Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
138 దేవా, నా హృదయపూర్తిగా నేను నిన్ను స్తుతిస్తాను.
దేవుళ్లందరి యెదుట నేను నీ కీర్తనలు పాడుతాను.
2 దేవా, నీ పవిత్ర ఆలయం వైపు నేను సాగిలపడతాను.
నీ నామం, నీ నిజప్రేమ, నీ నమ్మకములను బట్టి నేను స్తుతిస్తాను.
నీ నామాన్ని, నీ వాక్యాన్ని అన్నిటికన్నా పైగా హెచ్చించావు.
3 దేవా, సహాయం కోసం నేను నీకు మొరపెట్టాను.
నీవు నాకు జవాబు ఇచ్చావు. నీవు నాకు బలం ఇచ్చావు.
4 యెహోవా, భూరాజులందరూ నిన్ను స్తుతించెదరు గాక!
నీవు చెప్పిన విషయాలను వారు విన్నారు.
5 ఆ రాజులు అందరూ యెహోవా మార్గాన్ని గూర్చి పాడాలి అని నేను ఆశిస్తున్నాను.
యెహోవా మహిమ గొప్పది.
6 దేవుడు గొప్పవాడు.
అయితే దీనులను గూర్చి దేవుడు శ్రద్ధ వహిస్తాడు.
గర్విష్ఠులు చేసే పనులు యెహోవాకు తెలుసు.
కాని ఆయన వారికి సన్నిహితంగా ఉండడు.
7 దేవా, నేను కష్టంలో ఉంటే నన్ను బ్రతికించుము.
నా శత్రువులు నా మీద కోపంగా ఉంటే నన్ను వారినుండి తప్పించుము.
8 యెహోవా, నీవు వాగ్దానం చేసిన వాటిని నాకు ఇమ్ము.
యెహోవా, నీ నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది.
యెహోవా, నీవు మమ్మల్ని చేశావు కనుక మమ్మల్ని విడిచిపెట్టవద్దు.
33 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “నేను మీ పాపాలను కడిగివేసే రోజున ప్రజలను మీ నగరాలకు తీసుకొని వస్తాను. పాడుబడ్డ నగరాలు తిరిగి నిర్మించబడతాయి. 34 బీడు భూములు సాగుచేయబడతాయి. అది దారిన పోయే వారికి కేవలం శిథిలాల గుట్టలా కన్పించదు. 35 ‘గతంలో ఈ దేశం నాశనమయింది. అది ఇప్పుడు ఏదెను ఉద్యానవనంలా రూపు దిద్దుకున్నది. నగరాలు నాశనం చేయబడ్డాయి. అవి పాడుబడి నిర్మానుష్యమైనాయి. కాని ఇప్పుడవి రక్షిత నగరాలైనవి. వాటిలో ప్రజలు ఇప్పుడు నివసిస్తున్నారు అని వారు చెప్పుకుంటారు.’”
36 దేవుడు ఇలా చెప్పాడు: “నీ చుట్టూ ఉన్న దేశాలు నేను యెహోవాననీ, ఆ పాడైపోయిన ప్రాంతాలను పునరుద్ధరించాననీ తెలుసుకుంటాయి. ఖాళీగా ఉన్న ఈ నేలలో నేను మొక్కలు నాటాను. నేనే యెహోవాను. నేనే ఈ విషయాలను చెప్పాను. అవి జరిగేలా చేస్తాను.”
37 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “ఇశ్రాయేలు వంశం వారు ఇలా జరిగేలా చేయమని నన్ను అడిగేలా కూడ చేస్తాను. వారి సంతానాన్ని బహుగా అభివృద్ధి చేస్తాను. వారు గొర్రెల మందల్లా విస్తరిస్తారు. 38 యెరూషలేములో ప్రత్యేక పండుగల సందర్భంగా తేబడే గొర్రెల, మేకల మందల్లా ఆ ప్రజలు విస్తారంగా ఉంటారు. నగరాలు, పాడుబడిన ప్రాంతాలు తిరిగి జనసందోహాలతో కిటకిటలాడుతాయి. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.”
శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం
(మార్కు 8:14-21)
5 శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. 6 యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.
7 ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.
8 వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. 9 మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? 10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? 11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.
12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.
© 1997 Bible League International