Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 18:1-4

నిజమైన న్యాయం

18 యెహోవా వాక్కు నాకు వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు: “మీరీ సామెత వల్లిస్తూ ఉంటారు:

‘తల్లిదండ్రులు పుల్లని ద్రాక్ష తింటే
    పిల్లలపండ్లు పులిశాయి!’ అని.

ఇలా మీరెందుకు అంటూ వుంటారు? మీరు పాపంచేస్తే, మీ బదులు భవిష్యత్తులో మరెవ్వడో శిక్షింపబడతాడని మీరనుకుంటున్నారు.”

కాని నా ప్రభువైన యెహోవా చెబుతున్నదేమంటే, “నా జీవ ప్రమాణంగా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత ఇక మీదట నిజమని నమ్మరని నేను మీకు ఖచ్చితంగా చెబుతున్నాను! నేను ప్రతి వ్యక్తినీ ఒకే రకంగా చూస్తాను. ఆ వ్యక్తి తండ్రిగాని, బిడ్డగాని కావచ్చు. పర్వాలేదు. ఎవరైతే పాపం చేశారో ఆ వ్యక్తులే చనిపోతారు!

యెహెజ్కేలు 18:25-32

25 దేవుడు ఇలా చెప్పాడు: “ప్రజలారా మీరు, ‘మా ప్రభువైన దేవుడు న్యాయంగా ప్రవర్తించడు’ అని అంటారు. కాని ఇశ్రాయేలు వంశములారా, వినండి. నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 26 ఒక మంచి మనిషి మారిపోయి, చెడ్డవాడైతే అతని చెడ్డకార్యాలకు ఫలితంగా అతడు చనిపోతాడు. 27 ఒక చెడ్డ వ్యక్తి మారి, మంచివాడై, మంచికార్యాలు చేస్తే, అతడు తన జీవితాన్ని రక్షించుకుంటాడు. అతడు బతుకుతాడు! 28 తాను పూర్వం ఎంత చెడ్డవాడో తెలుసుకొని, నావద్దకు తిరిగి వచ్చిన వాడవుతాడు. తాను గతంలో చేసిన చెడ్డకార్యాలు మళ్లీ చేయటం మానటంతో అతడు జీవిస్తాడు! అతడు మరణించడు!”

29 ఇశ్రాయేలు ప్రజలు, “అది న్యాయం కాదు! మా ప్రభువైన యెహోవా న్యాయంగా వుండనేరడు!” అని అన్నారు.

అందుకు దేవుడు ఇలా అన్నాడు: “నేను న్యాయంగానే ఉన్నాను. మీరే న్యాయంగా లేరు. 30 ఓ ఇశ్రాయేలు వంశమా, ఎందువల్లనంటే, నేను ప్రతి వ్యక్తికీ అతను చేసిన కార్యాలను అనుసరించి న్యాయనిర్ణయం చేస్తాను!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “కావున, మీరు నా వద్దకు తిరిగిరండి. చెడుకార్యాలు చేయటం మానండి! ఆ ఘోరమైన వస్తువులు మీరు పాపం చేయటానికి కారణం కానీయకండి! 31 మీరు చేసిన భయంకర వస్తువులన్నీ పారవేయండి. అవన్నీ కేవలం మీరు పాపం చేయటానికే దోహదం చేస్తాయి! మీ హృదయాలను, ఆత్మలను మార్చుకోండి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మల్ని మీరెందుకు చనిపోయేలాగు చేసుకొంటున్నారు? 32 నేను మిమ్మల్ని చంపకోరటం లేదు! దయచేసి నా వద్దకు తిరిగి రండి. జీవించండి!” ఆ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

కీర్తనలు. 25:1-9

దావీదు కీర్తన.

25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
    నేను నిరాశచెందను.
    నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
    కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
    వారికి ఏమీ దొరకదు.

యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
    నీ మార్గాలను ఉపదేశించుము.
నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
    నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
    రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
    నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
    యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.

యెహోవా నిజంగా మంచివాడు.
    జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
    న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.

ఫిలిప్పీయులకు 2:1-13

క్రీస్తు వినయంను అనుకరించుట

క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా! అలాగైతే ఒకే మనస్సుతో, ఒకే ప్రేమలో పాలుపంచుకొంటూ, ఒకే ఆత్మతో, ఒకే ఉద్దేశంతో ఉండి నన్ను పూర్తిగా ఆనందపరచండి. స్వలాభం కోసంగాని, స్వాభిమానం కోసంగాని ఏదీ చేయకండి. వినయంగా ఉండండి. మీరు యితరులకన్నా గొప్ప అని భావించకండి. మీ స్వార్థం కోసం మాత్రమే చూసుకోకుండా యితరుల అవసరాలను కూడా గమనించండి.

నిస్వార్థంగా నుండుటకు క్రీస్తునుండి నేర్చుకొనండి

యేసు క్రీస్తులో ఉన్న మనస్సును పెంచుకోండి.

ఆయన దేవునితో సమానము.
    అయినా ఆయన ఆ స్థానాన్ని పట్టుకొని కూర్చోవాలనుకోలేదు.
ఆయన అంతా వదులుకొన్నాడు.
    మానవ రూపం దాల్చి సేవకునివలే ఉండటానికి వచ్చాడు.
    మానవుని వలే కనిపిస్తూ, వినయంగా వుంటూ,
    మరణాన్ని కూడా విధేయతగా అంగీకరించి, సిలువపై మరణించాడు.
అందువల్ల దేవుడాయనకు ఉన్నత స్థానం ఇచ్చి
    అన్ని పేర్లకన్నా ఉత్తమమైన పేరు యిచ్చాడు.
10 యేసు పేరు విన్నప్పుడు పరలోకంలో, భూలోకంలో, పాతాళలోకంలో
    ఉన్నవాళ్ళంతా ఆయన ముందు మోకరిల్లాలని ఈ విధంగా చేసాడు.
11 ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభువని అంగీకరించాలని ఈ విధంగా చేసాడు.
    తండ్రియైన దేవునికి మహిమ కలుగుగాక!

నక్షత్రాలవలె ప్రకాశించటం

12 నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి. 13 దేవుడు మీలో ఉండి తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చుకోవటానికి కావలసిన ఉత్సాహము, శక్తి మీకు యిస్తాడు.

మత్తయి 21:23-32

యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం

(మార్కు 11:27-33; లూకా 20:1-8)

23 యేసు మందిరానికి వెళ్ళి బోధిస్తుండగా ప్రధాన యాజకులు, పెద్దలు వచ్చి, “ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకి అధికారం ఎవరిచ్చారు?” అని అడిగారు.

24 యేసు సమాధానం చెబుతూ, “నేను కూడా మిమ్మల్నొక ప్రశ్న అడుగుతాను. మీరు దానికి సమాధానం చెబితే నేను ఇది ఎవరిచ్చిన అధికారంతో చేస్తున్నానో చెబుతాను. 25-26 బాప్తిస్మమివ్వమని యోహానును ఎవరు పంపారు? దేవుడా? మానవులా?” అని అడిగాడు.

వాళ్ళు, “‘దేవుడు’ అని సమాధానం చెబితే మరి అలాగైతే అతణ్ణి ఎందుకు నమ్మలేదు? అని అంటాడు ‘మానవులు’ అని సమాధానం ఇస్తే ప్రజలందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్మేవాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారో” అనే భయంతో పరస్పరం మాట్లాడుకొన్నారు.

27 అందువల్ల వాళ్ళు, “మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.

ఆయన, “నేను కూడా ఎవరిచ్చిన అధికారంతో యివి చేస్తున్నానో మీకు చెప్పను” అని అన్నాడు.

తండ్రి మాట పాలించిన కుమారుని ఉపమానం

28 “ఆలోచించి సమాధానం చెప్పండి. ఒకనికి యిద్దరు కుమారులుండేవాళ్ళు. అతడు మొదటి కుమారుని దగ్గరకు వెళ్ళి, ‘నాయనా! వెళ్ళి ఈ రోజు ద్రాక్షతోటలో పనిచెయ్యి!’ అని అన్నాడు.

29 “కుమారుడు, ‘నాకిష్టంలేదు’ అని సమాధానం చెప్పాడు. కాని తదుపరి తన మనస్సు మార్చుకొని పని చెయ్యటానికి వెళ్ళాడు.

30 “తండ్రి రెండవ కుమారునికి అదే విషయం చెప్పాడు. రెండవ కుమారుడు ‘వెళ్తానండి’ అని అన్నాడు. కాని వెళ్ళలేదు.

31 “ఆ యిద్దరిలో తండ్రి మాటను ఎవరు పాటించారు? అని యేసు అడిగాడు.”

“మొదటి వాడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “నేను మీకు సత్యం చెబుతున్నాను. సుంకరులు, వేశ్యలు మీకన్నా ముందు దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తారు. 32 మీకు నీతిమార్గాన్ని చూపటానికి యోహాను వచ్చాడు. మీరతణ్ణి నమ్మలేదు. కాని సుంకరులు, వేశ్యలు ఆయన్ని విశ్వసించారు. ఇది చూసాక కూడా మీరు మారుమనస్సు పొందలేదు, విశ్వసించలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International