Revised Common Lectionary (Complementary)
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
17 ఏలీయాను అహాబు చూచి, “నీవేనా? ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించే వాడివి నీవే కదా!” అని అన్నాడు.
18 ఏలీయా ఇలా అన్నాడు, “నేను ఇశ్రాయేలులో కల్లోలం సృష్టించటం లేదు. కష్టాలన్నీ నీ మూలంగా, నీ తండ్రి కుటుంబం వారివల్ల వచ్చినవే. యెహోవా ఆజ్ఞలను తిరస్కరిస్తూ, బూటకపు దేవుళ్లను పూజిస్తూ, నీవే ఈ కష్టాలన్నిటికీ కారకుడవయ్యావు. 19 ఇశ్రాయేలీయులందరినీ ఇప్పుడు కర్మెలు పర్వతం వద్ద నన్ను కలవమని సమాచారం పంపు. పైగా నాలుగు వందల ఏభై మంది బయలు దేవత ప్రవక్తలను, నాలుగు వందల మంది బూటకపు దేవత అషేరా ప్రవక్తలను అక్కడికి తీసుకొనిరా. రాణీ యెజెబెలు ఈ ప్రవక్తలందరినీ పోషిస్తూ[a] వున్నది.”
30 అప్పుడు ఏలీయా ప్రజలతో, “నా వద్దకు రండి” అని అన్నాడు. వారంతా ఏలీయా చుట్టూ చేరారు. బేతేలులో ఉన్న యెహోవా యొక్క బలిపీఠం నాశనం చేయబడింది. ఏలీయా దానిని మళ్లీ నిర్మించాడు. 31 ఏలీయా పన్నెండు రాళ్లను తీసుకున్నాడు. ఒక్కొక్క గోత్రానికి ఒక్కోక్క రాయి చొప్పున ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలకు పన్నెండు రాళ్లను తీశాడు. యాకోబు పన్నెండు మంది కుమారుల పేర్లతో ఈ గోత్రాలు పిలవబడుతూ వున్నాయి. యాకోబునే యెహోవా ఇశ్రాయేలని పిలిచాడు. 32 ఏలీయా ఈ రాళ్లను యెహోవా గౌరవార్థం బలిపీఠాన్ని నిర్మించటానికి ఉపయోగించాడు. పీఠం చుట్టూ ఏలీయా చిన్న కందకం తవ్వించాడు. అది రెండు షియాల[a] విత్తనాలు నీటితో సహా పట్టేటంత వెడల్పు, లోతుకలిగివుంది. 33 అప్పుడు ఏలీయా కట్టెనంతా బలిపీఠంపై వుంచాడు. అతడు ఆబోతును ముక్కలుగా నరికి, వాటిని పేర్చిన కట్టెలపై వుంచాడు. 34 తరువాత ఏలీయా ప్రజలను నాలుగు జాడీలతో నీరు తీసుకుని మాంసం మీద, కట్టెల మీద చల్లమన్నాడు. వారిని అదే విధంగా మళ్లీ చేయమన్నాడు. ఆయన వారితో మూడవ సారి కూడా అలానే చేయమన్నాడు. 35 ఆ నీరు బలిపీఠం నుండి జారి చుట్టూవున్న కందకాన్ని నింపేసింది.
36 సాయంకాలపు బలులు ఇచ్చే వేళ అయ్యింది. ప్రవక్తయగు ఏలీయా పీఠం వద్దకు వెళ్లి ఇలా ప్రార్థించాడు: “ఓ ప్రభువా! అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవా! ఇశ్రాయేలీయుల దైవం నీవేనని నిరూపించమని నేనిప్పుడు నిన్నడుగుతున్నాను. నేను నీ సేవకుడనని నిరూపించు. ఈ పనులన్నీ చేయమని నన్ను నీవే ఆదేశించినట్లు కూడ ఈ ప్రజలకు తెలియజేయి. 37 ఓ ప్రభువా, నా ప్రార్థన ఆలకించు. ప్రభూ! నీవే దేవుడవని ఈ ప్రజలకు నిరూపించు. అప్పుడు ఈ ప్రజలందరినీ మరల నీవు నీ దగ్గరకు చేర్చుకుంటున్నావని వీరు తెలుసుకుంటారు.”
38 అప్పుడు యెహోవా అగ్ని పంపించాడు. బలిమాంసాన్ని, కట్టెలను, రాళ్లను, బలిపీఠం చుట్టూవున్న ప్రదేశాన్ని అగ్ని దహించి వేసింది. కందకంలో వున్న నీరు కూడ అగ్నివల్ల ఇగిరి పోయింది. 39 ప్రజలంతా ఇది చూశారు. వారు భూమి మీద సాగిలపడి. “యెహోవాయే దేవుడు! యెహోవాయే దేవుడు! అని స్తుతించసాగారు.”
40 అప్పుడు ఏలీయా, “బయలు దేవత ప్రవక్తలందరినీ పట్టుకొనండి. ఒక్కడినీ పారి పోనీయవద్దు!” అని అన్నాడు. ప్రవక్తలందరినీ ప్రజలు పట్టుకున్నారు. ఏలీయా వారందరినీ కీషోను వాగు దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆ ప్రవక్తలందరినీ చెంపేశాడు.
ఎఫెసులో అపొల్లో
24 ఇది యిలా ఉండగా అపొల్లో అనే యూదుడు ఎఫెసు పట్టణానికి వెళ్ళాడు. అపొల్లో స్వగ్రామం అలెక్సంద్రియ. ఇతడు గొప్ప పండితుడు. యూదుల శాస్త్రాల్లో ఆరితేరినవాడు. 25 ప్రభువు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినవాడు. యేసును గురించి సక్రమంగా గొప్ప ఉత్సాహంతో బోధించాడు. కాని బాప్తిస్మము విషయంలో అతనికి యోహాను బోధించిన విషయాలు మాత్రమే తెలుసు. 26 అతడు యూదుల సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రిస్కిల్ల, అకుల యితని బోధ విని అతణ్ణి తమ యింటికి పిలిచి దైవ మార్గాన్ని గురించి అతనికి యింకా విశదంగా చెప్పారు.
27 అపొల్లో అకయ ప్రాంతానికి వెళ్ళాలనుకొన్నాడు. సోదరులు అతని ఉద్దేశాన్ని బలపరిచారు. అకయ ప్రాంతాల్లో ఉన్న శిష్యులకు ఉత్తరం వ్రాసి యితనికి స్వాగతం చెప్పమని అడిగారు. అతడు వెళ్ళి, దైవానుగ్రహంవల్ల యేసును విశ్వసించినవాళ్ళకు చాలా సహాయం చేసాడు. 28 ప్రజలందరి ముందు యూదులతో తీవ్రమైన వాద వివాదాలు చేసి, వాళ్ళను ఓడించి శాస్త్రాల ద్వారా యేసు ప్రభువే క్రీస్తు అని రుజువు చేసాడు.
© 1997 Bible League International