Revised Common Lectionary (Complementary)
ఇశ్రాయేలు అబ్రాహాము వలె ఉండాలి
51 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే. 2 అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”
3 అదే విధంగా సీయోనును[a] యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.
4 “నా ప్రజలారా, నా మాట వినండి!
ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
5 నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను.
నేను నా శక్తిని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను.
దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి.
నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
6 ఆకాశాలవైపు చూడండి.
మీ చుట్టూ క్రింద ఉన్న భూమిని చూడండి.
ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి.
భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది.
భూమి మీద మనుష్యులు మరణిస్తారు.
అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
నా దయ ఎప్పటికీ అంతంకాదు.
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
క్రొత్త జీవితము
12 అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! 2 ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!
3 దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. 4 దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. 5 అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.
6 దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. 7 సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. 8 ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.
యేసే క్రీస్తు
(మార్కు 8:27-30; లూకా 9:18-21)
13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.
14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.
15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.
16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.
17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.
20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.
© 1997 Bible League International