Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 67

సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.

67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
    దయచేసి మమ్ములను స్వీకరించుము.

దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
    నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
    ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
    మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
    మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
    మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
దేవుడు మమ్మల్ని దీవించుగాక.
    భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.

యెషయా 63:15-19

తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన

15 యెహోవా, పరలోకము నుండి చూడుము.
    ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము.
పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి క్రిందనున్న మమ్మల్ని చూడుము.
    మా మీద నీ బలమైన ప్రేమ ఏది?
    నీ అంతరంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి?
    నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు?
16 చూడు, నీవు మా తండ్రివి!
    మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు.
    ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు.
యెహోవా, నీవు మా తండ్రివి.
    మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే.
17 యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు త్రోసివేస్తున్నావు?
    మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు?
యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము.
    మేము నీ సేవకులం.
మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి.
    మా కుటుంబాలు నీకు చెందినవి.
18 నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి.
    మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు.
19 కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు.
    ఆ ప్రజలు నీ నామం ధరించరు.
మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము.

అపొస్తలుల కార్యములు 14:19-28

19 కాని కొందరు యూదులు అంతియొకయ, ఈకొనియ పట్టణాలనుండి వచ్చి ప్రజల్ని తమవైపు మళ్ళించుకొన్నారు. అంతా కలిసి పౌలు మీద రాళ్ళు విసిరారు. అతడు చనిపోయాడనుకొని అతణ్ణి ఊరి బయట పారవేసారు. 20 శిష్యులు అతని చుట్టూ చేరారు. ఆ తదుపరి అతడు లేచి మళ్ళీ పట్టణంలోకి వెళ్ళాడు. మరుసటి రోజు అతడు బర్నబాను కలుసుకొన్నాడు. ఇద్దరూ కలిసి దెర్బే అనే పట్టణానికి ప్రయాణమయ్యారు.

పిసిదియ ప్రాంత సేవను బలపర్చటం

21 ఆ పట్టణంలో సువార్తను ప్రకటించి చాలామందిని శిష్యులుగా చేసుకొన్నారు. లుస్త్ర, ఈకొనియ, అంతియొకయ పట్టణాలకు తిరిగి వచ్చారు. 22 శిష్యుల్ని ఆత్మీయంగా బలపరుస్తూ భక్తి వదలకుండా ఉండమని ఉత్సాహం కలిగే మాటలు చెప్పారు. “దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి మనం ఎన్నో కష్టాలనుభవించాలి” అని వాళ్ళు అన్నారు. 23 పౌలు, బర్నబా కలిసి ప్రతి సంఘానికి కొందరు పెద్దల్ని నియమించారు. ఈ పెద్దలు ఇంతకు క్రితమే ప్రభువును విశ్వసించినవాళ్ళు కనుక పౌలు, బర్నబా ప్రార్థనలు, ఉపవాసాలు చేసి వాళ్ళను ప్రభువుకు అప్పగించారు.

24 ఆ తదుపరి పిసిదియ ప్రాంతాలకు వెళ్ళి అక్కడనుండి పంఫూలియ చేరుకొన్నారు. 25 పెర్గేలో సందేశాన్ని ప్రకటించి అక్కడినుండి అత్తాలియకు వెళ్ళారు. 26 అత్తాలియనుండి అంతియొకయకు తిరిగి ప్రయాణమయ్యారు. ప్రస్తుతం ముగించిన దైవ కార్యాన్ని చేయటానికి దైవానుగ్రహం కలగాలని దీవించి వీళ్ళను దేవునికి అప్పగించింది యిక్కడే.

సిరియా అంతియొకయకు తిరిగి రావటం

27 అంతియొకయకు వచ్చాక సంఘాన్ని పిలిచి దేవుడు తమ ద్వారా చేసినవన్నీ చెప్పారు. యూదులు కానివాళ్ళు కూడా తనను నమ్మేటట్లు దేవుడు ద్వారాలను ఏ విధంగా తెరిచాడో చెప్పారు. 28 వాళ్ళు అక్కడున్న శిష్యులతో చాలా కాలం గడిపారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International