Revised Common Lectionary (Complementary)
7 సర్వశక్తిమంతుడవైన దేవా, మరల మమ్మల్ని అంగీకరించుము.
నీ ముఖము మామీద ప్రకాశించునట్లు మమ్మల్ని రక్షించుము.
8 గతకాలంలో నీవు మమ్మల్ని ప్రాముఖ్యమైన మొక్కలా చూశావు.
ఈజిప్టు నుండి నీవు నీ “ద్రాక్షాలత” తీసుకొని వచ్చావు.
ఇతర ప్రజలను ఈ దేశం నుండి నీవు వెళ్లగొట్టావు.
నీ “ద్రాక్షావల్లిని” నీవు నాటుకొన్నావు.
9 “ద్రాక్షావల్లి” ఎదుగుటకు నేలను నీవు సిద్ధం చేశావు.
దాని వేర్లు బలంగా ఎదుగుటకు నీవు సహాయం చేశావు త్వరలోనే “ద్రాక్షావల్లి” దేశం అంతా వ్యాపించింది.
10 అది పర్వతాలను కప్పివేసింది.
దాని ఆకులు మహాదేవదారు వృక్షాలను సహా కప్పివేసాయి.
11 దాని తీగెలు మధ్యధరా సముద్రం వరకు విస్తరించాయి. దాని కొమ్మలు యూఫ్రటీసు నది వరకూ విస్తరించాయి.
12 దేవా, నీ “ద్రాక్షావల్లిని” కాపాడుతున్న గోడను నీవెందుకు పడగొట్టావు?
ఇప్పుడు దారిన పోయే ప్రతిమనిషీ దాని ద్రాక్షాపండ్లను కోసుకొంటున్నాడు.
13 అడవి పందులు వచ్చి నీ “ద్రాక్షావల్లి” మీద నడుస్తాయి.
అడవి మృగాలు వచ్చి ఆకులు తింటాయి.
14 సర్వశక్తిగల దేవా, తిరిగి రమ్ము.
పరలోకం నుండి నీ “ద్రాక్షావల్లిని” చూడుము. దానిని కాపాడుము.
15 దేవా, నీ స్వంత చేతులతో నీవు నాటుకొన్న నీ “ద్రాక్షావల్లిని” చూడుము.
నీవు పెంచిన ఆ లేత మొక్కలను[a] చూడుము.
14 “ఇశ్రాయేలు ప్రజలు బానిసలైపోయారా?
వారు పుట్టుకతో బానిసలుగా తయారైనారా?
ఇశ్రాయేలు ప్రజలను ఇతరులు ఎందుకు కొల్లగొడుతున్నారు?
15 యువకిశోరాలు (శత్రువులు) ఇశ్రాయేలు రాజ్యంపై గర్జిస్తున్నాయి.
సింహాలు కోపంతో గుర్రుమంటున్నాయి. ఇశ్రాయేలు ప్రజల దేశాన్ని సింహాలు నాశనం చేశాయి.
ఇశ్రాయేలు నగరాలు తగులబెట్టబడ్డాయి.
అవి నిర్మానుష్యమైనాయి. వాటిలో ప్రజలెవ్వరూ లేరు.
16 మెంఫిస్, తహపనేసు[a] వీటినుండి వచ్చిన
యోధులు నీ తల చితుకగొట్టారు.
17 ఈ కష్టానికంతటికి నీ తప్పులే కారణం!
చక్కని మార్గంలో మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్న[b]
మీ దేవుడైన యెహోవా నుండి మీరు తొలగిపోయారు
18 యూదా ప్రజలారా, మీరిది ఆలోచించండి:
ఈజిప్టుకు వెళ్లటం వలన ఏమైనా మేలు జరిగిందా?
నైలునది (షీహోరు) జలాన్ని తాగినందువల్ల ఏమి మేలు జరిగింది?
లేదు. ఏమీ లేదు! అష్షూరుకు వెళ్లుట వలన ఏమి జరిగింది?
యూఫ్రటీసు నదీజలాన్ని తాగినందువల్ల ఏమి కలిసివచ్చింది. లేదు. ఏమీలేదు.
19 మీరు చెడు పనులు చేశారు.
మీ చెడ్డ పనులు మీకు శిక్షను తెస్తాయి.
మీకు కష్టాలు సంభవిస్తాయి.
ఆ ఆపద మీకు తగిన గుణపాఠం నేర్పుతుంది.
దీనిని గురించి యోచన చేయండి! మీకై మీరు మీ దేవునికి దూరమగుట ఎంతటి ఘోరమైన విషయమో అప్పుడు మీకు అర్థమవుతుంది.
నేనంటే భయ భక్తులు లేకపోవుట తగనిపని!”
ఈ వర్తమానం నా ప్రభువును, సర్వశక్తి మంతుడయిన దేవుని వద్దనుండి వచ్చినది.
20 “యూదా, చాలాకాలం క్రితమే నీవు నీకాడిని పారవేసినావు.
నాకు దగ్గరగా ఉంచుకొనేందుకు నిన్నులాగి పట్టిన పగ్గాలను తెంచుకున్నావు.
‘నేను నిన్ను సేవించను’ అని నన్ను తిరస్కరించావు.
నిజంగా నీవు ప్రతి కొండమీద, ప్రతి పచ్చని చెట్టుక్రింద
పండుకొని పచ్చి వేశ్యలా ప్రవర్తించావు.[c]
21 యూదా, నిన్నొక మేలురకం ద్రాక్షపాదువలె నాటాను.
మీరంతా మేలురకం విత్తనాల్లా ఉన్నారు.
కాని నాసిరకం పండ్లనిచ్చే వేరొక రకం ద్రాక్షలతల్లా ఎలా తయారయ్యారు?
22 క్షారజలంతో స్నానం చేసుకున్నా,
నీవు విస్తరించి సబ్బు వినియోగించినా
నేను నీ దోష కళంకాన్ని చూడగలను.”
ఈ వర్తమానం దేవుడైన యెహోవాది.
మానవకల్పిత నియమాలు పాటించకు
16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.
20 మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? 21 “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” 22 ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. 23 ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.
© 1997 Bible League International