Revised Common Lectionary (Complementary)
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
133 సహోదరులు ఐక్యంగా శాంతి కలిగి జీవించటం
ఎంతో మంచిది, ఎంతో ఆనందం.
2 అది యాజకుని తలమీద పోయబడిన కమ్మని వాసనగల తైలంలాగా ఉంటుంది. అది అహరోను గడ్డం మీదికి కారుతున్న తైలంలాగా ఉంటుంది.
అది అహరోను ప్రత్యేక వస్త్రాల మీదికి కారుతున్న తైలంలాగ ఉంటుంది.
3 అది హెర్మోను పర్వతం మీద నుండి సీయోను కొండమీద పడుతున్న మంచులా ఉంటుంది.
సీయోను వద్దనే యెహోవా తన ఆశీర్వాదం ఇచ్చాడు. శాశ్వతజీవాన్ని ఆశీర్వాదంగా యెహోవా ఇచ్చాడు.
22 యోసేపు తన తండ్రి కుటుంబంతో సహా ఈజిప్టులోనే జీవించటం కొనసాగించాడు. యోసేపు 110 సంవత్సరాల వయస్సులో చనిపోయాడు. 23 యోసేపు జీవించి ఉన్నప్పుడు, ఎఫ్రాయిముకు పిల్లలు, పిల్లల పిల్లలు పుట్టారు. మరియు అతని కుమారుడు మనష్షేకు మాకీరు అనే పేరుగల ఒక కొడుకు ఉన్నాడు. మాకీరు పిల్లలను చూచేంతవరకు యోసేపు జీవించాడు.
యోసేపు మరణం
24 యోసేపు మరణం దగ్గరపడినప్పుడు, అతడు, “నేను చనిపోవాల్సిన సమయం దాదాపు వచ్చేసింది. అయితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడని నాకు తెలుసు. ఆయన మిమ్మల్ని ఈ దేశంనుండి బయటకు తీసుకొని వెళ్తాడు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు” అని తన సోదరులతో చెప్పాడు.
25 అప్పుడు యోసేపు తన వాళ్లందర్నీ ఒక వాగ్దానం చెయ్యమని అడిగాడు. “దేవుడు మిమ్మల్ని ఆ నూతన దేశానికి నడిపించినప్పుడు, నా యెముకలను మీతో కూడ తీసుకొని వెళ్తామని నాకు వాగ్దానం చేయండి” అన్నాడు యోసేపు.
26 యోసేపు 110 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఈజిప్టులో మరణించాడు. వైద్యులు అతని శరీరాన్ని సమాధి చేసేందుకు సిద్ధంచేసి, ఈజిప్టులో సమాధి పెట్టెలో ఆ శరీరాన్ని ఉంచారు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మత్తయి 21:20-22)
20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది. 25 అంతేకాక, మీరు ప్రార్థించటానికి నిలుచున్నప్పుడు మీకు ఎవరితోనన్న విరోధం ఉంటే అతణ్ణి క్షమించండి. అప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి మీ పాపాలను క్షమిస్తాడు.”
© 1997 Bible League International