Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 103:1-7

దావీదు కీర్తన.

103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
    నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
    ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
    మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
    ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
    ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
యెహోవా న్యాయం కలవాడు.
    ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
    తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.

కీర్తనలు. 103:8-13

యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
    దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
    యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
    కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
    తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
    దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
    అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.

ఆదికాండము 41:53-42:17

కరువు మొదలవుట

53 ఏడు సంవత్సరాల పాటు ప్రజలు తినేందుకు అవసరమైన ఆహారం అంతా వారికి ఉండినది. కానీ ఆ సంవత్సరాలు ముగిశాయి. 54 తరువాత సరిగ్గా యోసేపు చెప్పినట్లే ఏడు సంవత్సరాల ఆకలి కాలం మొదలయింది. ఆ ప్రాంతల్లోని దేశాలలో ఎక్కడేగాని ఏ ఆహారం పండలేదు. తినుటకు ప్రజలకు ఏమీ లేదు. కానీ యోసేపు ధాన్యం భద్రపరచినందువల్ల ఈజిప్టులో ప్రజలు తినుటకు సమృద్ధిగా ఉంది. 55 కరువు కాలం ప్రారంభం కాగానే ఆహారంకోసం ప్రజలు ఫరోకు మొరపెట్టారు. ఫరో ఈజిప్టు ప్రజలతో, “యోసేపును అడగండి. అతడు ఏమి చేయమంటే అలా చేయండి” అని చెప్పాడు.

56 కనుక ఆ దేశంలో ఎక్కడ చూసినా కరవు ప్రబలుతున్నప్పుడు, ధాన్యము భద్రపరచిన గదులలో నుండి యోసేపు ప్రజలకు ధాన్యం ఇచ్చాడు. చేర్చిపెట్టిన ధాన్యం ఈజిప్టు ప్రజలకు యోసేపు విక్రయించాడు. ఈజిప్టులో కరవు చాలా భయంకరంగా ఉంది. 57 మరియు ప్రాంతాలలోను కరవు తీవ్రంగానే ఉంది. కనుక ఇతర ఈజిప్టు చుట్టుప్రక్కల దేశాల ప్రజలంతా ధాన్యం కొనేందుకు ఈజిప్టులో ఉన్న యోసేపు దగ్గరకు రావలసి వచ్చింది.

కలలు నిజం అగుట

42 ఈ సమయంలో కనాను దేశంలోను కరవు ప్రబలుతోంది. అయితే ఈజిప్టులో ధాన్యం ఉన్నట్లు యాకోబు తెలుసుకొన్నాడు. కనుక యాకోబు తన కుమారులతో ఇలా చెప్పాడు: “ఏమీ చేయకుండా ఇక్కడ ఎందుకు మనం కూర్చోవటం? ఈజిప్టులో అమ్మకానికి ధాన్యం ఉన్నట్లు నేను విన్నాను. అందుచేత మనం అక్కడికి వెళ్లి, మనం తినేందుకు ధాన్యం కొనుక్కోవాలి. అప్పుడు మనం చావకుండా బ్రతుకుతాం.”

కనుక యోసేపు సోదరులు పదిమంది ధాన్యం కొనేందుకు ఈజిప్టుకు వెళ్లారు. బెన్యామీనును యాకోబు పంపలేదు. (బెన్యామీను ఒక్కడే యోసేపుకు స్వంత తమ్ముడు). బెన్యామీనుకు ఏదైనా కీడు సంభవిస్తుందేమోనని యాకోబు భయపడ్డాడు.

కనానులో కరువు కాలం చాలా దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఎంతోమంది ప్రజలు కనానునుండి ఈజిప్టు వెళ్లారు. వారిలో ఇశ్రాయేలు కుమారులు కూడ ఉన్నారు.

ఆ సమయంలో ఈజిప్టు అంతటి మీద యోసేపు పాలకుడు. ఈజిప్టుకు వచ్చిన ప్రజలకు ధాన్యం అమ్మకం చేసేందుకు గాను నియమింపబడిన అధికారి యోసేపు. అయితే యోసేపు సోదరులు అతని దగ్గరకు వచ్చి అతని ఎదుట సాష్టాంగపడ్డారు. యోసేపు తన సోదరులను చూశాడు, వారెవరయిందీ అతనికి తెలుసు, కానీ యోసేపు వారిని ఎరుగనట్టే వారితో మాట్లాడాడు. అతడు వారితో కఠినంగా మాట్లాడాడు. “ఎక్కడనుండి వచ్చారు మీరు?” అని అతడు అడిగాడు.

ఆ సోదరులు “మేము కనాను దేశంనుండి వచ్చాం. ఆహారం కొనేందుకు మేము వచ్చాం” అని జవాబిచ్చారు.

ఈ మనుష్యులు తన సోదరులని యోసేపుకు తెలుసును. కానీ అతను ఎవరయిందీ వారికి తెలియదు. అతని అన్నల విషయంలో అతనికి వచ్చిన కలలను యోసేపు జ్ఞాపకం చేసుకొన్నాడు.

యోసేపు తన అన్నలతో, “మీరు ఆహారం కొనేందుకు రాలేదు. మీరు గూఢచారులు. మా బలహీనతలు తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు.

10 అయితే ఆ సోదరులు, “లేదండి అయ్యా, మీ సేవకులంగా మేము వచ్చాం. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం. 11 మేమంతా అన్నదమ్ములం. మా అందరి తండ్రి ఒక్కడే. మేము నిజాయితీగల మనుష్యులం, మేము గూఢచారలం కాము. ఆహారం కొనేందుకు మాత్రమే మేము వచ్చాం” అని అతనితో చెప్పారు.

12 అప్పుడు యోసేపు, “లేదు, లేదు, ఏ విషయంలో మేము బలహీనులమో తెలుసుకొనేందుకే మీరు వచ్చారు” అన్నాడు వారితో.

13 ఆ సోదరులు అన్నారు: “లేదు, మేమంతా అన్నదమ్ములం. మా కుటుంబంలో మొత్తం పన్నెండుమంది సోదరులం. మా అందరికీ తండ్రి ఒక్కడే. మా అందరిలో చిన్న తమ్ముడు ఇంకా ఇంటి దగ్గర మా తండ్రితోనే ఉన్నాడు. మరో తమ్ముడు చాలకాలం క్రిందటే చనిపోయాడు. మీ ముందర మేము సేవకుల్లాంటి వాళ్లం. మేము కనాను దేశం వాళ్లం.”

14 అయితే యోసేపు వారితో ఇలా అన్నాడు: “లేదు, నేను అన్నదే సరియైనట్లు నాకు తెలుస్తోంది. మీరు గూఢచారులు. 15 అయితే మీరు సత్యమే చెబుతున్నట్లు మిమ్మల్ని రుజువు చేయనిస్తాను. మీ చిన్నతమ్ముడు ఇక్కడికి వచ్చేంతవరకు మిమ్మల్ని వదలిపెట్టనని ఫరో పేరు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 16 కనుక మీలో ఒకరు తిరిగి వెళ్లి మీ చిన్న తమ్ముడిని ఇక్కడికి తీసుకొని రావాలి. అంతవరకు మిగిలినవారు ఇక్కడే చెరసాలలో ఉండాలి. మీరు సత్యం చెబుతున్నారో లేదో మేము చూస్తాం. అయితే మీరు గూఢచారులనే నా నమ్మకం.” 17 తర్వాత యోసేపు వాళ్లందర్నీ మూడు రోజులపాటు చెరసాలలో పెట్టాడు.

అపొస్తలుల కార్యములు 7:9-16

“వీళ్ళకు, తమలో ఒకడైన యోసేపు మీద ఈర్ష్య ఉండేది. అందువల్ల వాళ్ళతణ్ణి ఈజిప్టు దేశానికి బానిసగా అమ్మేసారు. కాని దేవుడతనికి అండగా ఉండి, 10 అతణ్ణి కష్టాలనుండి రక్షించాడు. అతనికి జ్ఞానాన్ని యిచ్చాడు. ఆ జ్ఞానంతో అతడు ఈజిప్టు రాజైన ‘ఫరో’ అభిమానాన్ని సంపాదించాడు. ఫరో అతణ్ణి ఈజిప్టు దేశానికి పాలకునిగా, తన రాజభవనాలకు అధికారిగా నియమించాడు. 11 ఇంతలో ఈజిప్టు, కనాను దేశాల్లో కరువు రాగా ప్రజలు చాలా కష్టాలనుభవించారు. మన పూర్వికులకు తినటానికి తిండి కూడా లేకుండింది.

12 “ఈజిప్టు దేశంలో ధాన్యం ఉందని తెలియగానే యాకోబు మన పూర్వికుల్ని మొదటి సారిగా అక్కడకు పంపాడు. 13 రెండవసారి వచ్చినప్పుడు, యోసేపు తానెవ్వరన్న విషయం తన సోదరులకు చెప్పాడు. యోసేపు కుటుంబాన్ని గురించి ఫరోకు తెలిసిపోయింది. 14 ఆ తర్వాత యోసేపు తన తండ్రి యాకోబును, డెభ్బై ఐదు మందిగల తన కుటుంబాన్ని పిలవనంపాడు. 15 యాకోబు ఈజిప్టు దేశానికి వచ్చాక, అతడు, మన పూర్వికులు అందరూ చనిపోయారు. 16 వాళ్ళ దేహాలు షెకెము పట్టణానికి తేబడ్డాయి. అబ్రాహాము యిదివరలో హమోరు వంశం వాళ్ళకు డబ్బిచ్చి వాళ్ళనుండి ఒక స్మశాన భూమిని కొని ఉంచాడు. వాళ్ళు అక్కడ సమాధి చేయబడ్డారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International