Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 రాజులు 19:9-18

అక్కడ ఏలీయా ఒక గుహలోకి వెళ్లి ఆ రాత్రి తలదాచుకున్నాడు.

అక్కడ యెహోవా ఏలీయాతో మాట్లాడి, “ఏలీయా! నీవిక్కడెందుకున్నావు!” అని అడిగాడు.

10 ఏలీయా ఇలా సమాధానం చెప్పాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా, నేను నిన్ను సదా సేవిస్తూ వచ్చాను. నా శక్తికొలదీ నేను నిన్ను ఆరాధించాను. కాని ఇశ్రాయేలు ప్రజలు నీతో చేసుకున్న ఒడంబడికను భంగపర్చారు. నీ బలిపీఠాలను వారు నాశనం చేశారు. వారు నీ ప్రవక్తలను చంపేశారు. నేనొక్కడినే ప్రవక్తగా ఇంకా జీవించి వున్నాను. ఇప్పుడు వారు నన్నూ చంప జూస్తున్నారు!”

11 అందుకు యెహోవా ఏలీయాతో: “నీవు వెళ్లి పర్వతం మీద నా ముందు నిలబడు. నేను నీ పక్కగా వెళతాను” అని అన్నాడు. యెహోవా అలా చేయగా, ఒక పెనుగాలి వీచింది. ఆ గాలి కొండలను రెండుగా చీల్చివేసింది. యెహోవా ముందు ఆ గాలి పెద్దగుట్టలను పిండి చేసింది. కాని ఆ పెనుగాలి యెహోవా మాత్రం కాదు! గాలి తగ్గిన పిమ్మట ఒక భూకంపం వచ్చింది. ఆ భూకంపం కూడా యెహోవా కాదు. 12 ఆ భూకంపం పోయిన పిమ్మట అగ్ని పుట్టింది. ఆ అగ్నికూడా యెహోవా కాదు. అగ్ని తరువాత ప్రశాంతత నెలకొనగా, ఒక మృదువైన శబ్దం వినవచ్చింది.

13 ఏలీయా ఆ శబ్దాన్ని విన్నప్పుడు తన అంగీతో తన ముఖం కప్పుకున్నాడు. అతను గుహ ద్వారం వద్దకు వెళ్లి నిలబడ్డాడు. ఇంతలో “ఏలీయా, ఇక్కడెందుకున్నావు?” అంటున్న ఒక కంఠ స్వరం విన్నాడు.

14 ఏలీయా ఇలా అన్నాడు: “సర్వశక్తిమంతుడవైన యెహోవా దేవా, శక్తి వంచన లేకుండా నేను నిన్ను సదా సేవిస్తూవచ్చాను. కాని ఇశ్రాయేలు ప్రజలు వారు నీతో చేసుకున్న ఒప్పందానికి విఘాతం కలుగజేశారు. నీకై నిర్మించిన బలిపీఠాలను నాశనం చేశారు. నీ ప్రవక్తలను చంపేశారు. జీవించియున్న ప్రవక్తలు మరెవ్వరూ లేరు నేను మినహా. వారిప్పుడు నన్ను చంపజూస్తున్నారు.”

15 యెహోవా ఇలా అన్నాడు: “నీవు వచ్చిన దారిలోనే తిరిగి దమస్కు ఎడారికి వెళ్లు. నగరంలో ప్రవేశించి హజాయేలును అరాము దేశానికి (సిరియా) రాజుగా అభిషేకించు. 16 పిమ్మట నింషీ కుమారుడైన యెహూను ఇశ్రాయేలుపై రాజుగా అభిషిక్తుని చేయి. తరువాత, ఆబేల్మె హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు నీ తర్వాత ప్రవక్తగా అభిషేకంచేయి. 17 హజాయేలు ఖడ్గమునుండి తప్పించుకున్న ప్రతివాడినీ యెహూ సంహరిస్తాడు. యెహూ కత్తి పోటునుంచి తప్పించుకున్న ప్రతివాడినీ హజాయేలు చంపేస్తాడు. 18 ఇశ్రాయేలులో ఏడువేల మందిని నేను వదిలి పెడతాను. ఈ ఏడువేల మంది బయలు ముందు ఎన్నడూవంగి నమస్కరించ లేదు. బయలు విగ్రహాల నెన్నడూ వారు ముద్దు పెట్టుకోలేదు.”

కీర్తనలు. 85:8-13

దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
    తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
    ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
    మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
    మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
    పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
    భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
    ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.

రోమీయులకు 10:5-15

ధర్మశాస్త్రం ద్వారా లభించే నీతిని గురించి మోషే ఈ విధంగా వ్రాస్తున్నాడు: “ధర్మశాస్త్ర క్రియలు చేసే మానవుడు వీటి ద్వారా జీవిస్తాడు”(A) కాని విశ్వాసం వల్ల కలిగే నీతిని గురించి ఈ విధంగా వ్రాశారు: “పరలోకానికి ఎవరు ఎక్కుతారు?” అని అనకండి. అంటే ఎవరు పరలోకానికి ఎక్కి క్రీస్తును క్రిందికి పిలుచుకు రాగలరు? “అగాధంలోకి ఎవరు దిగుతారు?”(B) అని అనకండి. అంటే ఎవరు అగాధంలోకి దిగి క్రీస్తును చావునుండి పిలుచుకు రాగలరు?

మరి వాక్యమేమంటున్నది! “దైవసందేశం మీకు దగ్గరగా ఉంది. అది మీ నోటిలో ఉంది, మీ హృదయాల్లో ఉంది.”(C) ఇది విశ్వాసానికి సంబంధించిన సందేశము. దీన్ని మేము ప్రకటిస్తున్నాము. యేసు, ప్రభువని మీ నోటితో బహిరంగంగా ఒప్పుకొని చనిపోయినవారిలో నుండి దేవుడాయన్ని బ్రతికించాడని మీ హృదయాల్లో విశ్వసిస్తే మీరు రక్షింపబడుతారు. 10 ఎందుకంటే మనము, మన హృదయాలతో విశ్వసిస్తాము కనుక నీతిమంతులుగా పరిగణింపబడుతాము. నోటితో ఒప్పుకొంటాము కనుక రక్షణను పొందుతాము.

11 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: “ఆయన్ని నమ్మినవానికి ఆశాభంగం కలుగదు.”(D) 12 యూదులకు, యూదులు కానివాళ్ళకు వ్యత్యాసం లేదు. ప్రభువు ఒక్కడే. ఆయనే అందరికి ప్రభువు. ఆయన, తనను ప్రార్థించిన వాళ్ళందరికీ అడిగినంత ఇస్తాడు. 13 దీన్ని గురించి, “ప్రభువును ప్రార్థించిన ప్రతి ఒక్కడూ రక్షింపబడతాడు”(E) అని వ్రాయబడి ఉంది.

14 మరి, విశ్వసించకుండా ఎలా ప్రార్థించగలరు? ఆయన్ని గురించి వినకుండా వాళ్ళు ఆయన్ని ఏ విధంగా విశ్వసించగలరు? వాళ్ళకు ఎవరో ఒకరు చెప్పకుంటే వాళ్ళు ఏ విధంగా వినగలరు? 15 ఎవరైనా పంపందే వాళ్ళు వచ్చి ఎలా చెపుతారు? దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “సువార్తను తెచ్చేవాళ్ళ పాదాలు ఎంత అందంగా ఉన్నాయి!”(F)

మత్తయి 14:22-33

యేసు నీళ్ళపై నడవటం

(మార్కు 6:45-52; యోహాను 6:16-21)

22 ఆ తర్వాత యేసు తన శిష్యులతో పడవనెక్కి తనకన్నా ముందు అవతలి ఒడ్డుకు వెళ్ళమని చెప్పాడు. తానక్కడే ఉండి ప్రజల్ని ఇళ్ళకు పంపాలని ఆయన ఉద్దేశం. 23 ప్రజల్ని పంపేశాక యేసు ఏకాంతంగా ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. సాయంకాలం అయింది. అయినా ఆయనొక్కడే అక్కడ ఉండిపోయాడు. 24 పడవ ఒడ్డుకు చాలా దూరంలో ఉంది. ఎదురు గాలి వీయటం వల్ల అలలు ఆ పడవను కొడ్తూ ఉన్నాయి.

25 రాత్రి నాలుగోఝామున యేసు నీళ్ళ మీద నడుస్తూ శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. 26 ఆయన నీళ్ళపై నడవటం చూసి శిష్యులు, “దయ్యం” అంటూ భయంతో పెద్దకేక పెట్టారు.

27 యేసు వెంటనే, “నేనే! ధైర్యంగా ఉండండి! భయపడకండి!” అని అన్నాడు.

28 పేతురు, “ప్రభూ మీరైతే, నీళ్ళ మీద నడుస్తూ నన్ను మీదగ్గరకు రానివ్వండి!” అని అన్నాడు.

29 “రా” అని యేసు అన్నాడు.

అప్పుడు పేతురు పడవ దిగి నీళ్ళ మీద నడుస్తూ యేసు దగ్గరకు వెళ్ళాడు. 30 కాని గాలి వీయటం గమనించి భయపడి నీళ్ళలో మునుగుతూ, “ప్రభూ, నన్ను రక్షించండి!” అని కేక వేశాడు.

31 యేసు వెంటనే తన చేయి జాపి అతణ్ణి పట్టుకొని, “నీలో దృఢవిశ్వాసం లేదు! ఎందుకు సందేహించావు?” అని ప్రశ్నించాడు.

32 వాళ్ళిద్దరూ పడవనెక్కాక గాలి తీవ్రత తగ్గిపోయింది. 33 పడవలోవున్న వాళ్ళు యేసుకు మ్రొక్కుతూ, “మీరు నిజంగా దేవుని కుమారుడు!” అని అన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International