్రాల సైనికులు వారి బాణాల పొదిని తీసుకొని యుద్ధానికీ స్వారీ చేస్తారు. కీరుప్రజలు వారి డాళ్లతో శబ్దాలు చేస్తారు. 7 సైన్యాలు మీ ప్రత్యేక లోయలో కలుసుకొంటాయి. లోయంతా రథాలతో నిండిపోతుంది. గుర్రాల సైనికులు పట్టణ ద్వారాల ముందు ఉంటారు. 8 యూదా వారు అరణ్య భవనంలో దాచుకొన్న వారి ఆయుధాలను ఆ సమయంలో ప్రయోగించాలని కోరుకొంటారు. యూదాను కాపాడుతున్న గోడలను శత్రువు కూలగొట్టేస్తాడు.
దేవుని మంద
5 మీలో ఉన్న సంఘ పెద్దలకు విజ్ఞప్తి చేయట మేమనగా, మీలాగే నేను కూడ ఒక పెద్దను. క్రీస్తు అనుభవించిన బాధల్ని చూసినవాణ్ణి. దేవుడు వ్యక్తం చేయనున్న మహిమలో భాగస్థుణ్ణి. 2 సంరక్షణలో ఉన్న దేవుని మందకు కాపరులుగా ఉండి దాన్ని జాగ్రత్తగా కాపాడండి. కర్తవ్యంగా కాకుండా మీ మనస్ఫూర్తిగా ఆ కార్యాన్ని చేయండి. దైవేచ్ఛ కూడా అదే! డబ్బుకు ఆశపడి కాకుండా మీ అభీష్టంతో ఆ కార్యాన్ని చేయండి. 3 దేవుడు మీకప్పగించిన వాళ్ళపై అధికారం చూపకుండా ఆ మందకు ఆదర్శ పురుషులుగా ఉండండి. 4 ముఖ్య కాపరి ప్రత్యక్షం అయినప్పుడు ఎన్నిటికీ నశించిపోని వెలుగు కిరీటం మీకు లభిస్తుంది.
5 అదే విధంగా యువకులు పెద్దలకు అణిగిమణిగి ఉండాలి. వినయమనే వస్త్రాన్ని ధరించి యితర్ల సేవ చెయ్యండి. ఎందుకంటే లేఖనాల్లో:
“దేవుడు గర్వంతో ఉన్నవాళ్ళకు వ్యతిరేకంగా ఉంటాడు,
కాని, వినయంతో ఉన్నవాళ్ళకు కృపననుగ్రహిస్తాడు.”(A)
అని వ్రాయబడి ఉంది.
చివరి వందనాలు
12 నా సోదరునిగా భావించే విశ్వాసనీయుడైన సిల్వాను సహయంతో మీకీ లేఖను పంపుచున్నాను. మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని, ఇది దేవుని నిజమైన అనుగ్రహమని సాక్ష్యం చెప్పాలని ఉద్దేశించి ఈ లేఖను వ్రాస్తున్నాను. ఆ అనుగ్రహాన్ని వదులుకోకండి.
13 మీతో సహా ఎన్నుకోబడి బబులోనులో ఉన్న సంఘం, నా కుమారునితో సమానమైన మార్కు, మీకు తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 14 ప్రేమలో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకొని శుభాకాంక్షలు తెలుపుకోండి.
క్రీస్తులో నున్న మీ అందరికి శాంతి కలుగుగాక!
© 1997 Bible League International