Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 15:15-21

15 యెహోవా, నీవు నన్ను అర్థంచేసుకో.
    నన్ను గుర్తుంచుకొని, నా గురించి శ్రద్ధ తీసుకో.
ప్రజలు నన్ను గాయపర్చుతున్నారు.
    వారికి తగిన శిక్ష విధించుము.
ఆ ప్రజలపట్ల నీవు చాలా ఓపిక పట్టినావు.
    వారి పట్ల ఓపికపడుతూ, నన్ను నాశనం కానీయకు.
నా గురించి ఆలోచించుము.
    యెహోవా, నీ గురించి నేననుభవిస్తున్న నొప్పిని గురించి నీవు జ్ఞాపకం చేసుకో.
16 నీ వర్తమానం నాకు అందినప్పుడు, నీ మాటలు నేను పొందుతున్నాను.
    నీ వాక్కు నన్ను మిక్కిలి సంతోషపర్చింది.
నా సంతోషానికి కారణమేమంటే నీ పేరు మీద నేను పిలువబడ్డాను. నీ పేరు సర్వశక్తిమంతుడు.
17 నేను ప్రజలతో కలసి ఎన్నడూ కూర్చోలేదు.
    కారణమేమనగా వారు నన్ను చూచి నవ్వి, ఎగతాళి చేశారు.
నామీద నీ ప్రభావం పడుటవలన నాకు నేను ఒంటరిగా కూర్చున్నాను.
నాచుట్టూ ఉన్న చెడు వాతావరణంపట్ల నేను కోపగించుకొనేలా చేశావు.
18 నేనింకా ఎందుకు బాధపడుతున్నానో నాకు అర్థం కావటంలేదు.
    నా గాయం ఎందుకు నయంకాలేదో, ఎందుకు తగ్గడంలేదో నాకు అర్థంకావటం లేదు.
యెహోవా, నీవు మారి పోయావేమోనని అనుకుంటున్నాను.
    నీవు ఎండిపోయిన సెలయేటిలా ఉన్నావు.
    నీవు ఇంకిపోయిన నీటిబుగ్గలా ఉన్నావు.
19 అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, నీలో మార్పు వచ్చి తిరిగి నావద్దకు వస్తే
    నిన్ను నేను శిక్షించను.
నీవు మారి నావద్దకు వస్తే
    నీవు నన్ను వెంబడించగలవు.
వ్యర్థ ప్రసంగాలు మాని, నీవు అనుకూలంగా మాట్లాడితే
    నాగురించి నీవు మాట్లాడగలవు.
యూదా ప్రజలు మార్పు చెంది నీవద్దకు తిరిగిరావాలి.
    అంతేగాని నీవు మారి, వారిలా వుండకూడదు.
20 నిన్ను శక్తిమంతునిగా చేస్తాను.
నిన్ను చూచి వారంతా
    కంచుగోడలాంటి వాడని అనుకుంటారు.
యూదావారు నీతో పోట్లాడుతారు.
    కాని వారు నిన్ను ఓడించలేరు.
ఎందువల్లనంటే నేను నీతో వున్నాను.
    నేను నీకు సహాయ పడతాను; నిన్ను రక్షిస్తాను.”

ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
21 “ఆ దుష్టులనుండి నేను నిన్ను రక్షిస్తాను.
    వారు నిన్ను బెదరగొడతారు. కాని వారి బారినుండి నిన్ను నేను రక్షిస్తాను.”

కీర్తనలు. 26:1-8

దావీదు కీర్తన.

26 యెహోవా, నాకు తీర్పు తీర్చుము, నేను పవిత్ర జీవితం జీవించినట్టు రుజువు చేయుము.
    యెహోవాను నమ్మకోవటం నేనెన్నడూ మానలేదు.
యెహోవా, నన్ను పరిశోధించి, నన్ను పరీక్షించి.
    నా హృదయంలోనికి, నా మనసులోనికి నిశితంగా చూడుము.
నేను ఎల్లప్పుడూ నీ ప్రేమను చూస్తాను.
    నీ సత్యాల ప్రకారం నేను జీవిస్తాను.
పనికిమాలిన ఆ మనుష్యుల్లో
    నేను ఒకడ్ని కాను.
ఆ దుర్మార్గపు ముఠాలంటే నాకు అసహ్యం.
    ఆ దుష్టుల ముఠాలలో నేను చేరను.

యెహోవా, నేను నా చేతులు కడుగుకొంటాను.
    నేను నీ బలిపీఠం దగ్గరకు వస్తాను.
యెహోవా, నేను నీకు స్తుతి కీర్తనలు పాడుతాను.
    నీవు చేసిన అద్భుత విషయాలను గూర్చి నేను పాడుతాను.
యెహోవా, నీ గుడారం అంటే నాకు ప్రేమ.
    మహిమగల నీ గుడారాన్ని నేను ప్రేమిస్తున్నాను.

రోమీయులకు 12:9-21

ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.

14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.

17 కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,

“పగ తీర్చుకోవటం నా వంతు.
    నేను ప్రతీకారం తీసుకొంటాను”(A)

అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా,

“మీ శత్రువు ఆకలితో ఉంటే
    అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
    ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”(B)

అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

మత్తయి 16:21-28

యేసు పొందనున్న మరణం

(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)

21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.

22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.

23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.

24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[a] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International