Revised Common Lectionary (Complementary)
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
8 ఒక వేళ ప్రజలు తమ పిల్లలకు దేవుని ఆదేశాలు ఉపదేశిస్తే,
అప్పుడు ఆ పిల్లలు తమ పూర్వీకుల్లా ఉండరు. వారి పూర్వీకులు దేవునికి విరోధంగా తిరిగారు.
వారు ఆయనకు విధేయులగుటకు తిరస్కరించారు.
ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలో వారు మొండి ప్రజలు.
17 కాని ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేస్తూనే పోయారు.
అరణ్యంలో కూడ సర్వోన్నతుడైన దేవునికి వారు విరోధంగా తిరిగారు.
18 అప్పుడు ఆ ప్రజలు దేవుని పరీక్షించాలని తీర్మానించారు.
కేవలం వారి ఆకలిని తృప్తి పరచుటకు ఆహారం కోసం వారు దేవుని ఆడిగారు.
19 వారు దేవునికి విరోధంగా మాట్లాడారు.
“ఎడారిలో దేవుడు మనకు ఆహారం ఇవ్వగలడా?
20 దేవుడు బండను కొట్టాడు. కాగా నీళ్ల ప్రవాహం బయటకు వచ్చింది.
తప్పక ఆయన మనకు కొంత రొట్టె, మాంసం ఇవ్వగలడు” అని వారన్నారు.
21 ఆ ప్రజలు చెప్పింది యెహోవా విన్నాడు.
యాకోబు[a] మీద దేవునికి చాలా కోపం వచ్చింది.
ఇశ్రాయేలు మీద దేవునికి చాల కోపం వచ్చింది.
22 ఎందుకంటే ఆ ప్రజలు ఆయనయందు నమ్మకముంచలేదు.
దేవుడు వారిని రక్షించగలడని వారు విశ్వసించలేదు.
23-24 కాని అప్పుడు దేవుడు పైన మేఘాలను తెరిచాడు.
వారికి ఆహారంగా ఆయన మన్నాను కురిపించాడు.
అది ఆకాశపు ద్వారాలు తెరచినట్టు
ఆకాశంలోని ధాన్యాగారంనుండి ధాన్యం పోసినట్టు ఉంది.
25 ప్రజలు దేవదూతల ఆహారం తిన్నారు.
ఆ ప్రజలను తృప్తిపరచుటకు దేవుడు సమృద్ధిగా ఆహారం పంపించాడు.
26-27 అంతట దేవుడు తూర్పు నుండి ఒక బలమైన గాలి వీచేలా చేశాడు.
వర్షం కురిసినట్లుగా పూరేళ్లు[b] వారిమీద వచ్చి పడ్డాయి.
దేవుని మహా శక్తి తేమాను నుండి గాలి వీచేలా చేసింది.
ఆ పక్షులు చాలా విస్తారంగా ఉండినందుచేత నీలాకాశం నల్లగా మారిపోయింది.
28 ఆ ప్రజల గుడారాల చుట్టూరా, వారి ఇండ్ల మధ్యలో
ఆ పక్షులు వచ్చి పడ్డాయి.
29 తినేందుకు వారికి సమృద్ధిగా ఉంది.
కాని తమ ఆకలి తమని పాపం చేసేలా వారు చేసుకున్నారు.
ప్రథమ పంట
26 “మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు త్వరలో ప్రవేశిస్తారు. మీరు అక్కడ మీ నివాసం ఏర్పరచుకొన్నప్పుడు 2 మీరు ప్రథమ ఫలాలు కొన్ని తీసుకొని ఒక బుట్టలో పెట్టాలి. యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అది మీకు లభించిన ప్రథమ పంట అవుతుంది. ఈ ప్రథమ పంట కొంత ఉన్న ఆ బుట్టను తీసుకొని, మీ దేవుడైన యెహోవా నిర్ణయించే స్థలానికి వెళ్లండి. అది యెహోవా తనకోసం ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకొనే స్థలం. 3 అప్పటికి అక్కడ పరిచర్య చేస్తుండే యాజకుని దగ్గరకు మీరు వెళ్లాలి. ‘యెహోవా మనకు ఇస్తానని మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలోనికి నేను వచ్చేసానని నా దేవుడైన యెహోవాకు నేడు నేను ప్రకటిస్తాను’ అని నీవు ఆతనితో చెప్పాలి.
4 “అప్పుడు నీ చేతిలోని బుట్టను యాజకుడు తీసుకొంటాడు. నీ దేవుడైన యెహోవా బలిపీఠం ఎదుట అతడు దానిని క్రింద ఉంచుతాడు. 5 అప్పుడు అక్కడ నీ దేవుడైన యెహోవా ఎదుట నీవు ఇలా చెప్పాలి: ‘నా పూర్వీకుడు ఒక సంచార అరామీయుడు. అతడు ఈజిప్టులోనికి వెళ్లి, అక్కడ నివసించాడు. అతడు అక్కడికి వెళ్లినప్పుడు అతని కుటుంబంలో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే అక్కడ ఈజిప్టులో అతడు అనేకమంది ప్రజలుగా, శక్తివంతమైన ఒక గొప్ప జనంగా తయారయ్యాడు. 6 ఈజిప్టువాళ్లు మమ్మల్ని నీచంగా చూశారు. వాళ్లు మమ్మల్ని కష్టపెట్టి, బానిస పని బలవంతంగా మాతో చేయించారు. 7 అప్పుడు మేము మా పూర్వీకుల దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టి, వారిని గూర్చి ఆరోపణ చేసాము. యెహోవా మా మొర్ర విన్నాడు. మా కష్టం, మా కఠినమైన పని, మా శ్రమ ఆయన చూశాడు. 8 అప్పుడు యెహోవా తన మహా శక్తి, ప్రభావాలతో ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. గొప్ప అద్భుతాలు, మహాత్యాలు ఆయన చేశాడు. భయంకరమైన సంగతులు జరిగేటట్టు ఆయన చేసాడు. 9 కనుక ఆయనే మమ్మల్ని ఈ దేశానికి తీసుకొనివచ్చాడు. పాలు, తేనెలు ప్రవహించుచున్న ఈ మంచి దేశాన్ని ఆయన మాకు యిచ్చాడు. 10 ఇప్పుడు యెహోవా, నీవు మాకు యిచ్చిన దేశంలోని ప్రథమ పంటను నీకు తెచ్చాను.’
“తర్వాత నీ పంటను నీ దేవుడైన యెహోవా ఎదుట క్రింద పెట్టాలి. మరియు మీరు ఆయనను ఆరాధించాలి. 11 అప్పుడు మీ దేవుడైన యెహోవా మీకూ, మీ కుటుంబానికీ ఇచ్చిన మంచి పదార్థాలన్నింటినీ మీరు తిని ఆనందించవచ్చును. మీ మధ్య నివసించే లేవీయులు, విదేశీయులతో మీరు వాటిని పంచుకోవాలి.
12 “ప్రతి మూడవ సంవత్సరం దశమభాగాల సంవత్సరం. ఆ సంవత్సరం మీ పంటలోని దశమ భాగాలన్నీ అర్పించటం పూర్తి అయ్యాక దానిని మీరు లేవీయులకు, విదేశీయులకు, ఆనాథలకు, విధవలకు ఇవ్వాలి. అప్పుడు వారు ప్రతి పట్టణంలో తిని తృప్తి పడవచ్చు. 13 మీ దేవుడైన యెహోవాతో మీరు ఇలా చెప్పాలి: ‘నా పంటలోని పవిత్ర భాగాన్ని (దశమ భాగం) నేను నా ఇంటినుండి తీసాను. దానిని లేవీయులకు, విదేశీయులకు, అనాథలకు, విధవలకు నేను ఇచ్చాను. నీవు నాకు ఇచ్చిన ఆదేశాలన్నిటినీ నేను పాటించాను. నేను వాటిని మరచిపోలేదు. 14 నేను దుఃఖ సమయంలో ఈ ఆహారాన్ని తినలేదు. నేను అపవిత్రంగా ఉన్నప్పుడు ఈ ఆహారాన్ని కూర్చలేదు. ఈ ఆహారంలో ఏదీ చనిపోయిన వారికి నేను అర్పించలేదు. యెహోవా, నా దేవా, నేను నీకు విధేయుడనయ్యాను. నీవు నాకు ఆదేశించిన వాటన్నింటినీ నేను చేసాను. 15 పరలోకంలోని నీ పవిత్ర నివాసంనుండి క్రిందికి చూడు, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించు. నీవు మా పూర్వీకులకు వాగ్దానం చేసినట్టు మాకు ఇచ్చిన, పాలు, తేనెలు ప్రవహించుచున్న దేశాన్ని నీవు ఆశీర్వదించు.’
37 ఇది విని ప్రజల హృదయాలు కదిలిపొయ్యాయి. వాళ్ళు పేతురు మరియు యితర అపొస్తలులను, “సోదరులారా! మేము ఏం చెయ్యాలి?” అని అడిగారు.
38 పేతురు ఈ విధంగా జవాబు చెప్పాడు: “మీలో ప్రతి ఒక్కడూ పాప క్షమాపణ నిమిత్తం మారుమనస్సు కలిగి యేసు క్రీస్తు పేరిట బాప్తిస్మము పొందాలి. అప్పుడు మీ పాపాలు క్షమించబడ్తాయి. మీకు పవిత్రాత్మ వరం లభిస్తుంది. 39 దేవుడు ఈ వాగ్దానాన్ని మీకోసం, మీ సంతానాని కోసం, ప్రభువు ఆహ్వానించబోయే దూర ప్రాంతాల వాళ్ళకందరి కోసం చేసాడు.”
40 వాళ్ళకు అనేక మాటల ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. అంతేకాక, వాళ్ళతో ఈ విధంగా బ్రతిమిలాడాడు: “వక్రబుద్ధులున్న ఈ తరం వాళ్ళనుండి విడిపోయి రక్షణ పొందండి.” 41 అతని సందేశాన్ని అంగీకరించినవాళ్ళు బాప్తిస్మము పొందారు. ఆ రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
విశ్వాసుల సహవాసం
42 వాళ్ళు అపొస్తలుల బోధను వింటూ సహవాసములోను, రొట్టె విరుచుటలోను పాలి భాగస్థులై, ప్రార్థన చేయుటలో నిమగ్నులై యుండేవాళ్ళు. 43 దేవుడు అపొస్తలుల ద్వారా ఎన్నో అద్భుతాలు చేసాడు. చిహ్నాలు చూపాడు. ప్రతి ఒక్కనిలో దైవ భీతి కలిగింది. 44 భక్తులంతా ఒకే చోట సమావేశమయ్యారు. తమ దగ్గరున్న ప్రతి వస్తువును అందరితో కలిసి పంచుకొనేవాళ్ళు. 45 తమ ఆస్తిని, వస్తువుల్ని అమ్మి అవసరమున్న వాళ్ళకు యిచ్చేవాళ్ళు. 46 ప్రతి రోజు మందిరావరణంలో ఒకే ఉద్దేశ్యంతో సమావేశమయ్యేవాళ్ళు. ఇండ్లలో సమావేశమై ఆహారాన్ని పంచుకొని తినేవాళ్ళు. మంచి మనస్సుతో అమితానందంగా భుజించేవాళ్ళు, 47 దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ప్రజలందరూ వాళ్ళను యిష్టపడేవాళ్ళు. ప్రభువు తాను రక్షించినవాళ్ళను విశ్వాసులతో చేరుస్తూ వచ్చాడు.
© 1997 Bible League International