Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 144

దావీదు కీర్తన.

144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
    యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
    పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
    యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
    నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
    నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
    వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.

యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
    పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
    నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
    ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
    ఇతరుల నుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్య విషయాలు చెబుతారు.

యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
    పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
    యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
    ఈ శత్రువులు అబద్ధీకులు.
    వారు అసత్యాలు చెబుతారు.

12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
    మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
    నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
    పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14     మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
    మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.

15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
    యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.

యెహెజ్కేలు 19:10-14

10 “‘మీ తల్లి నీటి ప్రక్క
    నాటిన ద్రాక్షాలతలాంటిది.
దానికి నీరు పుష్కలంగా ఉంది.
    అది చాలా ఫలభరితమైన దళమైన ద్రాక్షా తీగలతో పెరిగింది.
11 ఆ పిమ్మట దానికి కొన్ని పెద్ద కొమ్మలు పెరిగాయి.
    అవి కొన్ని చేతికర్రల్లా ఉన్నాయి.
    ఆ కొమ్మలు రాజదండాల్లా ఉన్నాయి.
ఆ ద్రాక్షాలత అలా, అలా పొడుగ్గా,
    చాలా కొమ్మలతో మేఘాలను అంటేలా పెరిగింది.
12 కాని ఆ ద్రాక్షా చెట్టు వేర్లతో పెరికివేయబడి,
    నేలమీద కూల్చి వేయబడింది.
తూర్పుదిక్కు వేడిగాడ్పులు వీయగా దాని పండ్లు ఎండి పోయాయి.
    దాని పెద్ద కొమ్మలు విరిగి పోయాయి. అవి అగ్నిలో వేయబడ్డాయి.

13 “‘ఇప్పుడా ద్రాక్ష మొక్క ఎడారిలో నాటబడింది.
    అది నీరులేక, దాహం పుట్టించే ప్రాంతం.
14 దాని పెద్ద కొమ్మ నుండి నిప్పు చెలరేగింది.
    నిప్పు దాని రెమ్మలను, పండ్లను నాశనం చేసింది.
అందుచే బలమైన చేతికర్రగా లేదు;
    రాజదండముగా లేదు’

ఇది ఒక విషాద గీతం. అది వినాశనాన్ని గూర్చి పాడబడింది.”

1 పేతురు 2:4-10

మీరు సజీవమైన రాయియగు ప్రభువు వద్ధకు రండి. మానవులు ఈ సజీవమైన రాయిని తృణీకరించారు. కాని, దేవుడు ఆయన్ని అమూల్యంగా పరిగణించి ఎన్నుకొన్నాడు. మీరు కూడా సజీవమైన రాళ్ళుగా ఆత్మీయమైన మందిర నిర్మాణంలో కట్టబడుచున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ఆత్మీయబలుల్ని అర్పించడానికి మీరు పవిత్ర యాజకులుగా ఎన్నుకోబడ్డారు. ఎందుకంటే, ధర్మశాస్త్రంలో ఈ విషయాన్ని గురించి ఈ విధంగా వ్రాసారు:

“అదిగో చూడు! సీయోనులో ఒక రాయి స్థాపించాను!
    పునాది రాయిగా ఎన్నుకున్న అమూల్యమైన రాయి అది.
ఆయన్ని నమ్మిన వానికెవ్వనికి అవమానం ఎన్నటికి కలుగదు!”(A)

ఇప్పుడు నమ్మిన మీకు అది అమూల్యమైన రాయి. కాని నమ్మిన వాళ్ళకు:

“ఇల్లు కట్టేవాళ్ళు నిషేధించిన
    రాయి మూలకు తలరాయి అయింది.”(B)

మరొక చోట యిలా వ్రాయబడి ఉంది:

“ఈ రాయి, మానవులు తొట్రుపడేటట్లు చేస్తుంది.
    ఈ బండ వాళ్ళను క్రింద పడవేస్తుంది.”(C)

దైవసందేశాన్ని నిరాకరించిన వాళ్ళు తొట్రుపడతారు. వాళ్ళు దానికని నిర్ణయించబడ్డారు.

కాని, మీరు దేవుడు ఎన్నుకొన్న ప్రజలు, మీరు రాజవంశానికి చెందిన యాజకులు, మీరు పవిత్రమైన జనాంగము, మీరు దేవునికి సన్నిహితమైన ప్రజలు. తన ఘనతను గూర్చి చెప్పటానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అంధకారం నుండి అద్భుతమైన తన వెలుగులోకి రమ్మని ఆయన మిమ్మల్ని పిలిచాడు.

10 పూర్వం మీరు దేవుని ప్రజ కాదు.
    ఇప్పుడు మీరు దేవుని ప్రజ.
పూర్వం మీకు దైవానుగ్రహం లభించలేదు.
    కాని యిప్పుడు లభించింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International