Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యోనా 3:10-4:11

10 ప్రజలు చేసిన పనులన్నీ దేవుడు చూశాడు. ప్రజలు చెడుపనులు చేయటం మానినట్లు దేవుడు గమనించాడు. కనుక దేవుడు మనసు మార్చుకొని, తాను చేయ సంకల్పించినది విరమించుకున్నాడు. దేవుడు ప్రజలను శిక్షించలేదు.

దేవుని కరుణ యోనాకు కోపకారణమవటం

దేవుడు నగరాన్ని రక్షించటంపట్ల యోనా సంతోషంగా లేడు. యోనాకు కోపం వచ్చింది. యోనా యెహోవాపట్ల చిరాకుతో ఇలా అన్నాడు: “ఇది జరుగుతుందని నాకు తెలుసు! నేను నా దేశంలో ఉన్నప్పుడు నన్ను ఇక్కడికి రమ్మన్నావు. ఈ దుర్మార్గపు నగరవాసులను నీవు క్షమిస్తావని నాకు అప్పుడే తెలుసు. అందువల్లనే నేను తర్షీషుకు పారిపోవటానికి నిర్ణయించుకున్నాను. నీవు దయగల దేవుడవని నాకు తెలుసు! నీవు కరుణ చూపిస్తావనీ, నీవు ప్రజలను శిక్షింపగోరవనీ నాకు తెలుసు! నీ అంతరంగం కరుణతో నిండివుందనీ నాకు తెలుసు! వీరు పాపం చేయటం మానితే, వీరిని నాశనం చేయాలనే నీ తలంపు మార్చుకుంటావనీ నాకు తెలుసు. కావున యెహోవా, నన్ను చంపివేయమని నేను నిన్ను వేడుకుంటున్నాను. నేను బ్రతకటం కంటే చనిపోవటం మంచిది!”

అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నేను ఆ ప్రజలను నాశనం చెయ్యనంత మాత్రాన నీవు కోపగించుకోవటం నీకు సమంజసమని అనుకుంటున్నావా?”

అయినా యోనా జరిగినదానికంతకు ఇంకా కోపంగానే ఉన్నాడు. కావున అతడు నగరం వెలుపలికి వెళ్లాడు. తూర్పు దిక్కున నగరానికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యోనా వెళ్లాడు. యోనా తన కొరకు ఒక పందిరి నిర్మించుకున్నాడు. నగరానికి ఏమవుతుందో చూద్దామని ఎదురుచూస్తూ అతడు ఆ నీడలో కూర్చున్నాడు.

సొరచెట్టు-పురుగు

యోనా కూర్చునివున్న పందిరి మీదికి ఒక సొరపాదును త్వరత్వరగా పాకేలా యెహోవా చేశాడు. అది యోనా కూర్చోవటానికి చల్లని వాతావరణం కల్పించింది. ఇది యోనాకు హాయిని సమకూర్చటంలో సహాయ పడింది. ఈ సొరపాదు మూలంగా యోనా చాలా సంతోషంగా ఉన్నాడు.

మరునాటి ఉదయం, మొక్కలో ఒక భాగాన్ని తినివేయటానికి ఒక పురుగును దేవుడు పంపాడు. ఆ పురుగు మొక్కను తినివేయటం మొదలుపెట్టగా, ఆ మొక్క చనిపోయింది.

మిట్టమధ్యాహ్నమయ్యే సరికి, దేవుడు తూర్పునుండి వేడిగాడ్పులు వీచేలా చేశాడు. యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు.

కాని దేవుడు యోనాతో, “ఈ మొక్క చనిపోయినంత మాత్రాన నీవు కోపగించుకోవటం సమంజసమేనా?” అని అన్నాడు.

“అవును, నేను కోపగించుకోవటం సమంజసమే! నేను చచ్చిపోవాలనేటంత కోపంతో ఉన్నాను” అని యోనా అన్నాడు.

10 పిమ్మట యెహోవా ఇలా అన్నాడు: “ఆ మొక్కకు నీవు ఏమీ చేయలేదు! నీవు దానిని పెంచలేదు. అది రాత్రికి రాత్రి పెరిగి, మరునాడు చనిపోయింది. ఇప్పుడు నీవు ఆ మొక్కను గురించి విచారిస్తున్నావు. 11 నీవు ఒక మొక్కను గురించే కలత చెందినప్పుడు, నేను నీనెవెలాంటి ఒక మహా నగరంగురించి ఖచ్చితంగా విచారిస్తాను. ఆ నగరంలో ప్రజలు ఉన్నారు. జంతువులు అనేకంగా ఉన్నాయి. తాము తప్పు చేస్తున్నామని తెలియని ఒక లక్షా ఇరవై వేల మందికంటే ఎక్కువమంది ప్రజలు ఆ నగరంలో ఉన్నారు.”

కీర్తనలు. 145:1-8

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.

ఫిలిప్పీయులకు 1:21-30

21 ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. 22 నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. 23 ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. 24 కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. 25 ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. 26 నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను.

27 ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్తవల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. 28 మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. 29 ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. 30 గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు.

మత్తయి 20:1-16

ద్రాక్షతోటలోని పనివాళ్ళు

20 యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.

“అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు.

“అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు.

“‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు.

“అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.

“సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు.

“అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది. 10 మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది. 11-12 వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు.

13 “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? 14 నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను. 15 నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు.

16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International