Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
2 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
3 యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
4 మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.
5 యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
7 యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
ఇతరుల నుండి నన్ను రక్షించుము.
8 ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్య విషయాలు చెబుతారు.
9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్యాలు చెబుతారు.
12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
యెరూషలేము స్త్రీలు అంటారు
5 ఎడారి మార్గంలో, తన ప్రియుని ఆనుకొని
వస్తున్న ఈ స్త్రీ ఎవరు?
ఆమె అతనితో అంటుంది
జల్దరు చెట్టు నీడలో నిన్ను తట్టి నే లేపాను.
అచ్చటే నిన్ను మోసిన నీ తల్లి నిన్ను కన్నది.
6 నీ హృదయ పీఠం మీద నా రూపం ముద్రించు,
నీ వేలికి ముద్రికలా ధరించు.
మృత్యువంత బలమైనది ప్రేమ
పాతాళమంత కఠనమైంది ఈర్శ్య.
అగ్ని జ్వాలల్లాంటివి దాని మంటలు
అవి పెచ్చు మీరి మహాజ్వాల[a] అవుతాయి.
7 ఉప్పెన కూడా ప్రేమజ్వాలను ఆర్పజాలదు.
నదీ జలాలూ ప్రేమను ముంచెత్తజాలవు.
ఒకడు ప్రేమ కోసం తన సర్వస్వం ధారపోస్తే,
అతణ్ణి ప్రజలు మూర్ఖుడిగా పరిగణించరు. ఎవడూ తప్పు పట్ట జాలడు!
ఆమె సోదరులు అంటారు
8 మాకు ఉన్నదొక చిన్న చెల్లెలు
ఆమెకింకా యుక్త వయస్సు రాలేదు.
ఆమెను వివాహం చేసుకొనుటకు ఒక పురుషుడు వస్తే,
మా చెల్లెలి విషయంలో మేమేమి చెయ్యాలి?
9 అది ప్రాకారమైతే,
దాని చుట్టూ వెండి నగిషీ[b] చేస్తాము
అది తలుపైతే, దాని చుట్టూ దేవదారు
పలకలతో అంచులు అలంకరిస్తాము.
ఆమె తన సోదరులతో అంటుంది
10 నేను ప్రాకారం వంటిదాన్ని
నా వక్షోజాలు గోపుర ప్రాయాలు
అతనికి నేనంటే తనివి, తృప్తి![c]
అతను అంటాడు
11 బయలు హామోనులో సొలొమోనుకొక ద్రాక్షాతోట ఉంది.
ఆ తోటనాతడు కొందరు రైతులకు కౌలుకిచ్చాడు.
వారిలో ఒక్కొక్క రైతు వెయ్యి వెండి షెకెళ్లు[d] ఇచ్చాడు.
12 సొలొమోనూ, ఆ వెయ్యి షెకెళ్లూ నీవే ఉంచుకో,
వాటిలో యిన్నూరేసి ఒక్కొక్క రైతుకు
అతడు తెచ్చిన ద్రాక్షాలకోసం యివ్వు.
నా ద్రాక్షాతోట నా స్వంతంగా ఉంటుంది!
అతను ఆమెతో అంటాడు
13 ద్రాక్షాతోటలో కూర్చున్న ఓ సఖీ,
నీ చెలికత్తెలు నీ స్వరం వింటున్నారు,
నీ మధుర స్వరాన్ని నన్నూ విననీయి.
ఆమె అతనితో
14 నా ప్రాణ స్నేహితుడా, వేగిరం వచ్చెయ్యి.
జింకల్లా, లేడి పిల్లల్లా పరిమళవృక్ష సముదాయం పెరిగిన పర్వతాలపై నుంచి చెంగుచెంగున వచ్చెయ్యి.
యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం
(మత్తయి 26:1-5; మార్కు 14:1-2; లూకా 22:1-2)
45 మరియ దగ్గరకు వచ్చిన యూదుల్లో చాల మంది యేసు చేసింది చూసి ఆయన యందు నమ్మకం ఉంచారు. 46 కొందరు మాత్రం పరిసయ్యుల దగ్గరకు వెళ్ళి యేసు చేసింది చెప్పారు. 47 అప్పుడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు మహాసభను ఏర్పాటు చేసారు. “మనం ఏం చేద్దాం? ఈ మనుష్యుడు చాలా మహాత్కార్యాలు చేస్తున్నాడు. 48 అతణ్ణి ఈ విధంగా వదిలి వేస్తే ప్రతి ఒక్కడు అతని శిష్యుడవుతాడు. ఆ తర్వాత రోమనులు వచ్చి మన మందిరాన్ని, మన దేశాన్ని నాశనం చేస్తారు” అని అన్నారు.
49 వాళ్ళలో ఒకడైన కయప అనబడే వాడు, “మీకేమీ తెలియదు!” అని అన్నాడు. కయప ఆ సంవత్సరానికి ప్రధాన యాజకుడు. 50 అతడు యింకా, “దేశమంతా నాశనం కావటానికన్నా ప్రజల కోసం ఒక మనిషి చావటం మంచిది. ఇది మీకు అర్థం కాదా?” అని అన్నాడు.
51-52 యూదుల దేశం కోసమేకాక, ప్రపంచంలో చెదిరియున్న దేవుని ఇతర జనాంగములను ఒకటిగా చేయటానికి కూడా యేసు ప్రాణమిస్తాడని కయప ప్రవచనం చెప్పాడు. అవి అతడు స్వయంగా ఆడిన మాటలు కావు. అవి అతడు ఆ సంవత్సరపు ప్రధాన యాజకునిగా పలికిన మాటలు.
53 ప్రధాన యాజకుని మాటలు విని ప్రజలు ఆనాటి నుండి యేసును చంపటానికి పన్నాగాలు పన్నటం మొదలు పెట్టారు. 54 అందువల్ల యేసు యూదుల మధ్య బహిరంగంగా తిరగటం మానేసి వాళ్ళకు దూరంగా ఎడారి దగ్గర ఉన్న ఎఫ్రాయిము అనే గ్రామానికి వెళ్ళి పోయాడు. అక్కడ ఆయన తన శిష్యులతో కొంత కాలం గడిపాడు.
55 యూదుల పస్కా పండుగ దగ్గరకు వచ్చింది. పండుగకు ముందు శుద్ధి చేసుకోవటానికి గ్రామ గ్రామాలనుండి చాలా మంది ప్రజలు యెరూషలేముకు వెళ్ళారు. 56 అక్కడ వీళ్ళంతా యేసు కోసం వెతికారు. మందిరంలో సమావేశం అయ్యాక వాళ్ళు, “మీరేమనుకుంటున్నారు? పండుగకు వస్తాడా? రాడా?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. 57 ప్రధానయాజకులు, పరిసయ్యులు, “యేసు ఎక్కడున్న విషయం తెలిసినవాడు వెంటనే తమకు తెలియచెయవలెనని” ఒక ఆజ్ఞ ప్రకటించారు. యేసును బంధించాలని వాళ్ళ ఉద్దేశ్యం.
© 1997 Bible League International