Revised Common Lectionary (Complementary)
దావీదు ప్రార్థన.
17 యెహోవా, న్యాయంకోసం నా ప్రార్థన ఆలకించుము.
నా ప్రార్థనా గీతం వినుము.
యదార్థమైన నా ప్రార్థన వినుము.
2 యెహోవా, నన్ను గూర్చిన సరైన తీర్పు నీ దగ్గర్నుండే వస్తుంది.
నీవు సత్యాన్ని చూడగలవు.
3 నీవు నా హృదయాన్ని పరీక్షించుటుకు
దాన్ని లోతుగా చూశావు.
రాత్రి అంతా నీవు నాతో ఉన్నావు.
నీవు నన్ను ప్రశ్నించావు, నాలో తప్పేమి కనుగొన లేదు. నేనేమి చెడు తలపెట్టలేదు.
4 నీ ఆదేశాలకు విధేయుడనగుటకు
నేను మానవ పరంగా సాధ్యమైనంత కష్టపడి ప్రయత్నించాను.
5 నేను నీ మార్గాలు అనుసరించాను.
నీ జీవిత విధానంనుండి నా పాదాలు, ఎన్నడూ తొలగిపోలేదు.
6 దేవా, నేను నీకు మొరపెట్టినప్పుడెల్ల నీవు నాకు జవాబు యిచ్చావు.
కనుక ఇప్పుడు నా మాట వినుము.
7 ఆశ్చర్యమైన నీ ప్రేమను చూపించుము.
నీ ప్రక్కన కాపుదలను వెదకేవారిని వారి శత్రువులనుండి నీవు రక్షించుము.
నీ అనుచరులలో ఒకనిదైన ఈ ప్రార్థన వినుము.
8 నీ కంటిపాపవలె నన్ను కాపాడుము.
నీ రెక్కల నీడను నన్ను దాచిపెట్టుము.
9 యెహోవా, నన్ను నాశనం చేయాలని చూస్తున్న దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
నన్ను బాధించుటకు నా చుట్టూరా ఉండి ప్రయత్నిస్తున్న మనుష్యుల బారినుండి నన్ను కాపాడుము.
10 ఆ దుర్మార్గులు దేవుని మాట కూడ విననంతటి గర్విష్టులు అయ్యారు
మరియు వారిని గూర్చి వారు డంబాలు చెప్పుకొంటారు.
11 ఆ మనుష్యులు నన్ను తరిమారు.
ఇప్పుడు వాళ్లంతా నా చుట్టూరా ఉన్నారు.
నన్ను నేలకు పడగొట్టవలెనని వారు సిద్ధంగా ఉన్నారు.
12 చంపటానికి సిద్ధంగా ఉన్న సింహాలవలె ఉన్నారు ఆ దుర్మార్గులు.
వారు సింహాలవలె దాగుకొని మీద పడుటకు వేచియున్నారు.
13 యెహోవా, లెమ్ము, శత్రువు దగ్గరకు వెళ్లి వారు లొంగిపోయేటట్టుగా చేయుము.
నీ ఖడ్గాన్ని ప్రయోగించి, ఆ దుర్మార్గులనుండి నన్ను రక్షించుము.
14 యెహోవా, నీ శక్తిని ప్రయోగించి, సజీవుల దేశంలోనుండి ఆ దుర్మార్గులను తొలగించుము.
యెహోవా, నీ యొద్దకు అనేకులు సహాయం కోసం వస్తారు. వాళ్ళకు ఈ జీవితంలో ఏమీ లేదు. ఆ ప్రజలకు ఆహారం సమృద్ధిగా ఇచ్చి, వాళ్ల కడుపులను నింపుము.
ఆందువల్ల వారి పిల్లలు తినుటకు కూడా సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల వాళ్ల మనుమలు కూడా తినడానికి సమృద్ధిగా ఉంటుంది.
15 న్యాయం కోసం నేను ప్రార్థించాను. కనుక యెహోవా, నేను నీ ముఖం చూస్తాను.
మరియు యెహోవా, నేను మేలుకొన్నప్పుడు నిన్ను చూచి పూర్తిగా తృప్తి చెందుతాను.
2 ఆ రోజు సాయంత్రం పడకనుంచి లేచి, రాజు మేడ మీద అటు యిటు తిరుగ సాగాడు. అప్పుడతడు స్నానం చేస్తూ ఉన్న స్త్రీనొక దానిని చూసాడు. ఆమె చాలా అందంగా ఉంది. 3 దావీదు తన సేవకులను పిలువనంపాడు. ఆ స్త్రీ ఎవరని అడుగగా, ఒక సేవకుడు, “ఆమె పేరు బత్షెబ అనీ, ఆమె ఏలీయాము కుమార్తె అనీ చెప్పాడు. ఆమె హిత్తీయుడగు ఊరియాకు భార్య అనికూడ చెప్పాడు.”
4 దావీదు దూతలను పంపి బత్షెబను తన వద్దకు తీసుకొని రమ్మని చెప్పాడు. ఆమె దావీదు వద్దకు వచ్చినప్పుడు, ఆమెతో అతడు సంగమించాడు. ఆమె స్నానాదులు చేసి, శుచియై తన ఇంటికి వెళ్లిపోయింది. 5 కాని “బత్షెబ గర్భవతి” అయింది. ఈ విషయమై దావీదుకు వర్తమానం పంపింది.
దావీదు తన పాపాన్ని దాయజూడటం
6 దావీదు ఒక వర్తమానం యోవాబుకు పంపాడు. “హిత్తీయుడగు ఊరియాను నా వద్దకు పంపు” అని కబురు చేశాడు. అందువల్ల యోవాబు ఊరియాను దావీదు వద్దకు పంపాడు. 7 ఊరియా దావీదు వద్దకు వచ్చాడు. దావీదు అతనిని యోవాబు ఎలా ఉన్నాడనీ, సైనికులెలా వున్నారనీ, యుద్ధం ఎలా కొనసాగుతున్నదనీ అడిగాడు. 8 తరువాత “ఇంటికి పోయి విశ్రాంతి[a] తీసుకోమని” దావీదు ఊరియాకు చెప్పాడు.
ఊరియా రాజు ఇంటిని వదిలి బయటికి వచ్చాడు. రాజు ఊరియాకు ఒక బహుమానం కూడ పంపాడు. 9 కాని ఊరియా ఇంటికి పోలేదు. రాజు ఇంటి ఆవరణ ద్వారం వద్ద ఊరియా నిద్రపోయాడు. మిగిలిన రాజ సేవకుల మాదిరిగా అతను కూడా అక్కడే నిద్ర పోయాడు. 10 “ఊరియా ఇంటికి పోలేదని” సేవకులు దావీదుకు చెప్పారు.
అప్పుడు దావీదు ఊరియాను పిలిచి, “నీవు చాలా దూరంనుండి వచ్చావు గదా! నీవు ఇంటికి ఎందుకు వెళ్లలేదు?” అని అడిగాడు.
11 దావీదుతో ఊరియా ఇలా అన్నాడు: “పవిత్ర పెట్టె, ఇశ్రాయేలు, యూదా సైనికులు అందరూ గుడారాలలో ఉంటున్నారు. నా యజమాని యోవాబు, నా ప్రభువు (దావీదు రాజు) యొక్క సేవకులందరూ బయట పొలాల్లో గుడారాలు వేసుకొనివున్నారు. కావున నేను ఇంటికి వెళ్లి తాగి, భార్యతో విలాసంగా కాలం గడపటం మంచిది కాదు!”
12 “అయితే ఈ రోజు ఇక్కడే ఉండు. రేపు నిన్ను మళ్లీ యుద్ధానికి పంపివేస్తాను” అని దావీదు ఊరియాతో అన్నాడు.
ఊరియా ఆ రోజు యెరూషలేములో ఉన్నాడు. అతడు మరుసటి రోజు తెల్లవారే వరకు వున్నాడు. 13 ఊరియాను తన వద్దకు వచ్చి కన్పించమని దావీదు కబురు పంపాడు. దావీదుతో కలిసి ఊరియా బాగా తాగి, తిన్నాడు. దావీదు ఊరియాకు బాగా తాగ బోశాడు. అయినా ఊరియా ఇంటికి పోలేదు. ఆరోజు సాయంత్రం ఊరియా రాజుగారి సేవకులతో కలిసి రాజభవన ద్వారం వద్ద నిద్రపోవటానికి వెళ్లాడు.
ఊరియాను చంపించేందుకు దావీదు పథకం
14 మరునాటి ఉదయం దావీదు యోవాబుకు ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం ఊరియా ద్వారా పంపాడు. 15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.”
16 యెవాబు నగరాన్ని పరిశీలించి ఎక్కడ అమ్మోనీయులు ధైర్యంగా ఉన్నారో చూశాడు. అతడా ప్రదేశానికి ఊరియాను పంప నిర్ణయించాడు. 17 ఆ నగర (అమ్మోనీయుల రాజధానియగు రబ్బా) ప్రజలు యోవాబును ఎదిరించటానికి బయటికి వచ్చారు. దావీదు మనుష్యులు కొందరు చంపబడ్డారు. చంపబడిన వారిలో హిత్తీయుడైన ఊరియా ఒకడు.
18 యుద్ధ పరిణామాలపై యోవాబు దావీదుకు ఒక నివేదిక పంపాడు. 19 ఆ దూతతో యుద్ధంలో ఏమి జరిగిందో దావీదురాజుకు వివరంగా చెప్పమన్నాడు. 20 “బహుశః రాజు కలత చెందుతాడు. ‘యోవాబు సైన్యం నగర సమీపానికి ఎందుకు వెళ్లింది? వారు గోడల మీదుగా బాణాలు వేసేవారని తెలియదా? 21 ఎరుబ్బెషెతు కుమారుడైన అబీమెలుకును ఎవరు చంపారో మీకు గుర్తుందా? ఆ నగర గోడపై నుండి ఒక స్త్రీ తిరుగలి పై రాయిని విసరివేయగా అబీమెలెకు చనిపోయాడు. ఆ స్త్రీ అతనిని తేబేసువద్ద చంపింది. మీరు ఆ గోడ చెంతకు ఎందుకు వెళ్లారు?’ అని అనవచ్చు. దావీదు రాజు గనుక అలా అంటే, ‘నీ సేవకుడు హిత్తీయుడైన ఊరియా కూడా చనిపోయాడు’ అని నీవు తప్పకుండా లచెప్పాలి” అంటూ యోవాబు దూతను పంపాడు.
22 ఆ వచ్చిన దూత లోనికి వెళ్లి యోవాబు చెప్పమన్నట్లు దావీదుకు వివరించి చెప్పాడు. 23 దూత ఇలా చెప్పాడు: “అమ్మోనీయులు మమ్మల్ని పొలాల్లో ఎదుర్కొన్నారు. కాని మేము వారితో నగర ద్వారం వద్ధ పోరాడాము. 24 మీ సేవకులపై నగర గోడల మీద ఉన్న వారు బాణాలు వేశారు. మీ సేవకులలో కొంతమంది చనిపోయారు. మీ సేవకుడు, హిత్తీయుడైన ఊరియా కూడ చనిపోయాడు.”
25 సరే ఈ విషయంపై కలతపడవద్దని[b] యోవాబుతో చెప్పమని దూతతో దావీదు అన్నాడు. “కత్తికి వారూ, వీరూ అనీ తేడా వుండదు. అది అందరినీ చంపుతుంది. రబ్బా నగరంపై దాడి తీవ్రం చేయండి. ఆ నగరం అప్పుడు వశమవుతుంది” అని చెప్పి యోవాబును ప్రోత్సహించమని దావీదు దూతకు చెప్పాడు.
దావీదు బత్షెబను వివాహమాడటం
26 తన భర్త ఊరియా చనిపోయినట్లు బత్షెబ విన్నది. తన భర్తకై విలపించింది.
సార్దీసులోని సంఘానికి
3 “సార్దీసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“దేవుని ఏడు ఆత్మలను, ఏడు నక్షత్రాలను తన ఆధీనంలో ఉంచుకొన్నవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
“నీవు చేస్తున్న పనులు నాకు తెలుసు. ప్రజలు నీవు బ్రతికి ఉన్నావని అనుకొంటున్నారు. కాని నీవు నిజానికి చనిపోయిన వానితో సమానము. 2 నా దేవుని దృష్టిలో నీవు చేస్తున్న పనులు యింకా పూర్తి కాలేదు. ఇది నేను గమనించాను. కనుక జాగ్రత్త. నీలో ఉన్న శక్తి పూర్తిగా నశించకముందే నీ శక్తిని కాపాడుకో. 3 నీకు లభించినదాన్ని, నీవు విన్నదాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఆచరించు. మారుమనస్సు పొందు. కాని నీవు జాగ్రత్తగా ఉండకపోతే నేను ఒక దొంగలా వస్తాను. నేను ఎప్పుడు వస్తానో నీవు తెలుసుకోలేవు.
4 “మలినంకాని కొందరు వ్యక్తులు అక్కడ సార్దీసులో నీ దగ్గరున్నారు. వాళ్ళు యోగ్యులు కనుక, తెల్లని దుస్తులు ధరించి నాతో సహా నడుస్తారు. 5 విజయం సాధించిన వాళ్ళలా తెల్లని దుస్తులు ధరించండి. అలా చేసినవాని పేరును నేను జీవగ్రంథంనుండి తుడిచివేయను. అతణ్ణి నా తండ్రి ముందు, దేవదూతల ముందు అంగీకరిస్తాను. 6 సంఘాలకు ఆత్మ చెబుతున్నదాన్ని ప్రతివాడు వినాలి.
© 1997 Bible League International