Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
12 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు. 2 సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు. 3 జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు
4 “కాని, దానియేలూ, నీవు, ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.
5 అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు. 6 నార బట్టలు ధరించిన వ్యక్తి నదీజలాలమీద ఉన్నాడు. ఆ ఇరువురిలో ఒకడు, “ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?” అని నార బట్టలు ధరించినవాన్ని అడిగాడు.
7 నార బట్టలు ధరించి నదీజలాలమీదనున్న వ్యక్తి ఆకాశం వైపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి, సజీవుడైన దేవుని నామం మీద ప్రమాణం చేయటం నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, అర్ధకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం కాగానే ఈ సంగతులన్నీ నెరవేరుతాయి.”
8 నేను విన్నాను, కాని అర్థము చేసుకోలేకపోయాను. అందువల్ల, “అయ్యా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను.
9 అందుకతడు, “దానియేలూ! నీవు దాటిపో. ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి రహస్యంగా ఉంటాయి. 10 చాలామంది తమ్మును తాము పరిశుద్ధులుగా చేసుకొంటారు. తమ్మును తాము తెలుపుగాను, శుద్ధులుగాను చేసుకొంటారు. కాని చెడ్డవాళ్లు చెడ్డవాళ్లగానే ఉంటారు. ఆ దుర్జనులు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసుకొంటారు.
11-12 “అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలుకొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం వరకు ఒక వెయ్యి మూడువందల ముప్పైయైదు రోజులు వేచియుండి, ఆ దినముల అంతము వరకు ఉండువాడు ధన్యుడు.
13 “నీవు నీ జీవిత అంతం వరకు బ్రతికి, నీ విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు లేపబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.”
యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు
15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
18 “ఆయన నేనెన్నుకున్న
నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(A)
© 1997 Bible League International