Revised Common Lectionary (Complementary)
106 యెహోవాను స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి.
దేవుని ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
2 యెహోవా నిజంగా ఎంత గొప్పవాడో ఏ ఒక్కరూ వర్ణించలేరు.
ఏ ఒక్కరూ సరిపడినంతగా దేవుని స్తుతించలేరు.
3 దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారు సంతోషంగా ఉంటారు.
ఆ ప్రజలు ఎల్లప్పుడూ మంచిపనులు చేస్తూంటారు.
4 యెహోవా, నీవు నీ ప్రజల యెడల దయ చూపేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము.
నన్ను కూడా రక్షించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము.
5 యెహోవా, నీ జనులకు నీవు చేసే మంచివాటిలో
నన్ను పాలుపొందనిమ్ము
నీ ప్రజలతో నన్ను సంతోషంగా ఉండనిమ్ము.
నీ జనంతో నన్ను నీ విషయమై అతిశయించనిమ్ము.
6 మా పూర్వీకుల్లా మేము కూడా పాపం చేసాము.
మేము తప్పులు చెడుకార్యాలు చేసాము.
7 యెహోవా, ఈజిప్టులో నీవు చేసిన అద్భుతాలను మా పూర్వీకులు సరిగ్గా అర్థం చేసుకోలేదు.
నీ అపరిమితమైన ప్రేమను వారు జ్ఞాపకముంచుకోలేదు.
ఎర్రసముద్రం వద్ద మహోన్నతుడైన దేవునికి
విరోధంగా ఎదురు తిరిగారు.
8 అయినా ఆయన తన నామము కోసం వారిని రక్షించాడు,
ఎందుకంటే తన మహాశక్తిని వారికి తెలియజేయాలని.
9 దేవుడు ఆజ్ఞ ఇవ్వగా ఎర్రసముద్రం ఎండిపోయింది.
దేవుడు మన పూర్వీకులను లోతైన సముద్రంలో ఎడారివలె ఎండిన నేలను ఏర్పరచి, దానిమీద నడిపించాడు.
10 మా పూర్వీకులను వారి శత్రువుల నుండి దేవుడు రక్షించాడు.
వారి శత్రువుల బారి నుండి దేవుడు వారిని కాపాడాడు.
11 అప్పుడు దేవుడు వారి శత్రువులను సముద్రంలో ముంచి, కప్పివేసాడు.
వారి శత్రువులు ఒక్కడూ తప్పించుకోలేదు!
12 అప్పుడు మన పూర్వీకులు దేవుణ్ణి నమ్మారు.
వారు ఆయనకు స్తుతులు పాడారు.
యెహోవా శాశ్వతమైన సృష్టికర్త
41 యెహోవా చెబుతున్నాడు:
“దూర దేశాల్లారా, మౌనంగా ఉండి నా దగ్గరకు రండి.
దేశాల్లారా, ధైర్యంగా ఉండండి.
నా దగ్గరకు వచ్చి మాట్లాడండి.
మనం కలిసికొందాం.
ఎవరిది సరియైనదో నిర్ణయించేద్దాం.
2 ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి: తూర్పునుండి వస్తోన్న ఆ మనిషిని మేల్కొలిపింది ఎవరు?
మంచితనం నాతో కూడ నడుస్తుంది.
అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు.
వారు ధూళి అవుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు.
వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు.
3 అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనొందడు.
అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్లని స్థలాలకు వెళ్తాడు.
4 ఈ సంగతులు జరిగేట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు?
ఆదినుండి మనుష్యులందరినీ పిలిచింది ఎవరు?
యెహోవాను నేనే ఈ సంగతులను చేశాను.
యెహోవాను నేనే మొట్ట మొదటి వాడ్ని ఆరంభానికి ముందే నేను ఇక్కడ ఉన్నాను.
అన్నీ ముగింపు అయన తర్వాత కూడ నేను ఇక్కడ ఉంటాను.
5 దూర దూర స్థలాలూ, మీరంతా
చూచి భయపడండి.
భూమ్మీద దూరంగా ఉన్న స్థలాలూ,
మీరంతా భయంతో వణకండి.
మీరంతా దగ్గరగా రండి,
నా మాటలు వినండి.
6 “పనివాళ్లూ, ఒకరికి ఒకరు సహాయం చేసుకొంటారు. ఒకరిని ఒకరు బలపర్చుకొంటారు. 7 ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్ర కోస్తాడు. ఆ వ్యక్తి కంసాలికి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తెతో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పని చేసేవాడ్ని ప్రోత్సహిస్తాడు. ‘ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు’ అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు. అది ఎప్పటికీ కదలదు.”
యెహోవా మాత్రమే మనలను రక్షించగలడు
8 యెహోవా చెబుతున్నాడు: “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి
యాకోబూ, నిన్ను నేను ఏర్పరచుకొన్నాను.
నీవు అబ్రాహాము వంశంవాడివి. అబ్రాహామును నేను ప్రేమించాను.
9 భూమిమీద నీవు చాలా దూరంగా ఉన్నావు.
నీవు చాలా దూర దేశంలో ఉన్నావు.
అయితే నేను నిన్ను పిలిచి,
నీవు నా సేవకుడివి.
నేను నిన్ను ఏర్పరచుకొన్నాను.
నేను నీకు విరోధంగా తిరుగలేదు అని చెప్పాను.
10 దిగులుపడకు, నేను నీతో ఉన్నాను.
భయపడకు, నేను నీ దేవుణ్ణి.
నేను నిన్ను బలంగా చేశాను.
నేను నీకు సహాయం చేస్తాను.
నేను మంచితనపు కుడిహస్తంతో నిన్ను బలపరుస్తాను.
11 చూడు, కొంతమంది మనుష్యులు నీ మీద కోపంగా ఉన్నారు.
కానీ వాళ్లు సిగ్గుపడతారు.
నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు.
12 నీ విరోధుల కోసం నీవు వెదకుతావు.
కానీ నీవు వారిని కనుగొనలేవు.
నీకు విరోధంగా యుద్ధం చేసినవాళ్లు
పూర్తిగా కనబడకుండా పోతారు.
13 నేను యెహోవాను,
నీ దేవుణ్ణి నేను నీ కుడిచేయి పట్టుకొన్నాను.
నీవు భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను.
అని నేను నీతో చెబుతున్నాను.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మార్కు 9:33-37; లూకా 9:46-48)
18 ఆ తర్వాత శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “మరి దేవుని రాజ్యంలో అందరి కన్నా గొప్ప వాడెవరు?” అని అడిగారు.
2 యేసు ఒక చిన్న పిల్లవాణ్ణి దగ్గరకు రమ్మని పిలిచి అతణ్ణి వాళ్ళ మధ్య నిలుచోబెట్టి ఈ విధంగా అన్నాడు: 3 “ఇది సత్యం. మీరు మారి, మీ హృదయాల్లో చిన్న పిల్లల్లా ఉండకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. 4 అందువల్ల ఈ చిన్నపిల్లవానిలో ఉన్న వినయాన్ని అలవర్చుకున్నవాడు దేవుని రాజ్యంలో అందరికన్నా గొప్ప వానిగా పరిగణింపబడతాడు.
5 “అంతేకాక ఇలాంటి చిన్నపిల్లల్లో ఒకనికి నా పేరిట స్వాగతమిచ్చిన వాణ్ణి నాకు స్వాగతమిచ్చిన వానిగా నేను పరిగణిస్తాను.
© 1997 Bible League International