Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
2 యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
నా మీద దయ చూపించుము.
3 యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
4 యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
5 యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.
6 యెహోవాను స్తుతించండి.
కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
7 యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
8 యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.
9 దేవా, నీ ప్రజలను రక్షించుము.
నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
కాపరిలా వారిని నిత్యం నడిపించుము.
23 ఫిలిష్తీయుల పాలకులు ఒకటిగా చేరి పండగ చేసుకోవాలనుకున్నారు. తమ దేవుడైన దాగోనుకు[a] పెద్ద బలి కూడా ఇవ్వాలనుకున్నారు. “మన శత్రువైన సమ్సోనును ఓడించేందుకు మన దేవుడు మనకు సహాయం చేశాడు.” అని అనుకున్నారు. 24 సమ్సోనుని చూడగానే వారు తమ దేవుణ్ణి ప్రశంసించారు. వారు ఇలా అన్నారు:
“ఈ మనిషి మనవారిని నాశనం చేశాడు.
ఈ మనిషి మనవారిలో పలువురిని చంపాడు,
కాని మన దేవుడు మన శత్రువుని వశం చేసుకునేందుకు సహాయం చేశాడు!”
25 ఉత్సవ సమయంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అప్పుడు వారిలా అన్నారు: “సమ్సోనును వెలికి తీసుకురండి. అతనిని చూసి మేము పరిహాసం చెయ్యాలి.” కనుక చెరసాల నుంచి సమ్సోనును బయటికి తీసుకువచ్చారు. అతనిని పరిహసించారు. దేవుడైన దాగోను గుడిలో స్తంభాల మధ్య సమ్సోనును నిలబెట్టారు. 26 ఒక సేవకుడు సమ్సోను చెయ్యి పట్టుకున్నాడు. అతనితో సమ్సోను, “ఈ ఆలయానికి ఆధారంగా వున్న స్తంభాల మధ్య నన్ను ఉంచు. వాటిని ఆనుకుని వుంటాను” అన్నాడు.
27 ఆ ఆలయం స్త్రీ పురుషులతో కిటకిటలాడుతున్నది. ఫిలిష్తీయుల పాలకులందరూ అక్కడికి చేరారు. ఆలయ కప్పుమీద సుమారు మూడువేల మంది స్త్రీ పురుషులు ఉన్నారు. వారందరూ సమ్సోనును చూసి ఎగతాళి చేస్తున్నారు. 28 అప్పుడు యెహోవాను సమ్సోను స్తుతించాడు. “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నన్ను మరచిపోవద్దు. దేవుడా, మరొకసారి నాకు బలం ప్రసాదించు. నా రెండు కళ్లనీ చీల్చివేసిన ఈ ఫిలిష్తీయులను శిక్షించేందుకు నాకు శక్తి ఇయ్యి.” అని ప్రార్థించాడు. 29 అప్పుడు ఆలయం మధ్య వున్న రెండు స్తంభాలను సమ్సోను పట్టుకున్నాడు. ఆ రెండు స్తంభాలు ఆలయాన్ని భరిస్తున్నవి. ఆ రెండు స్తంభాలను అతను కౌగిలించుకున్నాడు. ఒక స్తంభం అతని కుడిచేయి వైపున వున్నది. మరొకటి ఎడమ చేతివైపున వున్నది. 30 సమ్సోను ఇలా అన్నాడు; “ఈ ఫిలిష్తీయులతో పాటు నేను మరణిస్తాను” అని, తర్వాత తన శక్తికొద్దీ వాటిని తోశాడు. ఆలయంలోపల వున్న పరిపాలకులు మరియు మనుష్యుల మీద ఆలయం పడిపోయింది. ఈ విధంగా సమ్సోను ఇంకా మరికొందరు ఫిలిష్తీయులను చంపివేశాడు. అతను జీవించిన నాటికంటె మరణ సమయంలోనే, చాలా మందిని చంపి వేశాడు.
31 సమ్సోను యొక్క సోదరులు, అతని కుటుంబంలోని వారందరూ అతని దేహం తీసుకురావడానికి వెళ్లారు. అతనిని తీసుకు వచ్చి, తండ్రి సమాధిలో పాతి పెట్టారు. ఆ సమాధి జోర్యా, ఏష్తాయోలు నగరాల మధ్య ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలకు సమ్సోను ఇరవై సంవత్సరాలపాటు న్యాయాధిపతిగా వ్యవహరించాడు.
2 కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.
3 ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.
4 వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? 5 ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? 6 పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.
7 పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. 8 ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.
© 1997 Bible League International