Revised Common Lectionary (Complementary)
తేత్
65 యెహోవా, నీ సేవకుడనైన నాకోసం నీవు మంచి వాటిని జరిగించావు.
నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగా నీవు చేశావు.
66 యెహోవా, నేను జ్ఞానంగల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు.
నేను నీ ఆజ్ఞలను నమ్ముకొంటున్నాను.
67 నేను శ్రమపడక ముందు అనేక తప్పులు చేశాను.
కాని ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతున్నాను.
68 దేవా, నీవు మంచివాడవు, నీవు మంచి వాటినే చేస్తావు.
నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
69 నాకంటే తామే మంచి వాళ్లు అనుకొనే మనుష్యులు నన్ను గూర్చి చెడుగా అబద్ధాలు చెబుతారు.
కాని యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ, అలాగే కొనసాగుతున్నాను.
70 ఆ మనుష్యులు చాల తెలివితక్కువ వాళ్లు.
నీ ఉపదేశాలు ధ్యానించటం నాకు ఆనందం.
71 శ్రమపడటం నాకు మంచిది.
నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకొన్నాను.
72 యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి.
వెయ్యి వెండి, బంగారు నాణెముల కంటే నీ ఉపదేశాలు మంచివి.
విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష
2 “మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న పట్టణాల్లో ఒకదానిలో జరిగిన ఒక చెడు విషయాన్ని గూర్చి మీరు వినవచ్చును. మీలో ఒక పురుషడు లేక ఒక స్త్రీ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినట్టు మీరు వినవచ్చును. వారు యెహోవా ఒడంబడికను తప్పిపోయినట్టు 3 వారు ఇతర దేవుళ్లను పూజించినట్టు మీరు వినవచ్చును. లేదా వాళ్లు సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను పూజించినట్టు మీరు వినవచ్చును. అది యెహోవానైన నేను మీకు ఇచ్చిన ఆజ్ఞకు విరుద్ధం. 4 ఇలాంటి దుర్వార్త మీరు వింటే, మీరు దాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఇశ్రాయేలీయులలో ఈ దారుణ సంఘటన నిజంగా జరిగింది వాస్తవమా అనేది మీరు తెలసుకోవాలి. అది వాస్తవమని మీకు ఋజువైతే 5 ఆ చెడు కార్యం చేసిన మనిషిని మీరు శిక్షించాలి. ఆ పురుషుని లేక స్త్రీని మీరు మీ పట్టణ ద్వారము దగ్గరకు తీసుకొనివెళ్లి రాళ్ళతో కొట్టి వారిని చంపాలి. 6 ఆయితే ఆ వ్యక్తి చెడుకార్యం చేసాడని ఒక్కరు మాత్రమే సాక్ష్యము చెబితే ఆ వ్యక్తికి మరణ శిక్ష విధించకూడదు. ఆయితే అది సత్యం అని ఇద్దరు ముగ్గురు సాక్ష్యం చెబితే, అప్పుడు ఆ వ్యక్తిని చంపివేయాలి. 7 ఆ వ్యక్తిని చంపటానికి మొదట ఆ సాక్షులు, తరువాత ప్రజలంతా ఆ వ్యక్తి మీద చేతులు వేయాలి. ఈ విధంగా మీ మధ్యనుండి ఆ చెడును నిర్మూలించాలి.
కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు
8 “మీ న్యాయస్థానాలు తీర్పు చెప్పలేనంత కష్టతరమైన సమస్యలు కొన్ని ఉండవచ్చును. అది ఒక హత్యానేరం కావచ్చు లేక ఇద్దరి మధ్య వివాదం కావచ్చును. లేక యిద్దరి మధ్య ఘర్షణలో ఒకరికి హాని కలిగిన విషయం కావచ్చు. మీ పట్టణాల్లో ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చినప్పుడు, ఏది నిజం అనే విషయాన్ని మీ న్యాయమూర్తులు నిర్ధారణ చేయలేక పోవచ్చును. అప్పుడు మీ దేవుడైన యెహోవా ఏర్పాటు చేసే ప్రత్యేక స్థలానికి మీరు వెళ్లాలి. 9 లేవీ వంశానికి చెందిన యాజకుల దగ్గరకు, అప్పటికి పదవిలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు మీరు వెళ్లాలి. ఆ సమస్యను గూర్చి ఏమి చేయాలో వారు నిర్ణయిస్తారు. 10 అక్కడ యెహోవా ప్రత్యేక స్థలంలో వారు వారి తీర్మానాన్ని మీకు తెలియజేస్తారు. మీరు చేయాలని వారు మీకు చెప్పే విషయాలన్నీ మీరు జాగ్రత్తగా చేయాలి. 11 మీరు వారి తీర్మానాన్ని అంగీకరించి, వారి హెచ్చరికలను ఖచ్చితంగా పాటించాలి. మీరు చేయాలని వారు చెప్పేదానికి ఏదీ మీరు వ్యతిరేకంగా చేయకూడదు.
12 “ఆ సమయంలో అక్కడ మీ దేవుడైన యెహోవాను సేవిస్తున్న న్యాయమూర్తికి లేక యాజకునికి విధేయులయ్యేందుకు నిరాకరించిన వ్యక్తిని మీరు శిక్షించాలి. ఆ వ్యక్తి చావాల్సిందే. ఇశ్రాయేలులో ఈ చెడుగును మీరు అరికట్టాలి. 13 ఈ శిక్షనుగూర్చి ప్రజలంతా విని భయం తెచ్చుకొంటారు. వారు ఇకమీదట మొండిగా ఉండరు.
అధికారులు
13 ప్రభుత్వాన్ని దేవుడే నియమించాడు కనుక ప్రతి ఒక్కడూ ప్రభుత్వం చెప్పినట్లు చెయ్యాలి. ప్రస్తుతమున్న ప్రభుత్వాన్ని కూడా దేవుడే నియమించాడు. 2 అందువల్ల ప్రభుత్వాన్ని ఎదిరించిన వాడు దేవుని ఆజ్ఞను ఎదిరించిన వానితో సమానము. వాళ్ళు శిక్షననుభవించవలసి వస్తుంది. 3 సక్రమంగా నడుచుకొనేవాళ్ళు పాలకులకు భయపడరు. తప్పు చేసినవాళ్ళకే ఆ భయం ఉంటుంది. ప్రభుత్వానికి భయపడకుండా ఉండాలంటే, సక్రమంగా నడుచుకోండి. అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని మెచ్చుకుంటుంది.
4 మీ మంచి కోసం ప్రభుత్వ అధికారులు దేవుని సేవకులుగా పని చేస్తున్నారు. కాని మీరు తప్పు చేస్తే భయపడవలసిందే! వాళ్ళు ఖడ్గాన్ని వృథాగా ధరించరు. దేవుని సేవకులుగా వాళ్ళు తప్పు చేసినవాళ్ళను శిక్షించటానికి ఉన్నారు. 5 అందువల్ల శిక్షింపబడుతారనే కాకుండా మీ అంతరాత్మల కోసం కూడా అధికారులు చెప్పినట్లు చెయ్యటం అవసరం.
6 అధికారులు దేవుని సేవకులు. వాళ్ళు తమ కాలాన్నంతా దీని కోసమే ఉపయోగిస్తున్నారు. అందువల్లే మీరు పన్నులు చెల్లిస్తున్నారు. 7 ఎవరికేది ఋణపడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు ఋణపడి ఉంటే పన్నుల్ని, సుంకాలు ఋణపడి ఉంటే సుంకాల్ని, మర్యాదను ఋణపడి ఉంటే మర్యాదను, గౌరవాన్ని ఋణపడి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
© 1997 Bible League International