Revised Common Lectionary (Complementary)
8 దేవుడు చెప్పేది నేను వింటున్నాను.
తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబుతున్నాడు.
ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది.
9 దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు.
మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బ్రతుకుతాము.
10 దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది.
మంచితనం, శాంతి ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి.
11 భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా ఉంటారు.
పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు.
12 యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు.
భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది.
13 మంచితనం దేవునికి ముందర నడుస్తూ
ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది.
ఏలీయా మరియు బయలు ప్రవక్తలు
18 వర్షాలు లేకుండా పోయి మూడు సంవత్సరాలయ్యింది. అప్పుడు యెహోవా ఏలీయాతో, “నీవు వెళ్లి రాజైన అహాబును కలుసుకో. నేను త్వరలో వర్షం కురిసేలా చేస్తాను” అని చెప్పాడు. 2 కావున ఏలీయా అహాబును కలిసేటందుకు వెళ్లాడు.
అప్పుడు షోమ్రోనులో క్షామం నెలకొన్నది. 3 రాజైన అహాబు ఓబద్యాను పిలిపించాడు. ఓబద్యా రాజభవన నిర్వాహకుడుగా పని చేస్తున్నాడు. (ఓబద్యా యెహోవాకు నిజమైన అనుచరుడు.) 4 ఒకసారి యెజెబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపటం మొదలు పెట్టింది. అప్పుడు ఓబద్యా నూరుమంది ప్రవక్తలను చేరదీసి, వారిని రెండు గుహలలో దాచాడు. ఓబద్యా ఏబది మందిని ఒక గుహలోను, మరో ఏబది మందిని ఒక గుహలోను దాచాడు. ఓబద్యా వారికి ఆహార పానీయాలు ఇచ్చి కాపాడాడు. 5 రాజైన అహాబు ఓబద్యాతో ఇలా అన్నాడు: “నాతో కలిసిరా. మనిద్దరం దేశంలో వున్న నీటి వనరులన్నీ పరిశీలిద్దాము. మన గుర్రాలు, కంచర గాడిదలు బతకటానికి తగిన పచ్చగడ్డి దొరుకుతుందేమో చూద్దాం. అప్పుడు మన పశువులను చంపే అవసరము వుండదు.” 6 నీటి వనరులు వెదకటానికి ఎవరేదిశకు వెళ్లాలో వారు నిర్ణయించుకున్నారు. వారిద్దరూ దేశమంతా తిరగనారంభించారు. అహాబు ఒక దిశలో వెళ్లాడు. ఓబద్యా మరోదిశలో వెళ్లాడు. 7 ఓబద్యా ప్రయాణం చేస్తూండగా అతడు ఏలీయాను కలిశాడు. ఏలీయాను చూడగానే, అతనెవరో ఓబద్యా తెలుసుకున్నాడు. ఓబద్యా ఏలీయాకు సాష్టాంగ నమస్కారం చేసి, “నీవు నా యజమానివైన ఏలీయావే గదా?” అని అడిగాడు.
8 “అవును నేనే. నీవు వెళ్లి నేనిక్కడ వున్నానని నీ యజమానియగు రాజుకు తెలియజేయి” అని ఏలీయా సమాధానం చెప్పాడు.
9 అందుకు ఓబద్యా ఇలా అన్నాడు: “నేను అహాబుతో నీవెక్కడ వున్నదీ నాకు తెలుసునని చెప్పితే అతడు నన్ను చంపుతాడు! నీ పట్ల నేనేమీ అపచారం చేయలేదు! నేను చనిపోవాలని నీవెందుకు కోరు కుంటున్నావు? 10 నీ దేవుడైన యెహోవా సాక్షిగా చెబుతున్నాను. రాజు నీ కొరకై ప్రతి చోటా చూస్తూన్నాడు! నిన్ను వెదకమని తన మనుష్యులను అన్ని దేశాలకు పంపాడు. ఏ పాలకుడైనా తన దేశంలో నీవు లేవని చెపితే అహాబు అంతటితో ఆగక నీవతని రాజ్యంలో లేవని ప్రమాణం చేయమని బలవంతపెట్టు తున్నాడు. 11 ఈ పరిస్థితుల్లో నేను వెళ్లి నీవిక్కడ వున్నావని చెప్పమంటున్నావా? 12 ఒకవేళ నేను పోయి రాజైన అహాబుతో నీవిక్కడ వున్నావని చెపితే, ఈ లోపు యెహోవా నిన్ను ఇక్కడ నుంచి మరో చోటికి తీసుకుని పోవచ్చు. రాజైన అహాబు వచ్చి నీవిక్కడ లేకపోవటం చూచి, నన్ను చంపేస్తాడు! నేను నా బాల్యం నుండి యెహోవాను ఆశ్రయించియున్నాను. 13 నేను ఏమి చేశానో నీవు వినే వుంటావు! యెజెబెలు యెహోవా యొక్క ప్రవక్తలందరినీ చంపుతూండగా, నేను వంద మంది ప్రవక్తలను గుహలలో దాచాను. ఏభై మంది ప్రవక్తలను ఒక గుహలోను, మరో ఏభై మందిని వేరొక గుహలోను దాచాను. వారికి అన్న పానాదులిచ్చి ఆదుకున్నాను. 14 ఇప్పుడు నన్ను వెళ్లి నీవిక్కడ వున్నట్లు రాజుతో చెప్పమంటున్నావు. రాజు నన్ను చంపేస్తాడు!”
15 అది విన్న ఏలీయా, “సర్వశక్తిమంతుడైన యెహోవా సాక్షిగా ఈ రోజు నేను రాజు ముందు నిలుస్తానని ప్రమాణం చేస్తున్నాను” అని అన్నాడు.
16 అందువల్ల ఓబద్యా రాజైన అహాబు వద్దుకు వెళ్లాడు. ఏలీయా ఎక్కడ వున్నదీ అతనికి చెప్పాడు. రాజైన అహాబు ఏలీయాను చూడటానికి వెళ్లాడు.
బెరయలో
10 అర్థరాత్రి కాగానే సోదరులు పౌలును, సీలను బెరయ అనే పట్టణానికి పంపించారు. బెరయకు వచ్చినవాళ్ళు యూదుల సమాజమందిరానికి వెళ్ళారు. 11 థెస్సలోనీక వాళ్ళకన్నా బెరయవాళ్ళు మర్యాద కలవాళ్ళు. వాళ్ళు దైవసందేశాన్ని శ్రద్ధతో వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథం చదివి, ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. 12 చాలా మంది యూదులు విశ్వాసులయ్యారు. వాళ్ళలాగే ముఖ్యమైన గ్రీకు స్త్రీలు, పురుషులు కూడా విశ్వాసులయ్యారు.
13 పౌలు దైవసందేశాన్ని బెరయలో కూడా ఉపదేశిస్తున్నాడని థెస్సలోనీకలోని యూదులకు తెలిసింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి ప్రజలను పురికొలిపి, వాళ్ళలో అల్లర్లు రేకెత్తించారు. 14 వెంటనే సోదరులు పౌలును సముద్ర తీరానికి పంపారు. సీల, తిమోతి బెరయలోనే ఉండిపోయారు. 15 పౌలుతో వెళ్ళినవాళ్ళు అతనితో కలిసి ఏథెన్సుదాకా వెళ్ళారు. సీలను, తిమోతిని అయినంత త్వరలో రమ్మనమని పౌలు వాళ్ళ ద్వారా కబురు పంపాడు. ఈ వార్తతో వాళ్ళు తిరిగి బెరయకు వెళ్ళిపోయారు.
© 1997 Bible League International