Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: “నాశనం చేయకు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
75 దేవా, మేము నిన్ను స్తుతిస్తున్నాము.
మేము నీ నామాన్ని స్తుతిస్తున్నాము.
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మేము చెబుతున్నాము.
2 దేవుడు ఇలా చెబుతున్నాడు; “తీర్పు సమయాన్ని నేను నిర్ణయిస్తాను.
న్యాయంగా నేను తీర్పు తీరుస్తాను.
3 భూమి, దాని మీద ఉన్న సమస్తం కంపిస్తూ ఉన్నప్పుడు
దాని పునాది స్తంభాలను స్థిర పరచేవాడను నేనే.”
4-5 “కొందరు మనుష్యులు చాలా గర్విష్ఠులు. తాము శక్తిగలవారమని, ప్రముఖులమని తలుస్తారు.
కాని ‘అతిశయ పడవద్దు’ ‘అంతగా గర్వపడవద్దు.’ అని నేను ఆ మనుష్యులతో చెబుతాను.”
6 తూర్పునుండిగాని పడమరనుండిగాని
ఎడారినుండి గాని వచ్చే ఎవరూ ఒక మనిషిని గొప్ప చేయలేరు.
7 దేవుడే న్యాయమూర్తి, ఏ మనిషి ప్రముఖుడో దేవుడే నిర్ణయిస్తాడు.
దేవుడు ఒక వ్యక్తిని ప్రముఖ స్థానానికి హెచ్చిస్తాడు.
ఆయనే మరొక వ్యక్తిని తక్కువ స్థానానికి దించివేస్తాడు.
8 దుర్మార్గులను శిక్షించుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. యెహోవా చేతిలో ఒక పాత్రవుంది.
అది ద్రాక్షారసంలో కలిసిన విషపూరితమైన మూలికలతో నిండివుంది.
ఆయన ఈ ద్రాక్షారసాన్ని (శిక్ష) కుమ్మరిస్తాడు.
దుర్మార్గులు చివరి బొట్టు వరకు దాన్ని తాగుతారు.
9 ఈ సంగతులను గూర్చి నేను ఎల్లప్పుడూ ప్రజలకు చెబుతాను.
ఇశ్రాయేలీయుల దేవునికి నేను స్తుతి పాడుతాను.
10 దుర్మార్గుల నుండి శక్తిని నేను తీసివేస్తాను.
మంచి మనుష్యులకు నేను శక్తినిస్తాను.
యెరూషలేం భవిష్యత్తు
3 యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. 2 నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు. 3 యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. 4 దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టే చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు. 5 కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.
6 దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడకు ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు. 7 నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి, నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే, నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువగా చేయాలనుకొన్నారు!
8 యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాలనుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడుకొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది! 9 అప్పుడు నేను ఇతర జనాంగములనుండి ప్రజలను మార్పు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువగలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధిస్తారు. 10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరంనుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు. మరియు నాకు వారు కానుకలు తెస్తారు.
11 “యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలనుగూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మార్గులందరినీ యెరూషలేమునుండి నేను తొలగించి వేస్తాను. ఆ గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు. 12 దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు. 13 ఇశ్రాయేలులో మిగిలినవారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని, ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు-వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”
హాగరు మరియు శారా
21 ధర్మశాస్త్రం చెప్పినట్లు నడుచుకోవాలని అనుకొన్న మీకు ధర్మశాస్త్రం ఏమి చెపుతుందో తెలియదా? 22 అబ్రాహాముకు ఇద్దరు పుత్రులని, ఒకడు బానిస స్త్రీకి జన్మించాడని, మరొకడు స్వంత స్త్రీకి జన్మించాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి వుంది. 23 బానిస స్త్రీ వల్ల అతనికి జన్మించిన కుమారుడు ప్రకృతి సిద్ధంగా జన్మించాడు. కాని స్వంత స్త్రీకి జన్మించిన వాడు వాగ్దానం వల్ల జన్మించాడు.
24 ఈ వృత్తాంతం అలంకారికంగా చెప్పబడింది. ఆ యిరువురు స్త్రీలు రెండు ఒడంబడికలతో పోల్చబడ్డారు. సీనాయి పర్వతం మీద నుండి ఒక ఒడంబడిక వచ్చింది. దీని వల్ల జన్మించిన వాళ్ళు బానిసలు కావాలని ఉంది. “హాగరు” ను ఆ మొదటి ఒడంబడికతో పోల్చవచ్చును. 25 అరేబియాలో ఉన్న సీనాయి పర్వతంతో కూడా “హాగరు” ను పోల్చవచ్చు. ఆమెను ప్రస్తుతం యెరూషలేముతో పోల్చవచ్చు. ఎందుకంటే ఆ పట్టణపు ప్రజలు కూడా ఆమె సంతానంలా బానిసలు. 26 కాని పరలోకంలో ఉన్న యెరూషలేము స్వతంత్రమైంది. అది మన తల్లి. 27 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“ఓ గొడ్రాలా! పిల్లల్ని కననిదానా!
ఆనందించు, పురిటి నొప్పులు పడనిదానా!
గట్టిగా కేకలు వేయి!
ఎందుకనగా భర్త వున్న స్త్రీకన్నా భర్త
లేని స్త్రీకి పిల్లలు ఎక్కువ.”(A)
28 కనుక సోదరులారా! మీరు ఇస్సాకువలే వాగ్దానపు పిల్లలుగా జన్మించలేదు. 29 ఆనాడు ప్రకృతి సిద్ధంగా జన్మించిన కుమారుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జన్మించిన కుమారుణ్ణి హింసించాడు. ఈనాడు కూడా అదే జరుగుతోంది. 30 కాని ధర్మశాస్త్రం ఏమి చెపుతున్నది? “బానిస స్త్రీ కుమారుడు, స్వంత స్త్రీకి జన్మించిన కుమారునితో ఆస్తి పంచుకోలేడు. కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బయటికి తరిమివేయండి”(B) అని వ్రాయబడి ఉంది. 31 సోదరులారా! మనము స్వంత స్త్రీకి జన్మించిన బిడ్డలం. బానిస స్త్రీకి జన్మించిన బిడ్డలం కాము.
క్రీస్తు వల్లనే స్వేచ్ఛ
5 మనము స్వతంత్రంగా ఉండాలని క్రీస్తు మనకు స్వేచ్ఛ కలిగించాడు. కనుక పట్టుదలతో ఉండండి. “ధర్మశాస్త్రం” అనే బానిసత్వంలోనికి పోకుండా జాగ్రత్త పడండి.
© 1997 Bible League International