Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
25 యెహోవా, నేను నీకు నన్ను అర్పించుకొంటాను.
2 నా దేవా, నేను నిన్ను నమ్ముకొంటున్నాను.
నేను నిరాశచెందను.
నాశత్రువులు నన్ను చూచి నవ్వరు.
3 నిన్ను నమ్ముకొనే ఏ మనిషి నిరాశచెందడు.
కాని నమ్మక ద్రోహులు నిరాశపడతారు.
వారికి ఏమీ దొరకదు.
4 యెహోవా, నీ మార్గాలు నేర్చుకొనుటకు నాకు సహాయం చేయుము.
నీ మార్గాలను ఉపదేశించుము.
5 నన్ను నడిపించి, నీ సత్యాలు నాకు ఉపదేశించుము.
నీవు నా దేవుడవు, నా రక్షకుడవు.
రోజంతా నేను నిన్ను నమ్ముతాను.
6 యెహోవా, నా యెడల దయ చూపుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
నీవు ఎల్లప్పుడూ చూపిస్తూ వచ్చిన ఆ ప్రేమను నా యెడల చూపించుము.
7 నేను యౌవ్వనంలో ఉన్నప్పుడు చేసిన పాపాలు చెడు కార్యాలు జ్ఞాపకం చేసుకోవద్దు.
యెహోవా, నీ నామ ఘనతకోసం ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
8 యెహోవా నిజంగా మంచివాడు.
జీవించాల్సిన సరైన మార్గాన్ని పాపులకు ఆయన ఉపదేశిస్తాడు.
9 దీనులకు ఆయన తన మార్గాలను ఉపదేశిస్తాడు.
న్యాయంగా ఆయన వారిని నడిపిస్తాడు.
భయంతో వణకుట
17 ఆ పిమ్మట మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 18 “నరపుత్రుడా, నీవు చాలా భయపడినవానిలా వ్యవహరించాలి. నీవు ఆహారం తీసుకొనే సమయంలో వణకాలి. నీవు నీరుతాగేటప్పుడు వ్యాకుల పడుతున్నట్లు, భయపడుతున్నట్లు ప్రవర్తించాలి. 19 ఈ విషయాలు నీవు సామాన్య ప్రజలకు తెలియజెప్పాలి. నీవు ఇలా అనాలి: ‘యెరూషలేము ప్రజలకు, ఇశ్రాయేలులో ఇతర ప్రాంతాల ప్రజలకు మన ప్రభువైన యెహోవా చేపుతున్నాడు, మీరు మీ ఆహారం తీసుకొనేటప్పుడు మిక్కిలి కలత చెందుతారు. మీరు నీరు తాగేటప్పుడు. భయకంపితులవుతారు. ఎందువల్లనంటే, మీ దేశంలో అన్ని వస్తువులూ సర్వనాశనం చేయబడతాయి! అక్కడ నివసిస్తున్న ప్రజలందరి పట్ల శత్రువు చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. 20 మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని ఆ నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.’”
నాశనం వస్తుంది
21 యెహోవా వాక్కు నాకు మరల వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 22 “నరపుత్రుడా, ఇశ్రాయేలును గురించి ఎందుకు ఈ పాట పాడుకుంటారు?
‘ఆపద త్వరలో రాదు,
దర్శనాలు నిజం కావు.’
23 “వారి ప్రభువైన యెహోవా ఆ పాటను ఆపుచేయిస్తాడని ప్రజలకు చెప్పు. ఇశ్రాయేలును గురించి ఆ మాటలు వారిక ఎన్నడూ పలుకరు. ఇప్పుడు వారీ పాటపాడతారు.
‘ఆపద ముంచుకు వస్తూ ఉంది,
స్వప్న దర్శనాలన్నీ నిజమై తీరుతాయి.’
24 “నిజానికి ఇకమీదట ఇశ్రాయేలులో అసత్య దర్శనాలు ఉండవు. నీజం కాని భవిష్యత్తును చెప్పే తాంత్రికులు మరి ఉండబోరు. 25 ఎందువల్లనంటే, నేనే యెహోవాను. నేను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పి తీరుతాను. అది తప్పక జరిగి తీరుతుంది! నేను కాలయాపన చేయను. ఆ కష్టాలు త్వరలో మీ కాలంలోనే రాబోతున్నాయి. ఓ తిరుగుబాటు ప్రజలారా, నేను ఏదైనా చెప్పితే అది జరిగేలా చేస్తాను.” ఇవీ నా ప్రభువైన యెహోవా చెప్పిన మాటలు.
26 మళ్లీ యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా అన్నాడు: 27 “నరపుత్రుడా, నేను నీకిచ్చిన దర్శనాలు భవిష్యత్తులో ఎప్పుడో జరుగుతాయని ఇశ్రాయేలు ప్రజలు అనుకొంటున్నారు. ఇప్పటి నుంచి చాలా సంపత్సరాల తరువాత జరుగబోయే విషయాలను గురించి నీవు మాట్లాడుతున్నావని వారనుకుంటున్నారు. 28 కావున నీవు వారికి ఈ విషయాలు చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా తెలియజేస్తున్నాడు: నేనిక ఎంతమాత్రం ఆలస్యం చేయను. నేనేదైనా జరుగుతుందని చెప్పితే అది తప్పక జరిగి తీరుతుంది!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.
నీవు న్యాయాధిపతివి కావు
11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
ప్రగల్భాలు చెప్పుకోకండి
13 వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. 14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. 16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు.
© 1997 Bible League International