Revised Common Lectionary (Complementary)
8 యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా, అందరి యెడలా మంచివాడు.
దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!
యెహోవా ఒక్కడు మాత్రమే దేవుడు
44 “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు చేసుకొన్నాను. నేను చెప్పే సంగతులు విను. 2 నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటినుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ[a] నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.
3 “దాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది. 4 వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుతారు. నీటి కాలువల పక్కగా పెరిగే చెట్లలా ఉంటారు వారు.
5 “ఒక వ్యక్తి అంటాడు, ‘నేను యెహోవాకు చెందినవాడను’ అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి ‘నేను యెహోవావాడను,’ అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(లూకా 11:9-13)
7 “అడిగితే లభిస్తుంది. వెతికితే దొరుకుతుంది. తట్టితే తలుపు తెరుచుకుంటుంది. 8 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన ప్రతి ఒక్కనికి దొరుకుతుంది. తట్టిన ప్రతి ఒక్కని కోసం తలుపు తెరుచుకుంటుంది.
9 “రొట్టె నడిగితే రాయినిచ్చే తండ్రి మీలో ఎవడైనా ఉన్నాడా? 10 లేక చేపనడిగితే పామునెవరైనా యిస్తారా? 11 దుష్టులైన మీకే మీ పిల్లలకు మంచి కానుకలివ్వాలని తెలుసు కదా! మరి అలాంటప్పుడు పరలోకంలోవున్న మీ తండ్రి తన్నడిగిన వాళ్ళకు మంచి కానుకలివ్వడా? తప్పకుండా యిస్తాడు.
© 1997 Bible League International