Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
27 సంతాప దినాలు గడిచాక, దావీదు తన మనుష్యులను పంపి ఆమెను తన ఇంటికి తీసుకొని రమ్మన్నాడు. తరువాత ఆమె దావీదుకు భార్య అయింది. దావీదు వల్ల ఆమెకు కుమారుడు జన్మించాడు. దావీదు చేసిన ఈ చెడ్డ పనిని యోహోవ ఆమోదించలేదు.
నాతాను దావీదుతో మాట్లాడటం
12 యెహోవా నాతాను ప్రవక్తను దావీదు వద్దకు పంపాడు. నాతాను దావీదు వద్దకు వచ్చి ఇలా చెప్పాడు: “ఒక నగరంలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకడు ధనవంతుడు. రెండవవాడు దరిద్రుడు. 2 ధనవంతుని వద్ద చాలా గొర్రెలు, పశువులు వున్నాయి. 3 కాని పేదవానివద్ధ తాను కొనుక్కున్న ఒక ఆడ గొర్రెపిల్ల తప్ప మరేమీ లేదు. ఆ గొర్రెపిల్లను పేదవాడు సాకాడు. ఆ పేదవానితో పాటు, అతని పిల్లలతో పాటు ఆ గొర్రెపిల్ల కూడ పెరిగింది. ఆ గొర్రెపిల్ల పేదవాని కంచంలో తిని, వాని గిన్నెలో నీళ్లు తాగింది. ఆ పేదవాని రొమ్ము మీద గొర్రెపిల్ల పడుకొని నిద్రపోయేది. పేదవానికి ఆ గొర్రెపిల్ల ఒక కూతురిలా వుండేది.
4 “ఇదిలా వుండగా ఒక యాత్రికుడు ధనవంతుని చూడటానికి ఆ నగరంలో ఆగాడు. ధనికుడు ఆ యాత్రికునికి ఆహారం ఇవ్వపోయాడు. కాని ఆ యాత్రికునికి ఆహారంగా తనకున్న గొర్రెలలో గాని, పశువులలో గాని దేనినీ చంపటానికి ధనికుడు ఇష్టపడలేదు. దానికి బదులు, ధనికుడు ఆ నగరంలో ఉన్న పేదవాని గొర్రెపిల్లను తీసుకొని, చంపి ఆ యాత్రికునికి ఆహారంగా వండించాడు.”
5 ఇది వింటున్న దావీదుకు ధనికునిపై విపరీతంగా కోపం వచ్చింది. “యెహోవా జీవము తోడుగా ఈ పని చేసిన ఆ వ్యక్తి నిశ్ఛయంగా చావవలసిందే! 6 ఆ గొర్రె పిల్ల విలువకు నాలుగింతలు ధనికుడు చెల్లించాలి. ఎందుకంటే వాడు ఈ భయంకరమైన పని చేశాడు. పైగా వాడు దయలేనివాడు!” అని దావీదు నాతానుతో అన్నాడు.
నాతాను దావీదుతో అతని పాపాన్ని తెలియజెప్పటం
7 “ఆ వ్యక్తివి నీవే అన్నాడు నాతాను దావీదుతో. ఇశ్రాయేలు దేవుడైన యోహోవా నీ విషయంలో ఇలా అంటున్నాడని నాతాను దావీదుతో చెప్పాడు: నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా నేను అభిషిక్తం చేశాను. సౌలునుండి నిన్ను కాపాడాను. 8 అతని కుటుంబాన్ని, భార్యలను నీవు తీసుకొనేలా చేశాను. పైగా ఇశ్రాయేలు పైన, యూదా పైన రాజుగా నియమించాను. ఇవన్నీ చాలవన్నట్లు, నీకు ఇంకా చాలా ఇచ్చాను 9 కావున ఎందువల్ల యెహోవా ఆజ్ఞను తిరస్కరించావు? దేవుడు చెడ్డదని చెప్పిన దానిని ఎందుకు చేశావు? హిత్తీయుడైన ఊరియాను నీవు కత్తితో చంపించావు. అతని భార్యను నీ భార్యగా చేసుకున్నావు. అవును; నీవు ఊరియాను అమ్మోనీయుల కత్తితో చంపావు! 10 కావున, కత్తి నీ కుటుంబాన్ని వదిలిపెట్టదు. హిత్తీయుడు ఊరియా భార్యను నీవు చేపట్టావు. ఈ రకంగా నీవు నన్ను లక్ష్య పెట్టలేదని నిరూపించుకున్నావు.”
11 “నేను నీకు ఆపద తీసుకువస్తున్నాను. నీ కుటుంబంలో నుండే ఈ ఆపద వస్తుంది. నీ భార్యలందరినీ నీ నుండి నేను తీసివేసి, నీకు అతి సన్నిహితుడైన వానికొకనికి ఇస్తాను. ఆ వ్యక్తి నీ భార్యలందరితో కలియగా, అది అందరికీ తెలుస్తుంది.[a] 12 నీవు బత్షెబతో రహస్యంగా కూడినావు. కాని నేను చేసే పని ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుస్తుంది.”[b]
13 నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు.
అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. 14 కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.”
దావీదు బత్షెబల శిశువు మరణించటం
15 పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు.
ఫిలదెల్ఫియలోని సంఘానికి
7 “ఫిలదెల్ఫియలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“పవిత్రమైనవాడు, సత్యవంతుడు, దావీదు తాళంచెవి ఉన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు. ఆయన తెరిచినదాన్ని ఎవ్వరూ మూయలేరు.(A) ఆయన మూసినదాన్ని ఎవ్వరూ తెరువలేరు.
8 “నీ పనులు నాకు తెలుసు. అదిగో చూడు! ఎవ్వరూ మూయలేని ద్వారాన్ని నీ ముందు ఉంచాను. నీ దగ్గర ఎక్కువ బలంలేదని నాకు తెలుసు. అయినా నా పేరును తృణీకరించకుండా అంగీకరించావు. 9 సాతాను మందిరానికి చెందినవాళ్ళను, యూదులు కాకున్నా యూదులమని చెప్పుకొనేవాళ్ళను, అబద్ధాలాడేవాళ్ళను, నీ కాళ్ళ ముందు పడేటట్లు చేస్తాను. నాకు నీ పట్ల ప్రేమ ఉందని వాళ్ళు తెలుసుకొనేటట్లు చేస్తాను. 10 సహనంతో కష్టాలు అనుభవించమని నేను ఆజ్ఞాపించాను. నీవా ఆజ్ఞను పాటించావు. కనుక విచారించే సమయం వచ్చినప్పుడు నిన్ను రక్షిస్తాను. ఈ ప్రపంచంలో నివసిస్తున్నవాళ్ళందరిపై విచారణ జరిగే సమయం రాబోతోంది.
11 “నేను త్వరలోనే రాబోతున్నాను. నీ దగ్గరున్నదాన్ని అంటిపెట్టుకొని ఉండు. అలా చేస్తే నీ కిరీటాన్ని ఎవ్వరూ తీసుకోలేరు. 12 అలా విజయం సాధించిన వాణ్ణి, నేను నా దేవుని మందిరంలో ఒక స్తంభంలా ఉంచుతాను. అతనా స్థానాన్ని ఎన్నటికీ వదిలి వెళ్ళడు. నేను అతనిపై నా దేవుని పేరు వ్రాస్తాను. నా దేవుని నగరమైన క్రొత్త యెరూషలేము పేరు వ్రాస్తాను. ఈ క్రొత్త యెరూషలేము పరలోకంలో ఉన్న నా దేవుని దగ్గరినుండి వస్తోంది. అతని మీద నా క్రొత్త పేరు కూడా వ్రాస్తాను. 13 సంఘాలకు ఆత్మ చెబుతున్న విషయాలను ప్రతివాడు వినాలి.
© 1997 Bible League International