Revised Common Lectionary (Complementary)
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
5 యెహోవా, నీవు గొప్ప కార్యాలు చేశావు.
నీ తలంపులు మేము గ్రహించటం మాకు ఎంతో కష్టతరం.
6 నీతో పోల్చినట్లయితే మనుష్యులు బుద్ధిలేని జంతువుల్లాంటి వారు.
మేము ఏదీ గ్రహించలేని బుద్ధిలేని వాళ్లలా ఉన్నాము.
7 దుర్మార్గులు గడ్డిలా మొలిచినా,
చెడ్డవాళ్లు అభివృద్ధి చెందినా వారు శాశ్వతంగా నాశనం అవుతారు.
8 కాని యెహోవా, నీవు శాశ్వతంగా గౌరవించబడతావు.
9 యెహోవా, నీ శత్రువులు అందరూ నాశనం చేయబడతారు.
చెడు కార్యాలు చేసే ప్రజలందరూ నాశనం చేయబడతారు.
10 కాని నీవు నన్ను బలపరుస్తావు. బలమైన కొమ్ములుగల పొట్టేలువలె నీవు నన్ను చేస్తావు.
సేదదీర్చే నీ తైలాన్ని నీవు నా మీద పోశావు.
11 నా శత్రువుల పతనాన్ని నా కండ్లారా చూచాను.
నా శత్రువుల నాశనాన్ని నా చెవులారా విన్నాను.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
3 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి. 4 వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి. 5 ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది. మీరు మళ్ళీ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 6 నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.
7 “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు. 8 మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.
9 “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను. 10 ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది. 11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను. 12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు. 13 నేను యెహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేస్తాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
అవిధేయతకు దేవుని శిక్ష
14 “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి. 15 నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే. 16 మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు. 17 నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.
18 “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను. 19 మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశం వర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు. 20 మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.
దేవునికి నచ్చిన జీవితం
4 సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. 2 యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. 3 మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. 4 మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి.[a] 5 పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. 6 ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. 7 దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. 8 అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు.
© 1997 Bible League International