Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 50:15-21

సోదరులు యోసేపుకు ఇంకా భయపడుట

15 యాకోబు మరణించిన తర్వాత యోసేపు సోదరులు దిగులుపడిపోయారు. చాలాకాలం క్రిందట వారు చేసినదాన్ని బట్టి యోసేపు ఇంకా వారిమీద కోపంగా ఉంటాడని వారు భయపడ్డారు. మనము చేసినదాని విషయంలో “బహుశాః యోసేపు మనల్ని ఇంకా ద్వేషించవచ్చు. మరియు మనం అతనికి చేసిన కీడంతటికి తిరిగి పగ తీర్చుకోవచ్చు” అని తమలో తాము అనుకొన్నారు. 16 కనుక ఆ సోదరులు యోసేపుకు ఈ సందేశం పంపించారు: “నీ తండ్రి చనిపోక ముందు మాకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 17 ‘యోసేపుకు వారు చేసిన కీడును దయతో క్షమించమని నేను అతణ్ణి బ్రతిమాలుతున్నానని యోసేపుతో చెప్పండి’ అని అతడు చెప్పాడు. కనుక యోసేపూ, మేము చేసిన తప్పు పనిని దయచేసి ఇప్పుడు క్షమించు. మేము నీ తండ్రి దేవుని దాసులం.”

యోసేపు సోదరులు చెప్పిన విషయాలు యోసేపుకు చాలా దుఃఖం కలిగించాయి, అతడు ఏడ్చేశాడు. 18 యోసేపు సోదరులు అతని దగ్గరకు వెళ్లి అతని ఎదుట సాగిలపడ్డారు. వారు “మేము నీకు దాసులం” అని చెప్పారు.

19 అప్పుడు యోసేపు, “భయపడకండి, నేనేం దేవుణ్ణి కాను. మిమ్మల్ని శిక్షించే హక్కు నాకు లేదు. 20 మీరు నాకు ఏదో కీడు చేయాలని తలపెట్టారు. కాని దేవుడు నిజంగా మంచి వాటిని తలపెట్టాడు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడుటకు నన్ను వాడుకోవటం దేవుని ఏర్పాటు. ఈ వేళ ఇంకా అదే ఆయన ఏర్పాటు. 21 కనుక భయపడవద్దు. నేను మీ కోసం, మీ పిల్లలకోసం జాగ్రత్త పుచ్చుకుంటాను” అని చెప్పాడు. యోసేపు తన సోదరులతో దయగా మాట్లాడాడు. ఆ సోదరులకు యిది నెమ్మది కలిగించింది.

కీర్తనలు. 103:1-7

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.

కీర్తనలు. 103:8-13

యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.

రోమీయులకు 14:1-12

విమర్శించకండి

14 సంపూర్ణమైన విశ్వాసం లేనివాణ్ణి నిరాకరించకండి. వాదగ్రస్థమైన సంగతుల్ని విమర్శించకండి. ఒకడు అన్నీ తినవచ్చని విశ్వసిస్తాడు. కాని సంపూర్ణ విశ్వాసం లేని ఇంకొకడు కూరగాయలు మాత్రమే తింటాడు. అన్నీ తినే వ్యక్తి అలా చెయ్యని వ్యక్తిని చిన్న చూపు చూడకూడదు. అదే విధంగా అన్నీ తినని వాడు, తినేవాణ్ణి విమర్శించకూడదు. అతణ్ణి కూడా దేవుడు అంగీకరించాడు కదా. ఇతర్ల సేవకునిపై తీర్పు చెప్పటానికి నీవెవరవు? అతడు నిలిచినా పడిపోయినా అది అతని యజమానికి సంబంధించిన విషయం. ప్రభువు అతణ్ణి నిలబెట్ట గలడు కనుక అతడు నిలబడ గలుగుతున్నాడు.

ఒకడు ఒక రోజు కన్నా మరొక రోజు ముఖ్యమైనదని భావించవచ్చు. ఇంకొకడు అన్ని రోజుల్ని సమానంగా భావించవచ్చు. ప్రతి ఒక్కడూ తాను పూర్తిగా నమ్మిన వాటిని మాత్రమే చెయ్యాలి. ఒక రోజును ప్రత్యేకంగా భావించేవాడు ప్రభువు పట్ల అలా చేస్తాడు. మాంసాన్ని తినేవాడు తినటానికి ముందు దేవునికి కృతజ్ఞతలు చెపుతాడు. కనుక అతనికి ప్రభువు పట్ల విశ్వాసం ఉందన్నమాట. తిననివాడు కూడా ప్రభువుకు కృతజ్ఞతలు చెపుతాడు కనుక అతనికి కూడా ప్రభువు పట్ల విశ్వాసము ఉందన్నమాట.

మనలో ఎవ్వరూ తమకోసం మాత్రమే బ్రతకటం లేదు. అదే విధంగా తమ కోసం మాత్రమే మరణించటం లేదు. మనం జీవిస్తున్నది ప్రభువు కొరకు జీవిస్తున్నాము. మనం మరణించేది ప్రభువు కోసం మరణిస్తున్నాము. అందువల్ల మనం మరణించినా, జీవించినా ప్రభువుకు చెందిన వాళ్ళమన్నమాట. ఈ కారణంగానే మరణించిన వాళ్ళకు, జీవించే వాళ్ళకు ప్రభువుగా ఉండాలని క్రీస్తు చనిపోయి తిరిగి బ్రతికి వచ్చాడు.

10 ఇక ఇదిగో, నీవు నీ సోదరునిపై ఎందుకు తీర్పు చెపుతున్నావు? మరి మీలో కొందరెందుకు మీ సోదరుని పట్ల చిన్నచూపు చూస్తున్నారు? మనమంతా ఒక రోజు దేవుని సింహాసనం ముందు నిలబడతాము. 11 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“ప్రభువు ఈ విధంగా అన్నాడు: నాపై ప్రమాణం చేసి చెపుతున్నాను.
    నా ముందు అందరూ మోకరిల్లుతారు,
    దేవుని ముందు ప్రతి నాలుక ఆయన అధికారాన్ని అంగీకరిస్తుంది.”(A)

12 అందువల్ల మనలో ప్రతి ఒక్కడూ తనను గురించి దేవునికి లెక్క చూపవలసి ఉంటుంది.

మత్తయి 18:21-35

క్షమించని సేవకుని ఉపమానం

21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[a] క్షమించాలని చెబుతున్నాను.

23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు[b] అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. 25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.

26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. 27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.

28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.

29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.

30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. 31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. 33-34 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International