Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 28

దావీదు కీర్తన.

28 యెహోవా, నీవే నా బండవు.
సహాయం కోసం నేను నిన్ను పిలుస్తున్నాను.
    నా ప్రార్థనలకు నీ చెవులు మూసుకోవద్దు.
సహాయంకోసం పిలుస్తున్న నా పిలుపుకు నీవు జవాబు ఇవ్వకపోతే
    అప్పుడు నేను సమాధిలోనున్న శవాల్లాగే ఉంటాను.
యెహోవా, నీ అతి పవిత్ర స్థలం వైపు నేను నా చేతులు ఎత్తి, ప్రార్థిస్తున్నాను.
    నేను నిన్ను వేడుకొన్నప్పుడు, నా మాట ఆలకించుము.
    నా మీద దయ చూపించుము.
యెహోవా, నేను చెడ్డవాళ్లవలె ఉన్నానని తలంచవద్దు. చెడు కార్యాలు చేసే దుర్మార్గుల్లోకి నన్ను లాగకుము.
    ఆ మనుష్యులు వారి పొరుగువారిని “షాలోం”[a] అని అభినందిస్తారు. కాని వారి హృదయాల్లో వారి పొరుగువారిని గూర్చి వారు చెడ్డ పథకాలు వేస్తున్నారు.
యెహోవా, ఆ మనుష్యులు ఇతరులకు కీడు చేస్తారు.
    కనుక వారికి కూడ కీడు జరిగేటట్టుగా చేయుము.
    ఆ చెడ్డవాళ్లు శిక్షించబడాల్సిన విధంగా వారిని శిక్షించుము.
యెహోవా చేసే మంచి పనులను చెడ్డవాళ్లు గ్రహించరు.
    ఆయన చేసే మంచి వాటిని వారు చూడరు, అర్థం చేసుకోరు.
    వారు నాశనం చేయటానికి ప్రయత్నిస్తారు.

యెహోవాను స్తుతించండి.
    కరుణించుమని నేను చేసిన నా ప్రార్థన ఆయన విన్నాడు.
యెహోవా నా బలం, ఆయనే నా డాలు.
    నేను ఆయనను నమ్ముకొన్నాను.
ఆయన నాకు సహాయం చేసాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను.
    మరియు నేను ఆయనకు స్తుతి కీర్తనలు పాడుతాను.
యెహోవా తన ప్రజలకు బలమైయున్నాడు.
    ఆయన ఏర్పాటు చేసుకొన్నవానికి[b] శక్తి, విజయాలను ఆయన ఇస్తాడు.

దేవా, నీ ప్రజలను రక్షించుము.
    నీకు చెందిన ప్రజలను ఆశీర్వదించుము.
    కాపరిలా వారిని నిత్యం నడిపించుము.

న్యాయాధిపతులు 14

సమ్సోను వివాహం

14 సమ్సోను తిమ్నాతు నగరానికి వెళ్లాడు. అక్కడ ఒక ఫిలిష్తీయుల యువతిని అతను చూశాడు. అతను ఇంటికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులతో ఇలా అన్నాడు: “తిమ్నాతులో నేనొక ఫిలిష్తీయుల స్త్రీని చూశాను. మీరామెను తీసుకు రావాలి అని నా కోరిక. నేనామెను పెళ్లి చేసుకుంటాను.”

అతని తల్లిదండ్రులు ఇలా సమాధానం చెప్పారు: “నీవు పెళ్లి చేసుకోవటానికి! ఇశ్రాయేలు ప్రజల మధ్య తప్పకుండా ఒక స్త్రీ ఉంటుంది. కాని ఫిలిష్తీయుల మధ్యగల ఒక స్త్రీని నీవు పెళ్లి చేసుకుంటావా? ఆ ప్రజలు సున్నతి కూడా చేసుకోలేదు.”

కాని సమ్సోను ఇలా అన్నాడు: “ఆ స్త్రీని నా కోసం తీసుకురండి ఆమె నాకు కావాలి.” (యెహోవా ఇది జరగాలని ఆశించినట్టు సమ్సోను తల్లిదండ్రులకు తెలియదు. ఫిలిష్తీయులకు విరుద్ధంగా ఏదో ఒకటి చేయటానికి యెహోవా ఒక అవకాశం కోసం చూడసాగాడు. ఫిలిష్తీయులు అప్పట్లో ఇశ్రాయేలు ప్రజల మీద ఆధిపత్యం చలాయించే వారు.)

సమ్సోను తన తల్లిదండ్రుల్ని వెంట బెట్టుకుని తిమ్నాతు నగరానికి వెళ్లాడు. నగరానికి దగ్గరగా ఉన్న ద్రాక్షతోటలదాకా వారు వెళ్లారు. అప్పుడు ఒక మదించిన సింహం ఉన్నట్టుండి గర్జించింది. అది సమ్సోను మీదికి దుమికింది. అప్పుడు యెహోవా ఆత్మ సమ్సోనుని బలపరచగా, గొప్ప శక్తితో, వట్టి చేతులతోనే అతను సింహాన్ని చీల్చివేశాడు. అది అతనికి సులభంగా తోచింది. ఒక పడుచు మేకను చీల్చునంత సులభంగా తోచిందాపని. కాని అతనేమి చేశాడో, ఆ సంగతి తల్లికి గాని తండ్రికి గాని తెలుపలేదు.

అందువల్ల సమ్సోను నగరానికి వెళ్లి, ఆ ఫిలిష్తీయుల స్త్రీతో మాట్లాడాడు. ఆమె అతనిని సంతోషపెట్టింది. చాలారోజుల తర్వాత, సమ్సోను ఫిలిష్తీయుల స్త్రీని వివాహమాడేందుకు తిరిగి వచ్చాడు. త్రోవలో చచ్చిపోయిన ఆ సింహాన్ని చూడటానికి వెళ్లాడు. మృత సింహం శరీరం మీద తేనెటీగల గుంపు చూశాడు. అవి కొంచెం తేనె తయారు చేశాయి. తన చేతులతో సమ్సోను ఆ తేనెను తీసుకున్నాడు. ఆ తేనె తింటూ అతను నడిచాడు. తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ తేనె కొంచెం వారికి ఇచ్చాడు. వారు కూడా తిన్నారు. కాని మృత సింహం శరీరంనుంచి తాను తేనెను తెచ్చినట్లు సమ్సోను తల్లిదండ్రులకు చెప్పలేదు.

10 సమ్సోను తండ్రి ఆ ఫిలిష్తీయుల స్త్రీని చూసేందుకు వెళ్లాడు. పెళ్లికొడుకు విందు ఇవ్వడం ఆ రోజులలో ఆచారంగా ఉండేది. అందువల్ల సమ్సోను ఒక విందు ఇచ్చాడు. 11 ఫిలిష్తీయుల ప్రజలు అతను విందు యివ్వడం చూసి అతనికి తోడుగా ముప్ఫై మంది మనుషుల్ని పంపారు.

12 అప్పుడు సమ్సోను ముప్ఫై మంది మనుష్యులతో ఇలా అన్నాడు: “నేను మీకో విప్పుడుకథను చెపుతాను. ఈ విందు ఏడు రోజులపాటు సాగుతుంది. ఈలోగా మీరు సమాధానం వెతకాలి. ఈలోగా కనుక మీరు విప్పుడుకథకు సమాధానం చెప్పగలిగితే, నేను మీకు ముప్ఫై నార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలు ఇస్తాను. 13 కానీ మీకు సమాధానం దొరక్కపోతే అప్పుడు మీరు ముప్ఫైనార వస్త్రాలు, ముప్ఫై మార్పు గుడ్డలను ఇవ్వాలి.” అప్పుడు ఆ ముప్ఫై మంది మనుష్యులు ఇలా అన్నారు. “నీ విప్పుడుకథ ఏమిటో మాకు చెప్పు. అది మేము వినదలచాము.”

14 సమ్సోను ఈ విప్పుడుకథ వాళ్లకి చెప్పాడు:

“బలమైన దానిలోనుండి తీపి వచ్చింది.
తినుదానిలో నుండి తిండి వచ్చింది.”

మూడు రోజుల పాటు ఆ ముప్ఫైమంది మనుష్యులు సమాధానం కోసం ప్రయత్నించారు. కాని కనుగొనలేకపోయారు.

15 నాలుగవ రోజున,[a] ఆ మనుష్యులు సమ్సోను భార్య వద్దకు వచ్చారు. వారన్నారు: “మమ్మల్ని పేదవారుగా చేసేందుకు ఇక్కడికి ఆహ్వానించావా? ఆ విప్పుడుకథకు సమాధానం చెప్పవలసిందిగా నీవు నీ భర్తను ప్రేరేపించాలి. మా కోసం కనుక నీవు సమాధానం రప్పించకపోతే మేము నిన్ను కాల్చివేస్తాము. అలాగే మీ తండ్రి వద్ద ఉన్న మనుష్యులందరినీ చంపివేస్తాము.”

16 అందువల్ల సమ్సోను భార్య అతనిని సమీపించి విలపించింది. ఆమె అన్నది: “నీవు నన్ను ద్వేషిస్తున్నావు. నీవు నిజంగా నన్ను ప్రేమించడంలేదు. నీవు మా మనుష్యులకో విప్పుడుకథ ఇచ్చావు. నీవు నాకైనా సమాధానం చెప్పవా?”

అప్పుడు సమ్సోను ఇలా అన్నాడు: “నేను నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. నేను నీకు ఎందుకు చెప్పాలి?”

17 విందులోని కడమ యేడు రోజులూ సమ్సోను భార్య ఏడుస్తూ కూర్చుంది. చివరికతను సమాధానం చెప్పాడు. ఏడవ రోజున ఆ విప్పుడుకథకు సమాధానం తెలియజేశాడు. ఆమె తనను వేధించుకు తినడంవల్ల ఆమెకు సమాధానం చెప్పాడు. తర్వాత ఆమె తన మనుష్యుల వద్దకు వెళ్లి, విప్పుడుకథకు సమాధానం చెప్పింది.

18 ఏడవ రోజున సూర్యుడు అస్తమించేలోగా ఫిలిష్తీయుల మనుష్యులకు సమాధానం లభించింది. వారు సమ్సోను వద్దకు వచ్చి, ఇలా అన్నారు:

“తేనె కంటె మధురమైనదేది?
సింహంకంటె బలంకలది ఏది?”

తర్వాత సమ్సోను వాళ్లతో ఇలా అన్నాడు:

“మీరు కనుక నా ఆవుతోనే దున్నక పోతే
    మీరు నా విప్పుడుకథను పరిష్కరించి ఉండలేరు.”

19 సమ్సోను ఉగ్రుడయ్యాడు. యెహోవా ఆత్మ గొప్ప శక్తితో సమ్సోనుని నింపింది. అతను అష్కెలోను నగరానికి వెళ్లాడు. ఆ నగరంలో అతను ముప్ఫైమంది ఫిలిష్తీయులను చంపివేశాడు. తర్వాత వారి మృత శరీరాల మీది నుంచి అన్ని వస్త్రాలు, సొమ్ములు తీసుకున్నాడు. అతను ఆ వస్త్రాలను తిరిగి తీసుకు వచ్చి, తన విప్పుడుకథకు సమాధానం చెప్పిన ఆ ముప్ఫై మంది మనుష్యులకు ఇచ్చివేశాడు. తర్వాత అతను తన తండ్రి ఇంటికి వెళ్లాడు. 20 సమ్సోను తన భార్యను తీసుకుపోలేదు. ఆమె తండ్రి ఇష్టము చొప్పున అటు తరువాత ఆమెను సమ్సోను ప్రాణ స్నేహితుడు ఒకడు భార్యగా అంగీకరించెను.

ఫిలిప్పీయులకు 1:3-14

కృతజ్ఞత, ప్రార్థన

నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. దైవసందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది.

మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను.

ఇదే నా ప్రార్థన:

మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. 10 అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. 11 మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది.

పౌలు సంకెళ్ళు, సువార్త

12 సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవసందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడతాయని మీరు గమనించాలి. 13 ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. 14 ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవసందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International