Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: వాయిద్యాలతో స్తుతి కీర్తన.
67 దేవా, మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము.
దయచేసి మమ్ములను స్వీకరించుము.
2 దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము.
నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము.
3 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక!
4 దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక!
ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు
మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు.
5 దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక!
మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక!
6 దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము.
మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము.
7 దేవుడు మమ్మల్ని దీవించుగాక.
భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక.
యెహోవా తానొక్కడే దేవుడని ఋజువు చేస్తాడు
20 “ప్రజలారా మీరు ఇతర దేశాలనుండి తప్పించుకొని పోయారు. కనుక మీరు సమావేశమై నా ఎదుటికిరండి. (ఈ మనుష్యులు తప్పుడు దేవుళ్ల విగ్రహాలను మోసుకొని వెళ్తారు. ఈ ప్రజలు పనికిమాలిన ఆ దేవుళ్లకు ప్రార్థన చేస్తారు. కానీ వాళ్లు చేస్తోంది ఏమిటో ప్రజలకు తెలియదు. 21 ఈ ప్రజలను నా దగ్గరకు రమ్మని వారికి చెప్పండి. వారు వచ్చి ఈ సంగతులను నాతో మాట్లాడమని చెప్పండి.)
“చాలా కాలం క్రిందట జరిగిన వాటిని గూర్చి మీకు ఎవరు చెప్పారు? చాలాకాలం నుండి ఈ సంగతులను విడువక మీకు ఎవరు చెప్పారు? యెహోవాను నేనే, ఈ సంగతులు మీకు చెప్పాను. నేను ఒక్కడను మాత్రమే దేవుడను. నావంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడా? ఇంకో మంచి దేవుడు ఉన్నాడా? తన ప్రజలను రక్షించే ఇంకో దేవుడూ ఉన్నాడా? లేడు మరి ఏ దేవుడు లేడు. 22 దూర దేశాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా ఆ తప్పుడు దేవుళ్లను వెంబడించటం మానివేయాలి. మీరు నన్ను వెంబడించి, రక్షణ పొందాలి. నేను దేవుణ్ణి. వేరొక దేవుడు ఎవ్వడూ లేడు. నేను ఒక్కణ్ణి మాత్రమే దేవుడను.
23 “నేను నా స్వంత శక్తితో ఒక వాగ్దానం చేస్తాను. నేను ఏదైన ఒకటి చేస్తానని వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక ఆదేశం అవుతుంది. ఏదైనా జరగాలని నేను ఆదేశిస్తే, అది జరుగుతుంది. ప్రతి మనిషి నా (దేవుడు) ఎదుట సాగిలపడతాడని నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తున్నాను. ప్రతి మనిషి నన్ను వెంబడిస్తాడని ప్రమాణం చేస్తాడు. 24 ‘మంచితనం, అధికారం యెహోవా నుండి మాత్రమే లభిస్తాయి’” అని ప్రజలు చెబుతారు.
కొంత మంది మనుష్యులు యెహోవా మీద కోపగిస్తారు. అయితే యెహోవా జనులు వచ్చి, యెహోవా చేసిన వాటిని గూర్చి సాక్ష్యం చెబుతారు. అందుచేత కోపగించిన ఆ మనుష్యులు సిగ్గుపడతారు. 25 ఇశ్రాయేలు ప్రజలు మంచిని జరిగించటానికి యెహోవా సహాయం చేస్తాడు, మరియు ప్రజలు వారి దేవుని గూర్చి ఎంతో గర్విస్తారు.
ఏడు తెగుళ్ళతో ఏడుగురు దూతలు
15 నేను పరలోకంలో యింకొక అద్భుతమైన దృశ్యం చూశాను. ఏడుగురు దూతలు ఏడు చివరి తెగుళ్ళు పట్టుకొని ఉండటం చూశాను. వీటితో దేవుని కోపం సమాప్తమౌతుంది. కనుక యివి చివరివి.
2 నిప్పుతో కలిసిన గాజు సముద్రం లాంటి ఒక సముద్రం నాకు కనిపించింది. మృగాన్ని, దాని విగ్రహాన్ని జయించినవాళ్ళు, దాని నామానికున్న సంఖ్యను జయించినవాళ్ళు సముద్రతీరం మీద నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు తమ చేతుల్లో దేవుడుంచిన వీణల్ని పట్టుకొని ఉన్నారు. 3 దేవుని సేవకుడైన మోషే గీతాన్ని, గొఱ్ఱెపిల్ల గీతాన్ని వాళ్ళు ఈ విధంగా పాడుతూ ఉన్నారు:
“ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన దైవమా!
నీ కార్యాలు గొప్పవి. అద్భుతమైనవి.
యుగయుగాలకు రాజువు నీవు.
నీ మార్గాలు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.
4 ఓ ప్రభూ! నీకెవరు భయపడరు?
నీ నామాన్ని స్తుతించనివారెవరున్నారు?
నీ వొక్కడివే పరిశుద్ధుడవు.
నీ నీతికార్యాలు ప్రత్యక్షమైనవి.
కనుక ప్రజలందరూ వచ్చి నిన్ను ఆరాధిస్తారు.”
© 1997 Bible League International