Revised Common Lectionary (Complementary)
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
87 యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు.
2 ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం.
3 దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతారు.
4 దేవుడు తన ప్రజలందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబులోనులోను జీవిస్తున్నారు.
ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది.
5 సీయోనుగడ్డ మీద జన్మించిన
ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును.
సర్వోన్నతుడైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు.
6 దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు.
ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు.
7 దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు.
దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు.
“మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు.
నయమాను సమస్య
5 సిరియా రాజు యొక్క సైన్యాధిపతి నయమాను. రాజుకు అతడు అతి ముఖ్యుడు. ఎందుకనగా, యెహోవా అతనిని ఉపయోగించుకొని సిరియా విజయం సాధించేలా చేశాడు. నయమాను మహాశక్తిమంతుడు, గొప్పవాడు. కాని కుష్ఠువ్యాధి వలన అతను బాధ పడుతూ ఉన్నాడు.
2 ఇశ్రాయేలులో యుద్ధం చేయడానికై సిరియను సైన్యం అనేక బృందాల సైనికులను పంపింది. ఇశ్రాయేలీయులను వారి బానిసలుగా గ్రహించారు. ఒక సారి వారు ఇశ్రాయేలునుంచి ఒక అమ్మాయిని తీసుకువచ్చారు. ఆ అమ్మాయి నయమాను భార్యకు సేవకురాలుగా ఉంది. 3 ఆ అమ్మాయి నయమాను భార్యతో ఇలా చెప్పింది: “నా యజమాని (నయమాను) ప్రవక్తయైన ఎలీషాను కలుసుకోవాలని నా కోరిక. ఎలీషా షోమ్రోను నివాసి. ఆ ప్రవక్త నయమాను కుష్ఠువ్యాధిని బాగుచేయగలడు.”
4 నయమాను తన యజమాని (సిరియారాజు) వద్దకు వెళ్లాడు. సిరియా రాజుకు ఆ అమ్మాయి చెప్పిన విషయలు నయమాను తెలిపాడు.
5 అప్పుడు సిరియా రాజు, “అయితే ఇప్పుడే వెళ్లు. నేను ఇశ్రాయేలు రాజుకు ఒక లేఖ పంపుతాను” అన్నాడు.
అందువల్ల నయమాను ఇశ్రాయేలుకు వెళ్లాడు. నయమాను కొన్ని కానుకలు తీసుకు వెళ్లాడు. ఏడువందల పౌనుల వెండి, అరు వేల బంగారం ముక్కలు మరియు పది దుస్తులు నయమాను తీసుకువెళ్ళాడు. 6 సిరియా రాజు ఇశ్రాయేలు రాజుకి ఇచ్చిన లేఖ కూడా తీసుకు వెళ్లాడు. ఆ లేఖలో ఇలా వుంది: “… నేను ఇప్పుడు నా సేవకుడైన నయమానుని నీ వద్దకు పంపుతున్నాను. అతని కుష్ఠువ్యాధిని నివారించుము.”
7 ఇశ్రాయేలు రాజు ఆ ఉత్తరం చదవగానే, తాను తలక్రిందులై నానని విచారంగా ఉన్నానని తెలిపేందుకు తన దుస్తులు చింపివేశాడు. ఇశ్రాయేలు రాజు, “నేను దేవుడినా? కాదు. జీవ మరణాల మీద నాకు శక్తిలేదు. అందువల్ల సిరియా రాజు కుష్ఠువ్యాధితో బాధపడే ఒకనిని స్వస్థపరుచుటకు నా వద్దకు ఎందుకు పంపినట్లు? దానిని గురించి ఆలోచించుము. అది ఒక మాయోపాయమని తెలియుచున్నది. సిరియా రాజు యద్ధానికి సన్నద్ధుడవుతున్నాడు” అని చెప్పాడు.
8 ఇశ్రాయేలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు తెలిసినపుడు ఈ క్రింది సందేశాన్ని రాజు పంపాడు: “నీవు నీ దుస్తులు ఎందుకు చింపివేసుకొన్నావు? నయమానుని నా వద్దకు పంపు. అప్పుడతను ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నట్లు తెలుసుకుంటాడు.”
9 ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. 10 ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు.
11 నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. 12 దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు.
13 కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.”
14 అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది.
యెరూషలేములో సమావేశం
15 కొందరు యూదయనుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు. 2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కానివాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. 4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు. 5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు. 7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటినుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరినుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు. 8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు. 9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు. 10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా? 11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
12 సభలో ఉన్నవాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కానివాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు. 13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి! 14 దేవుడు మొదట్లో యూదులు కానివాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజలుగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు. 15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:
16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునర్నిర్మిస్తాను!
ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు!
నేనెన్నుకొన్న యూదులుకాని ప్రజలు కూడా వెతుకుతారు.’(A)
18 ‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’
19 “దేవుడు యూదులు కానివాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం. 20-21 కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి,
విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని,
లైంగిక పాపము చేయరాదని,
గొంతు నులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్ళకు మనం వ్రాయాలి.”
© 1997 Bible League International